ఖమ్మం, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖమ్మం వ్యవసాయం/మధిర: ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే పనిలో ఆ మంత్రులు నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతు ధర ఎందుకు దక్కడం లేదనే విషయాన్ని ఏఒక్కరోజూ తెలుసుకునే తీరిక ఆ ముగ్గురు మంత్రులకు లేకుండా పోయిందని విమర్శించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పత్తి యార్డును మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మార్కెట్ యార్డులో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. వరి ధాన్యం విషయంలో సన్నాలకు బోనస్ ఇస్తామని ఇవ్వకుండా నేడు మోసం చేస్తున్నారని విమర్శించారు.
జిల్లాలో ఈ సంవత్సరం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే నేటివరకు 19 వేల మెట్రిక్ టన్నులే కొనుగోళ్లు జరిగాయని, నేటివరకు జిల్లాలో ఒక్క రైతుకు కూడా బోనస్ ఇవ్వలేదని మండిపడ్డారు. సన్నాలు కొనేందుకు కొర్రీలు పెట్టడంతో రైతులు ప్రైవేట్‌లోనే అమ్ముకుంటున్నారని, దీంతో ఆంధ్రా దళారులకు కలిసి వచ్చిందని తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కి, రైతులను అపహాస్యం చేసిందని విమర్శించారు. అకాల వర్షాల వల్ల పత్తి పంట వరద పాలైందని, వరదల నుంచి కాపాడుకున్న పంటకు సైతం మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదని తెలిపారు. ఎకరానికి పది క్వింటాళ్లకు పైన రావాల్సిన దిగుబడి సగం కూడా రావడం లేదని, పండిన పంటకు క్వింటాల్ రూ.6 వేల నుంచి రూ.6,500 మాత్రమే పలుకుతుందని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
25 లక్షల టన్నుల పత్తి కొంటామని చెప్పిన ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేసిందని, చివరికి లక్ష మెట్రిక్ టన్నులు సైతం కొనలేదని హరీశ్‌రావు విమర్శించారు. రైతు పంట పూర్తిగా దళారుల పాలయ్యిందని ధ్వజమెత్తారు. ఒకవైపు దిగుబడి రాక, మరోవైపు పెట్టుబడి సాయం అందక, మద్దతు ధర దొరకక రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపు ప్రతిపక్షాలను ఇబ్బందులను గురిచేయడమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతుబంధు ఇవ్వలేదు, కౌలు రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను విస్మరించారని, పంటలకు బీమా అని చెప్పి అది కూడా చేయలేదని మండిపడ్డారు. ఖమ్మం మార్కెట్లో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని, పత్తి రైతుకు కూడా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిరుడు ఇదే ఖమ్మం మార్కెట్లో పత్తి క్వింటాల్ రూ.11 వేలు పలికితే ప్రస్తుతం రూ.6,500కు మించడం లేదు. నిరుడు మిర్చిపంట క్వింటాల్ రూ.22 వేలు వరకు పలికితే ఈ ఏడాది రూ.13 వేలకు మించి పలకడం లేదు. దీన్నిబట్టే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు జరుగుతున్న అన్యాయం తెలుస్తున్నది. అధికారులు కొర్రీలు పెట్టి అన్నదాతలను ఇబ్బందులు పెడుతున్నారు. ఫలితంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది.
– హరీశ్‌రావు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలకు, కమిషనర్ మాటలకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాక, గన్నీ బ్యాగులు లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని, అన్ని పంటల ధరలు పడిపోతుండడం బాధ కలిగిస్తున్నదని తెలిపారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదని హరీశ్‌రావు హెచ్చరించారు. రైతులపై ప్రేమ ఉంటే చెప్పిన 10 రకాల పంటలకు క్వింటాల్ రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, గొలుసు శ్రీనివాసయాదవ్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బొమ్మెర రాంమూర్తి, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అన్నీ తుస్సుమన్నాయి. కల్యాణలక్ష్మి కింద ఒక్కో వధువుకు అందజేసే రూ.లక్షతోపాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఆరు లక్షల మంది ఆడబిడ్డల వివాహాలు జరిగినందున వారందరికీ ఆరు లక్షల తులాల బంగారం బాకీ పడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఈ 11 నెలలకు కలిపి రూ.27,500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
– హరీశ్‌రావు
‘మార్పు మార్పు అంటే ఏదో జరుగుతుందని మోసపోయాం. తీరా కాంగ్రెస్ వచ్చినంక గోస పడుతున్నం. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండె. ఆనాడు ఇంత కష్టం రాలేదు.. అని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉన్న రైతులు, ఖమ్మం నగరవాసులు హరీశ్‌రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పత్తియార్డులో రైతులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. పంటల సాగు, ప్రభుత్వ పథకాల తీరుపైన హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమకు జరుగుతున్న తీరును హరీశ్‌రావుకు చెప్పుకోసాగారు. కేసీఆర్ ఇచ్చే సాయంకంటే డబుల్ ఇస్తామంటే తాము మోసపోయామని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల వరదలకు నష్టపోయిన సారథినగర్, దానవాయిగూడెం వాసులు సైతం బీఆర్ఎస్ నేతలను కలిసి తమకు నేటివరకు వరద సాయం అందలేదని వాపోయారు. మార్కెట్లో రెల్లుడు మహిళా కార్మికులు సైతం హరీశ్‌రావుకు తమ బాధలు చెప్పుకున్నారు. తులం బంగారం, మహాలక్ష్మి పేరుతో రూ.2,500 ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అందడం లేదని వాపోయారు. వారి బాధలు వింటూ వారి వివరాలను హరీశ్‌రావు పుస్తకంలో నోట్ చేసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని రైతులకు భరోసా ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అన్యాయంగా, అక్రమంగా పోలీసులు కేసులు పెడితే వడ్డీతో సహా చెల్లిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. మూసీ కంటే ముఖ్యమంత్రి నోరే మురుగు కంపు కొడుతున్నదని ధ్వజమెత్తారు. అదానీని అరెస్టు చేయాలని ఢిల్లీలో రాహుల్‌గాంధీ అంటుంటే.. రాష్ట్రంలో మాత్రం అదానీతో రేవంత్‌రెడ్డి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు చేయించుకుంటున్నారని విమర్శించారు. పొరుగున ఏపీ మాదిరిగా.. పెంచిన పింఛన్లను బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబాలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడిపై అక్రమ కేసులు బనాయించి ఆయనను జైలుపాలు చేయడం దారుణమని హరీశ్‌రావు విమర్శించారు. భట్టి విక్రమార్క విద్యుత్తు శాఖకు మంత్రయి ఉండి కూడా ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మృతిచెందిన రైతు కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని విమర్శించారు. పైగా, ఆ రైతుకు అండగా నిలిచిన వారిపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
భద్రాద్రి రాముడిపై ఒట్టేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. చివరికి రుణమాఫీ కూడా చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో భూవివాదంలో ఆత్మహత్య చేసుకున్న బోజడ్ల ప్రభాకర్‌రావు కుటుంబాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కుటుంబాన్ని, లచ్చగూడెంలో విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో మృతిచెందిన గూని ప్రసాద్ కుటుంబాన్ని హరీశ్‌రావు ఇతర నేతలకు కలిసి పరామర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రావడం కోసం దేవుళ్లపై ఒట్లేసిన ఆయన.. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్పై తిట్ల దండకం మొదలు పట్టారని దుయ్యబట్టారు. సీఎం పేరు రేవంత్‌రెడ్డి కాదని, సంక్షేమ పథకాల ఎగవేతల రెడ్డి అని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేస్తున్నడు. మద్యం అమ్మకాలు పెరగకుంటే సీఎం చాలా బాధపడుతున్నారు. అమ్మకాలు లేనిచోట సదరు అధికారులకు సీఎం మెమోలు జారీ చేయించడం హాస్యాస్పదం. ఈ విధంగానే రాష్ట్రవ్యాప్తంగా 35 మంది ఎక్సైజ్ అధికారులకు నోటీసులు జారీఅయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డికి మద్యం అమ్మకాల మీద ఉన్న శ్రద్ధ.. పంటల గిట్టుబాలు ధరలపై లేకపోయింది.
– హరీశ్‌రావు
ఇక నుంచి స్థానికంగానే ఉంటానని, హామీలన్నీ అమలు చేస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చిన ఈ ప్రాంత ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. వాటన్నింటినీ అమలు చేశారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టమని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఏడాది పాలనలో ఈ పాలకులు ఆత్మ విమర్శ చేసుకొని తమ తప్పులను ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని హితవు పలికారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపైనా పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాలి. అలాకాకుండా ఒక పార్టీకి లోబడి పనిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయినప్పటికీ వారు తీరు మార్చుకోకుంటే ఆంధ్రాలో పోలీసులకు పట్టిన గతే.. ఇక్కడా పడుతుంది
– హరీశ్‌రావు