Harish Rao | సిద్దిపేట పట్టణంలోని విక్టరీ చౌరస్తా వద్ద గల పార్క్ ప్రాంగణంలో సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే దివంగత ఆనంతుల మదన్ మోహన్ విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలకు మదన్ మోహన్ పేరు పెట్టేలా కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాల కంటే వ్యక్తులు చేసిన కృషి గొప్పది అని అన్నారు.
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఎన్నికలో మదన్ మోహన్‌ను గెలిపించారని.. మలిదశ ఉద్యమం ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపించారని హరీశ్‌రావు అన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఆయన గొప్పగా నడిపారని కొనియాడారు. మదన్ మోహన్ గురించి నిన్న కేసీఆర్ నాతో గంట సేపు చర్చించారని అన్నారు. సిద్దిపేటకు కేసీఆర్‌కు, సిద్దిపేటకు మదన్ మోహన్ కు విడదీయరాని సంబంధం ఉందని వ్యాఖ్యానించారు.
పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదని.. వ్యక్తులు చేసిన సేవలే శాశ్వతం అని చాటి చెప్పడమే మన సిద్దిపేట విజన్ అని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటకు సేవ చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక రాజకీయ నేతగా కాకుండా ఒక వ్యక్తిగా మదన్ మోహన్ తనదైన శైలిలో సిద్దిపేటకు సేవ చేశారని చెప్పారు. అందుకే వారికి ఈ గౌరవం దక్కిందని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన గురువారెడ్డికి ఇక్కడే విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు మదన్ మోహన్‌ను స్మరిస్తూ గౌరవంగా , ఘనంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో మదన్ మోహన్ అనాడు విశేషంగా కృషి చేశారని హరీశ్‌రావు తెలిపారు. ఆ స్పూర్తితో కేసీఆర్ ఉద్యమించి ఏకంగా తెలంగాణనే సాకారం చేశారని అన్నారు. స్వరాష్ట్రం సాకారమైనప్పుడు మదన్ మోహన్ ఉంటే ఎంతో సంతోషించేవారని అన్నారు. ఈనాడు సిద్దిపేట అభివృద్ధి గురించి దేశ, విదేశాల్లో ప్రశంసలు దక్కుతుంటే మదన్ మోహన్ గారీ ఆత్మ సంతోషిస్తూ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అల్టిమేట్‌గా ఆయన కూడా సిద్దిపేట అభివృద్ధిని కాంక్షించారని.. ఆ తర్వాత కేసీఆర్, ఇప్పుడు నేను కూడా సిద్దిపేట ప్రజల కోసమే శక్తికి మించి పని చేశామని అన్నారు. కొంతమంది నన్ను అన్నారని.. ఆయన వేరే పార్టీలో పని చేశారని తెలిపారు. ఆయన మరణం తర్వాత వాళ్ల పార్టీ వాళ్లు కూడా ఆయన సేవలను గుర్తించలేదని.. మనం ఎలా విగ్రహం పెడతామని అన్నారని పేర్కొన్నారు. కానీ మదన్ మోహన్ సేవలను పార్టీలకు అతీతంగా గుర్తించాలని , ఆయన కృషి శాశ్వతంగా సిద్దిపేట చరిత్రలో నిలవాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
పార్టీలకు అతీతంగా పని చేసి పెట్టడమే సిద్దిపేట నాయకుల విజన్‌గా ఉండాలనేది తన తపన అని హరీశ్‌రావు తెలిపారు. అందుకే నా దగ్గరకు వచ్చే వాళ్ళలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారని.. పనులు చేసుకెళ్తారని అన్నారు. ఆ రోజుల్లో సిద్దిపేటలో 100 పడకల ఆసుపత్రిని తెచ్చిన గొప్ప నాయకుడు మదన్ మోహన్ అని.. సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెట్టేలా ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తానని చెప్పారు.