హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ) : నాడు 45 రోజులు అసెంబ్లీ నడపాలని రాద్ధాంతం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సభ నడిపేందుకు జంకుతున్నదని, ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కి లేవనెత్తిన ఏ ఒక్క అంశానికీ సమాధానం చెప్పకుండా పారిపోతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండేండ్ల పాలనలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన రేవంత్ సర్కారు, అసెంబ్లీని సైతం భ్రష్టుపట్టించిందని ఆయన విరుచుకుపడ్డారు. ఆదివారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన చిట్‌చాట్ చేశారు. విలేకరులు అడిగిన ప్రతిప్రశ్నకు సావధానంగా సమాధానాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల సభ నిర్వహణ, కృష్ణా జలాల్లో వాటా సాధించడంలో విఫలమైన సర్కారుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ అసెంబ్లీని అంగ, మందబలంతో నడుపుతున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే రచ్చచేయడం బంద్‌పెట్టి చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా, గోదావరి జలాలు, ఇతర ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ పక్షం సిద్ధంగా ఉన్నదని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇస్తే తమకు ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉన్నదని స్పష్టంచేశారు. కృష్ణాలో 299 టీఎంసీలకు ఒప్పుకొన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఈ ఒప్పందాన్ని బీఆర్ఎస్ అనేకసార్లు వ్యతిరేకించిందని పేర్కొన్నారు. 2014లో బీఆర్ఎస్ గద్దెనెక్కిన 42 రోజుల్లో ఢిల్లీకి వెళ్లి అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశామని, కేంద్రానికి 32 లేఖలు రాశామని గుర్తుచేశారు. కృష్ణాజలాల పునః పంపిణీతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ సభ్యుల్లాగా ప్రిపేర్ కాకుండా మేం అసెంబ్లీకి రాము. అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అసెంబ్లీకి వస్తాం. అది పాలమూరు ప్రాజెక్టయినా, గోదావరి జలాల విషయమైనా.. ఏ టాపిక్ గురించైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తం. మైక్ కట్ చేయకుండా, మంత్రులు అడ్డుకోకుండా ఉంటే ఏ అంశంపైనైనా మాట్లాడేందుకు మేం రెడీ. స్పీకర్ గతంలో మాదిరిగా సభా సంప్రదాయాలు, మర్యాదను కాపాడాలి.
– హరీశ్‌రావు
ఈ అంశంపై అవకాశమిస్తే ప్రభుత్వాన్ని ఎండగడతామని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్‌పై వేస్తున్న అభాండాలకు దీటుగా సమాధానం చెప్పి సర్కారు చెంప ఛెల్లుమనిపిస్తామని ప్రకటించారు. బేసిన్లు లేవు, బేషజాలు లేవని నాడు కేసీఆర్ ఎందుకు చెప్పారో అనే విషయాన్ని కూడా సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం రచ్చచేసి పారిపోయేందుకు యత్నించే అవకాశమున్నదని, గత అనుభవాలను చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. హుందా అనే పదం పలికే అర్హత కాంగ్రెస్‌కు లేదని, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సీఎం రేవంత్‌రెడ్డి మాదిరిగా అసెంబ్లీలో చిల్లరగా మాట్లాడలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా అసెంబ్లీ హౌస్ కమిటీలు వేయకపోవడం సిగ్గుచేటని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గతంలో పనిచేసిన అనుభవం ఉన్న శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సైతం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అసలు లోపం స్పీకర్ వద్ద ఉన్నదా? లేదంటే శాసనసభా వ్యవహారాల మంత్రి వద్ద ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘ఎస్టిమేట్స్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉత్తమ్ పద్మావతిరెడ్డిని నియమిస్తే వెంటనే రాజీనామా చేశారు.. అసలు ఎస్టిమేట్స్ కమిటీకి ఎన్నికనే జరగలేదు. పీఎసీ చైర్మన్ పదవికి పాత తేదీతో నామినేషన్లు తీసుకొని చైర్మన్‌ను ఎంపిక చేశారు. కాంగ్రెస్ పాలనలోనే అన్ని వ్యవస్థలు, రంగాలతో పాటు అసెంబ్లీని సైతం భ్రష్టుపట్టించారు’ అని దుమ్మెత్తిపోశారు.
90 టీఎంసీల పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టును 45 టీఎంసీలకు కుదించడం దుర్మార్గం. 45 టీఎంసీలతో ఏ జిల్లాకు నీరందిస్తారు? రంగారెడ్డికి ఇచ్చి పాలమూరు, నల్గొండను ఎండబెడ్తరా? లేకపోతే ముఖ్యమంత్రి సొంత జిల్లాకు తరలించి రంగారెడ్డి, నల్గొండ రైతాంగం నోట్లో మట్టికొడ్తరా? కాదంటే ఉత్తమ్ సొంత జిల్లా నల్గొండకు ఇచ్చి రంగారెడ్డి, పాలమూరు ప్రజలకు దగా చేస్తరా? నిరుడు డిసెంబర్లో డీపీఆర్ వాపస్ వస్తే ఇప్పటిదాకా ఎందురు తిరిగి పంపలేదు. 45 టీఎంసీలు చాలని మంత్రి ఉత్తమ్ లేఖ రాశారా? లేదా? డిఫెన్స్‌లో పడ్డ ప్రతిసారీ అసెంబ్లీ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఇప్పుడలా ప్రజలను తప్పుదోవ పట్టించకుండా సూటిగా సమాధానం చెప్పాలి.
– హరీశ్‌రావు
మొక్కుబడిగా సమావేశాలు పెడితే ప్రజాధనం వృథా. అధికార పక్షానికి నిజంగా చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై 15 రోజలు అసెంబ్లీని నడపాలి. యూరియా కష్టాలు, ఎగ్గొట్టిన రైతుభరోసా, ఆత్మీయ భరోసా, 25శాతం మాత్రమే చేసిన రుణమాఫీ, 1900 కోట్ల పెండింగ్ బోనస్, మహిళలకు ఇస్తామన్న 2,500, జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల ఐదు పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఓపీఎస్ హామీ, పింఛన్ల పెంపు, రూ.5లక్షల ‘హిల్ట్’ కుంభకోణం, ఫార్మాసిటీ ముసుగులో భూ స్కాం, మెస్సీతో రేవంత్ ఫుట్‌బాల్ సోకులు, గురుకులంలో విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజన్ ఘటనలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకురావాలి.
– హరీశ్‌రావు
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి సగటున 32 రోజులు అసెంబ్లీ నిర్వహించాం. కాంగ్రెస్ మాత్రం రెండేండ్లలో సగటున 20రోజులే నడిపించింది. 2024లో 24రోజులు, ఈ ఏడాది 16రోజులు మాత్రమే నడిపింది. అందులో రెండు రోజులు సంతాప తీర్మానాలు, మూడు రోజులు శ్వేతపత్రాలు, ఒక రోజూ ఘోష్ కమిషన్ రిపోర్ట్, మరో రోజు బీసీ రిజర్వేషన్లపై డ్రామాలకు కేటాయించారు. ప్రతిపక్షం లేవనెత్తిన ఏ ఒక్క ఆంశంపై చర్చించనప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. ప్రజలు, ప్రతిపక్షం గొంతునొక్కే దుర్మార్గపు పాలన.. ప్రజాసమస్యల నుంచి పారిపోయే పాలన.
– హరీశ్‌రావు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలకు అంగీకరించిన ప్రభుత్వం ఇప్పుడు తప్పించుకొంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. పాలమూరులో 45 టీఎంసీలు చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారా? లేదా? అని ప్రశ్నించారు. నిరుడు డిసెంబర్లో పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ వాపస్ వస్తే ఇప్పటివరకు తిరిగి ఎందుకు పంపలేదని ఆయన నిలదీశారు. అయినా డిఫెన్స్‌లో పడ్డ ప్రతిసారీ కాంగ్రెస్ అసెంబ్లీ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డ హరీశ్‌రావు, ఇప్పుడైనా ప్రజలను తప్పుదోవ పట్టించకుండా అసెంబ్లీలో సూటిగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించిన ప్రభుత్వం కేసీఆర్ చేసిన పోరాటంతోనే దిగొచ్చిందని ఆయన గుర్తుచేశారు. అప్పుడు అసెంబ్లీలో లెంపలు వేసుకొని నిర్ణయాన్ని వాపస్ తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ డీపీఆర్ వెనక్కి వచ్చిన విషయంపై ప్రశ్నిస్తే నీళ్ల మంత్రి నీళ్లునమిలారని, సీఎం ఎగిరెగిరి పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పి 45 టీఎంసీల ఒప్పందాన్ని వాపస్ తీసుకోవాలని స్పష్టంచేశారు.
కాంగ్రెస్‌ది నిజంగా ప్రజాప్రభుత్వమే అయితే, ప్రజాసమస్యలపై చర్చించే చిత్తశుద్ధి ఉంటే ఈ సెషన్లో 15రోజులు అసెంబ్లీ నడపాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. అయినా చర్చలకు బదులు రచ్చచేస్తూ పారిపోయే ప్రభుత్వం తమ సవాల్‌ను స్వీకరిస్తుందని అనుకోవడం లేదని ఆయన దెప్పిపొడిచారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బాధ్యాతయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం అడిగిన ప్రతిప్రశ్నకు సమాధానం ఇస్తామని, ఏ అంశంపైనైనా మాట్లాడేందుకు సిద్ధమని కుండబద్దలు కొట్టారు. ఘోష్ కమిషన్ రిపోర్టుపై తాను మాట్లాడిన సందర్భంలో ఏడుగురు మంత్రులు, పదుల సంఖ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
స్పీకర్ సైతం గతంలో మాదిరిగా సభా సంప్రదాయాలు, మర్యాదను కాపాడాలని విజ్ఞప్తిచేశారు. గత అసెంబ్లీ సెషన్లో ఆరేడుగురు సభ్యులున్న పార్టీకి ఇద్దరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారని, కానీ ప్రధాన ప్రతిపక్షమైన తమకు కేవలం ఒక్కరికే ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత సమావేశాల్లో అలాంటి పరిస్థితులను పునరావృతం చేయవద్దని స్పీకర్‌ను కోరారు. కానీ ఎన్ని రోజులంటే అన్ని రోజులు సభ నడుపుతామని గొప్పలు చెబుతున్న అధికార కాంగ్రెస్ ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని హరీశ్‌రావు విమర్శించారు. గతంలోనూ ఇలాగే సభను నడిపిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రెండు మూడు రోజులకే పరిమితం చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.