నర్సరీమేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
28 వరకు పీపుల్స్ ప్లాజాలో నిర్వహణ
ఖైరతాబాద్, ఫిబ్రవరి 24: మొక్కల పెంపకాన్ని అలవాటుగా మార్చుకొంటే ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్తేజం పొందవచ్చునని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో నర్సరీమేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇలాంటి మేళాలు కాంక్రీట్ జంగిల్ నుంచి ప్రకృతి వైపు నడిపిస్తాయని చెప్పారు. కిచెన్‌గార్డెన్, రూఫ్‌గార్డెన్ ఏర్పాటుచేసుకొనే వారికి నర్సరీ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వివిధ రాష్ర్టాలకు చెందిన వందలాది నర్సరీల నిర్వాహకులు ఈ మేళాలో పాల్గొంటున్నారని తెలిపారు. అస్సాం నుంచి తెచ్చిన వెదురు బొంగులతో తయారుచేసిన ఆకృతులు, మట్టితో రూపొందించిన హస్తకళలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇక్కడ లభించే వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలతో పాటు అరుదైన రకాలను తమ ఇంటితో పాటు, తమ మున్సిపాలిటీ కోసం తీసుకెళ్తానని మంత్రి చెప్పారు. నర్సరీ మేళా నిర్వాహకుడు ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 121 స్టాల్స్ పెట్టినట్టు వివరించారు. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కశ్మీర్ నుంచి స్టాల్స్ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. నర్సరీ మేళాలో పూలు, ఇండోర్, ఔట్‌డోర్, కాక్టస్, సక్యూలెంట్స్, అడేనియం, అరుదైన మొక్కలతో పాటు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఇతర వ్యవసాయ, తోటల ఉత్పత్తులు, పరికరాలు లభిస్తాయని వివరించారు. ఈ నెల 28 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు.