Harish Rao | వరంగల్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జనగామ, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ అసమర్థత కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. వానకాలంలో గోదావరి ప్రవాహం మొదలైన వెంటనే మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపి ఉండాల్సిందని, సకాలంలో ఓఅండ్ఎం పనులు పూర్తిచేసుకొని ఎండాకాలం కోసం నీళ్లను సిద్ధం చేసుకొని ఉంటే రైతులకు ఇప్పుడీ దుస్థితి పట్టేది కాదని తెలిపారు. దేవాదుల ఓఅండ్ఎం కాంట్రాక్టర్‌కు రూ.7 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో 33 రోజులుగా మోటర్లు బంద్ అయ్యాయని, ఫలితంగానే కరువు వచ్చిందని చెప్పారు. రేవంత్ చేతగాని తనంతో ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే లక్ష ఎకరాలు ఎండిపోతున్నాయని వాపోయారు. పోయినసారి కంటే ఈసారి వర్షాలు సమృద్ధిగా పడ్డాయని, వేలాది టీఎంసీల నీళ్లు గోదావరిలో కలిశాయని గుర్తుచేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లను ఒడిసిపడితే.. రేవంత్‌రెడ్డి మాత్రం వృథాగా ఇడిశిపెట్టాడని ఎద్దేవాచేశారు.
ప్రభుత్వంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోరాడి, ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ సెక్రటరీ చుట్టూ తిరిగి 30 రోజులకు రూ.7 కోట్లు విడుదల చేయించుకొని మోటర్లను రిపేర్ చేయించారని చెప్పారు. ఇదివరకే మోటర్లను బాగు చేసి నడిపి ఉంటే భీంఘన్‌పూర్, చలివాగు, ధర్మసాగర్, గడ్డిరామారం, బొమ్మకూరు రిజర్వాయర్లను నింపుకొని తపాస్‌పల్లి దాకా నీళ్లు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు మోటర్లు ఆన్ చేసినా నీళ్లందని పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఇప్పటికే 60, 70 శాతం పంటలు ఎండిపోయినయి. జిల్లాలో కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కనీసం పట్టించుకోరా? సమీక్షించరా? లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతుంటే కాంగ్రెస్ నాయకులకు చీమ కుట్టినట్టయినా లేదా?’ అని నిలదీశారు. వెంటనే దేవాదుల ఫేజ్-3 మోటర్లను ప్రారంభించి పంట పొలాలకు నీళ్లందించాలని, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ స్థలం ఎంపిక, ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా హరీశ్ సోమవారం వరంగల్‌లో పర్యటించారు. సభ కోసం నగర శివారులోని ఉనికిచర్ల, భట్టుపల్లిలో స్థలాలను పరిశీలించారు. అనంతరం హనుమకొండలోని హరిత హోటల్, జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్యతో కలిసి విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి తనది 20-20 మ్యాచ్ అన్నడు మొన్న.. నిజమే ఫైనాన్స్‌లో బిల్లులు ఇవ్వాలంటే 20 శాతం కమీషన్, రెవెన్యూశాఖలో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20 శాతం కమీషన్, మున్సిపల్ శాఖలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ ఇవ్వాలంటే 20 శాతం కమీషన్ ముట్జజెప్పాల్సిందే’ అని దుయ్యబట్టారు.
చంద్రబాబుకు గురుదక్షిణ
చంద్రబాబు నాయుడు కృష్ణా నీళ్లను దోచుకుంటుంటే రేవంత్‌రెడ్డి కనీసం మాట్లాడటం లేదని, బాబును ప్రశ్నించే దమ్ము ఆయనకు లేదని హరీశ్ మండిపడ్డారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మౌనంగా ఉన్నారని విమర్శించారు. నీళ్ల రూపంలో తన గురువు చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడని విమర్శించారు. ‘రేవంత్ గురుదక్షిణ చెల్లింపు కారణంగా నల్లగొండ జిల్లాలో పంటలు ఎండుతున్నయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కూడా పంటలు ఎండుతున్నయి. రెండు జిల్లాల్లో పంటలు ఎండిపోయేందుకు ఏపీ అడ్డగోలుగా కృష్ణానది జలాలను దోచుకోవడమే కారణం’ అని మండిపడ్డారు. ‘తెలంగాణ గురించి బీజేపీ అడగడం లేదు. మన సీతమ్మసాగర్, సమ్మక్క బరాజ్, బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుల అనుమతులను పట్టించుకోవడంలేదు. రాయలసీమ ఎత్తిపోత పథకంపై కేసీఆర్ అలుపెరగని పోరాటం చేసిండు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులం పదవులకు రాజీనామా చేసినం. ఇవ్వాళ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. బనకచర్ల నుంచి గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతుంటే బీఆర్ఎస్ ఒక్కటే ప్రశ్నించింది’ అని గుర్తుచేశారు. ‘మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎండలతో పంటలు ఎండిపోతుంటే కేసీఆర్, హరీశ్‌రావు సంతోష పడుతున్నరన్నడు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎండలు కొట్టినయి. మరి ఆనాడు ఎందుకు పంటలు ఎండలేదు? ఈ రోజే ఎందుకు ఎండుతున్నయి?’ అని నిలదీశారు. మండుటెండల్లోనూ వాగులు, వంకలు, చెరువుల్లో నీళ్లు ఉండేవని, ఎకరం కూడా ఎండకుండా కేసీఆర్ పాలనలో పంట పండిందని గుర్తుచేశారు.
రేవంత్ రాజీనామా చెయ్యాలె
ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మాటకు కట్టుబడి పదవికి రాజీనామా చెయ్యాలని హరీశ్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి చెప్పినట్టు రెఫరెండంలో గ్రాడ్యుయేట్లు, టీచర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ ప్రచారం వల్లే ఆ పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఓడిపోయారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం రేవంత్‌రెడ్డి పని చేసి ఇప్పుడు బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ వల్లే బీజేపీ గెలిచిందని చెప్తున్న రేవంత్‌రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కొడంగల్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలవడంపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్లోనూ బీజేపీ అభ్యర్థి గెలిచారని, వారి కోసమే రేవంత్ పని చేశారా? అని నిలదీశారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని, ఆ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పని చేసిన విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులున్నారని రాహుల్‌గాంధీయే చెప్పారని, తెలంగాణలోనూ ఆ పరిస్థితి ఉన్నదనే విషయం రాహుల్ చూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనను బాడీ షేమింగ్ చేస్తున్నారని, వారి వ్యాఖ్యలను వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నానని చెప్పారు. ‘పొడవు అనేది నాకు దేవుడు ఇచ్చిండు.. రేవంత్, భట్టి వ్యాఖ్యలు వాళ్ల కురచదనానికి నిదర్శనం’ అని చెప్పారు.
రైతుల ఆవేదన చూసి గుండె తరక్కుపోయింది : పల్లా
దేవాదుల నీటిపై ఆధారపడిన జనగామ నియోజకవర్గ రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. దేవాదుల మోటర్లు నడువక పంటలను ఎండుతున్నా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. రైతులు తనవద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల కన్నీళ్లు..కష్టాలను తీర్చేందుకు తనవంతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అధికారులను నిలదీసినా చలనం లేదని మండిపడ్డారు.
అసలైన ప్రజావిప్లవం మిలియన్ మార్చ్ : హరీశ్
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన నిలిపిన అసలు సిసలు ప్రజావిప్లవం మిలియన్ మార్చ్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. నాటి కాంగ్రెస్ పాలకుల ఆంక్షలు, నిర్బంధాల కట్టడిని చిత్తు చేసి జలమార్గం గుండా ట్యాంక్ బండ్‌కు చేరుకొని, మిలియన్ మార్చ్‌లో తాను పాల్గొన్న నాటి అపురూప దృశ్యాలను సోమవారం ఎక్స్‌వేదికగా పంచుకున్నారు. ఈ మహత్తర ఘట్టానికి నేటికి 14 ఏండ్లు పూర్తయ్యాయని, మిలియన్ మార్చ్‌తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తుచేశారు. ‘ఆంక్షల పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టుకొని లక్షలాదిగా తరలివచ్చిన జనం.. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన ఉద్య మ ప్రస్థానంలో అదో కీలక ఘట్టం. ఆ అపురూప దృశ్యాలు ఇప్పటికీ కండ్లెదుట కదలాడుతున్నాయి. నాటి ఉద్యమ పోరాటాలను ఇంకా రగిలిస్తూనే ఉన్నా యి. అణువణువునా.. నిలువెల్లా ఉద్యమస్ఫూర్తిని జ్వలిస్తున్నాయి’ అంటూ పోలీస్ నిర్బంధాలను ఛేదిస్తూ హుస్సేన్‌సాగర్‌లో చిన్న నాటుపడవలో గమ్యస్థానానికి చేరుకున్న ఫొటోలను పోస్ట్ చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి సెల్యూ ట్ చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రాణాలర్పించిన అమరులకు ‘జై తెలంగాణ’ అంటూ జోహార్లు అర్పించారు.
కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నరు
తెలంగాణ సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ చేసిన 14 ఏండ్ల పోరాటం, బంగారు తెలంగాణ లక్ష్యంగా పదేండ్ల పాలన మేళవింపే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని హరీశ్ తెలిపారు. రజతోత్సవ వేడుకలు ఏడాదిపాటు కొనసాగుతాయన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఏ పార్టీ ఏమిటనేది స్పష్టత వచ్చిందని, వట్టి పార్టీ ఏదో, గట్టి పార్టీ ఏదో, మాటలు చెప్పేదెవరో, చేతల్లో చూపించేదెవరో ప్రజలకు అర్థమైందని చెప్పారు. కేసీఆర్‌ను చూడాలని, ఆయన మాట వినాలని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని, లక్షలాది మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
తన గురువు చంద్రబాబునాయుడు కృష్ణా నీళ్లను దోచుకుంటున్నా రేవంత్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం మాట్లాడలేదు. ప్రజాభవన్‌కు చంద్రబాబును పిలిచి అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్‌రెడ్డి కాదా? బాబును ప్రశ్నించే దమ్ము ఆయనకు లేదు. ఉత్తమ్ కుటుంబ సమేతంగా చంద్రబాబు దగ్గరికి వెళ్లి భోజనం చేసి వచ్చిండు. రేవంత్ గురుదక్షిణగా కృష్ణా నీళ్ల చెల్లింపు కారణంగానే నల్లగొండ జిల్లాలో పంటలు ఎండుతున్నయి. – హరీశ్
దేవాదుల ఓఅండ్ఎం కాంట్రాక్టర్‌కు రూ.7 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల 33 రోజులు పంపుల మోటర్లు ఆన్ కాక కరువు వచ్చింది. దేవాదుల మోటర్లు ఆగకుండా నడిచి ఉంటే రిజర్వాయర్లు నిండేవి. పొలాలకు నీళ్లు వచ్చేవి. రేవంత్ చేసిన తప్పును ప్రకృతి మీద మోపుతున్నడు. నీళ్లు ఇవ్వొద్దని మోటర్లకు అడ్డంగా హరీశ్‌రావు గాని, బీఆర్ఎస్ నాయకులు గాని నిల్చున్నరా? – హరీశ్
ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ చేతగానితనంతో వచ్చిన కరువు.. పాలన చేతగాక ప్రకృతిపైన, ప్రతిపక్షాలపైన నిందలు వేసి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నడు. తెలంగాణకు పట్టిన గ్రహణం రేవంత్‌రెడ్డి. – హరీశ్