జగిత్యాల/ రాజన్న సిరిసిల్ల, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : కల్లాల్లో ధాన్యం కొనాలని, లారీలో వడ్ల లోడు ఎత్తాలని రైతులు అడుగుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్లు ఎత్తే పనిలో బిజీగా ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. అబద్ధపు హామీలు, తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి పాలన రైతుల పాలిట శాపంలా మారిందని, రైతుల ధాన్యం దళారుల పాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.500 బోనస్ బోగస్ అయిందని, రేవంత్ నిర్వాకంతో క్వింటాల్ ధాన్యంపై రైతు వెయ్యి రూపాయలు నష్టపోతున్నాడని వాపోయారు. ‘ఇక్కడ బోనస్ ఇయ్యడు కాని, మహారాష్ట్ర ఎన్నికల్లో వరికి బోనస్ ఇస్తున్నమని రేవంత్‌రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నడు’ అంటూ మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్ల సీజన్ వస్తున్నదంటే కేసీఆర్ నెలరోజుల ముందు నుంచే సమీక్షలు పెట్టేవారని, ‘సంచులు ఉన్నాయా.. బారదాన్లు ఉన్నాయా.. సుతిలి ఉన్నదా.. టార్పాలిన్లు ఉన్నాయా అని నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగులను, పైసలున్నయా.. వడ్లు కొన్న 24 గంటల్లోనే రైతులకు పైసలియ్యాలె’ అని ఆర్థిక మంత్రి అయిన నన్ను కేసీఆర్ అప్రమత్తం చేసేవారు’ అని గుర్తుచేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మంగళవారం కోరుట్ల నుంచి జగిత్యాల వరకు రైతులతో కలిసి చేపట్టిన పాదయాత్రకు హరీశ్ సంఘీభావం తెలిపారు. అనంతరం జగిత్యాల కొత్తబస్టాండ్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘జగిత్యాల జిల్లాలో ప్రారంభమైన రైతుల పాదయాత్ర ట్రైలర్ మాత్రమే..సీఎం రేవంత్‌రెడ్డికి మున్ముందు 70 ఎంఎం సినిమా ఉంటుంది’ అని హెచ్చరించారు. సంజయ్ కల్వకుంట్ల ఇక్కడి ప్రజలకు మంచి ఎమ్మెల్యేగానే తెలుసునని, తనకు మాత్రం మంచి డాక్టర్‌గా తెలుసని చెప్పారు. యశోద దవాఖానలో పనిచేసేటప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ఫోన్‌చేస్తే బిల్లు మాఫీ చేసేవారని గుర్తుచేశారు. వెన్నెముక శస్త్ర చికిత్స చేసే డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం 25 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు.
ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేరిందా అని హరీశ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఒకటి రెండు రోజుల్లో రైతుబంధు పైసలు వేస్తామని తాను ప్రకటించానని, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా ఇచ్చిందని, అయినా రేవంత్‌రెడ్డి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధును అడ్డుకున్నది అందరూ గుర్తుచేసుకోవాలని చెప్పారు. ‘ఇప్పుడైతే రూ.10 వేలు, కాంగ్రెస్ వచ్చినంక రూ.15 వేలు వస్తాయని ఎన్నికల్లో రైతులను రేవంత్‌రెడ్డి నమ్మించి మోసం చేసిండు’ అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పదవి కంటే 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావడమే ముఖ్యమని భావించి తాను రాజీనామాకు సిద్ధమయ్యానని గుర్తుచేశారు. ‘రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అంటే, సై అని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ తర్వాత పారిపోయిండు.. పంద్రాగస్టు వరకు పూర్తి రుణమాఫీ అన్నడు.. చేయలేదు. మళ్లీ వెంటపడితే దసరా అన్నా డు.. అటు దసరా పోయింది, దివిలె పోయిం ది.. ఇప్పుడు సోనియమ్మ పుట్టిన రోజు డిసెంబర్ 9 అంటున్నడు’ అని విమర్శించారు. సీఎం మాటలు నమ్మి వేలాది మంది రైతులు రూ.రెండు లక్షల పైన బకాయిలు కట్టారని, వారికి ఇంత వరకు రుణమాఫీ కాలేదని చెప్పారు. వారికి వడ్డీతో కలిసి రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై మాటతప్పిన రేవంత్‌రెడ్డి ఎములడ రాజన్న దగ్గర తప్పుజరిగిందని చెప్పి చెంపలేసుకోవాలని సూచించారు.
కేవలం తరాజులో పెట్టి ఎమ్మెల్యేలను కొనడం తప్ప 11 నెలల పాలనలో రేవంత్‌రెడ్డి చేసిందేమిటి? రానున్న రోజుల్లో రైతులు అవిశ్రాంత పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేర్చుకోవాలి.. రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులమంతా నిరంతరం పోరాటం సాగిస్తం.
-హరీశ్‌రావు
ఒకప్పుడు జగిత్యాలలో మంచి నీళ్ల కోసం ధర్నా చేసే పరిస్థితి ఉండేదని, దాన్ని నాటి సీఎం కేసీఆర్ మార్చివేశారని హరీశ్ గుర్తుచేశారు. వరద కాలవను రిజర్వాయర్‌గా మార్చి, మోటర్లు పెట్టి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు తెచ్చి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లా మార్చారని, చెరువులన్నిటికీ తూములు పెట్టి వరద కాలువ ద్వారా నీళ్లందించి రెండు పంటలు పండేలా చేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. రైతుల కోసం అన్నీ చేసి, దేశంలో రైతుల సీఎంగా కేసీఆర్ పేరు తెచ్చుకుంటే, రేవంత్‌రెడ్డి బూతుల సీఎంగా పేరు సంపాదించారని ఎద్దేవాచేశారు. జగిత్యాల అంటేనే చైతన్యవంతమైన పోరాట పురిటిగడ్డ అని, జైత్రయాత్ర సాగించిన ప్రాంతమని, అలాంటి జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల పాదయాత్రతో పోరాటం ప్రారంభించారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరవాలని, ఆయన, ఆయన మంత్రు లు భూమి మీద తిరగాలని చురకలంటించారు. ‘గాలి మోటర్లలో కాదు, రైతుల చేన్లల్లో, కల్లాల్లో తిరగాలి’ అని హితవుపలికారు.
కల్లాల్లో ధాన్యం కొనుగోలు కోసం రైతులు 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.. రాత్రి పందులు, పగలు కోతులతో భయపడుతున్నరు.. అకాల వర్షాలు పడితే తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరేనని ఆవేదన చెందుతున్నరు.. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు.
కేసీఆర్‌పై మాట్లాడే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదని హరీశ్ స్పష్టం చేశారు. ఇటీవల కేసీఆర్ మాట్లాడిన మాటల్లో తప్పేమున్నదని ప్రశ్నించారు. ‘మీ పాలనలో తెలంగాణ ప్రజ లు ఏమి పొందారో? ఏమి కోల్పోయారో? చెప్పడానికి నువ్వు సిద్ధమా?’ అంటూ సవాల్ చేశారు. వేములవాడలో రాజన్నను దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు నివాసంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఉద్యోగ సంఘం నాయకుడు దేవి ప్రసాద్‌తో కలిసి హరీశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో, తాగు, సాగునీరు, కరెంటు, విద్య ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు. బతుకమ్మ ఆర్డర్లు ఇవ్వకుండా వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టి, నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చాడంటూ సీఎంపై మండిపడ్డారు.
జగిత్యాల కొత్తబస్టాండ్ వద్ద సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, చిత్రంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పాదయాత్రను ప్రారంభిస్తున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
‘ఇందిరమ్మ రాజ్యంలో ఇదేం పరిస్థితి..పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకు? రాష్ట్రంలోని గురుకులాలు అధ్వాన పరిస్థితికి చేరితే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేదు’ అంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకులాల ఖ్యాతిని కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరాన నిలబెడితే, రేవంత్‌రెడ్డి 11 నెలల పాలనలో అథఃపాతాళానికి దిగజార్చారని దుయ్యబట్టారు. ‘మీ అసమర్థ పాలనకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ గురుకుల విద్యార్థులు చేపట్టిన నిరసనే నిదర్శనం’ అని చురకలంటించారు. సర్కారు తక్షణమే స్పందించి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్లు, ఎంపీ ఎన్నికల్లో దేవుళ్లపై ఒట్లు.. ఇదీ రేవంత్ ముచ్చట.. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధర్మపురి నర్సన్న మీద ఒట్లుపెట్టి మరీ రుణమాఫీ చేస్తనని రేవంత్‌రెడ్డి రైతులను నమ్మించి మోసం చేసిండు. మోసం చేసిన మనిషిని ఏమంటరో రైతులే చెప్పాలె..
‘విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇచ్చారా?, ఏడాదిలో నిరుద్యోగులకు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవీ’ అని హరీశ్ ప్రశ్నించారు. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన 40 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి అన్నీ తామే చేశామని రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండానే రూ.300 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో ఘనంగా ప్రకటనలు ఇచ్చాడు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలేదని దుయ్యబట్టారు. పోలీసుల చేతులతో పోలీసోళ్ల భార్యలు, పిల్లలను కొట్టించిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకులాల్లో విద్యార్థులను కేసీఆర్ ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను, డాక్టర్లను, ఇంజినీర్లను చేయడమే గాక, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం రోడ్లెకించాడని ఎద్దేవాచేశారు. 11 నెలల్లో గురుకులాల్లో ఇప్పటి వరకు 37 మంది విద్యార్థులు చనిపోయారంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రైతుబంధు, బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్లు, గొర్రె పిల్లలు, చేప పిల్లలు ఇట్ల ఒక్కటేమిటి కేసీఆర్ ఇచ్చిన అన్నింటినీ రేవంత్‌రెడ్డి బంద్ పెట్టాడని గుర్తుచేశారు.
ప్రజలను మభ్యపెట్టేందుకు రేవంత్‌రెడ్డి మూసీ పాదయాత్ర మొదలు పెట్టారని, ఆయనకు దమ్ముంటే ఇండ్లు కూలగొట్టిన చోట చేయాలని హరీశ్ సవాల్ విసిరారు. తలను వదిలిపెట్టి, తోకను పట్టినట్టు నల్లగొండ జిల్లా పరిధిలో పాదయాత్ర చేస్తున్నాడని ఎద్దేవాచేశారు. జగిత్యాల నుంచే వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న కోటిలింగాల శివన్న, ధర్మపురి నర్సన్నను వేడుకుంటున్నానని, వారిపై ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్‌రెడ్డిని క్షమించి, రైతులను కాపాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానకాలం, యాసంగికి కలిపి ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాలని, అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులే దేశానికి వెన్నెముక అని, వారి సంక్షేమం కోసమే పాదయాత్ర చేశానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తెలిపారు. రైతులు, ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరింపజేయాలన్న తలంపుతోనే పాదయాత్ర చేపట్టినట్టు వివరించారు. పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారం కోసం పోరాడుతామని చెప్పారు. అనంతరం మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ మాజీ చైర్పర్సన్లు, తుల ఉమ, దావ వసంత, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, పుట్ట మధు, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, వొద్దినేని హరిచరణ్‌రావు, డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి తదితరులు కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం అందజేశారు. విలేకరుల సమావేశంలో వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, తుల ఉమ, న్యాలకొండ అరుణ, తోట ఆగయ్య, రామతీర్థపు మాధవీ, ఏనుగు మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తేతెలంగాణ): ఫార్మా కంపెనీకి భూములిచ్చేందుకు నిరాకరించిన లగచర్ల వాసులపై సర్కారు అర్ధరాత్రి దమనకాండకు దిగడం అమానుషమని హరీశ్‌రావు మండిపడ్డారు. అరెస్ట్ చేసిన రైతులను భేషరతుగా విడుదల చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. 300 మంది పోలీసులతో గ్రామాన్ని దిగ్బంధించడం దారుణమని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా భూసేకరణ చేపట్టడం వెనుక రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలున్నాయని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెట్టకుం డా, ప్రభుత్వం వెంటనే భూసేకరణ నిలిపివేయాలని హరీశ్‌రావు డిమాం డ్ చేశారు.