Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై, పని చేసే రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంభిస్తున్నదని 16వ ఆర్థిక సంఘం ఎదుట మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. పన్నుల వాటాలో కేంద్రం నుంచి రాష్ర్టాలకు 41% నిధులు రావాల్సి ఉండగా 31 శాతమే వస్తున్నాయని, మొత్తాన్ని 50 శాతానికి పెంచాలని కోరారు. కేంద్రప్రభుత్వ నాన్‌ట్యాక్స్ రెవెన్యూలో రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాం ట్ను 50 శాతానికి పెంచాలని, పెరిగిన జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎత్తిపోతల నీటిపారుదల ప్రాజెక్టులు తప్పనిసరి పరిస్థితి అని, వాటి నిర్వహణకు రూ.50 వేల కోట్లు, మిషన్ భగీరథ నిర్వహణకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని కోరారు. వరదల సహాయ నిధిని ప్రస్తుతం ఉన్న 75ః25 శాతం నిధులను గతంలో లాగా 90ః10 శాతంగా మార్చాలని కోరారు. 16వ కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం సోమవారం ప్రజాభవన్‌లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. ఈ భేటీకి బీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద హాజరై, పార్టీ తరుఫున పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
గతంలో ఇచ్చిన హామీలు అమలు కాని విషయాన్ని హరీశ్‌రావు సమావేశంలో ప్రస్తావించా రు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు 16వ ఆర్థిక సంఘానికి నివేదిక ఇచ్చామని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా సూచనలు చేశామని వివరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యధిక జీడీపీ వృద్ధితో దేశానికే ఆదర్శంగా నిలిపామని పేర్కొన్నారు. కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20% సర్‌చార్జీలు, సెస్సు ల రూపంలో సమకూర్చుకుంటున్నారని, ఈ డబ్బును వాటా ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రానికి వచ్చే నాన్‌ట్యాక్స్ రెవెన్యూ 2024-25లో రూ.5.46 లక్షల కోట్లకు పెరిగిందని, నాన్‌ట్యాక్స్ రెవెన్యూలో వాటా ఇవ్వాలని కోరామని వెల్లడించారు. తెలంగాణ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రమని, బాగున్నారు కాబ ట్టి వాటా తకువ ఇస్తామనడం అన్యాయమని పేర్కొన్నారు. 13వ ఆర్థిక సంఘంలో రాష్ట్రం వాటాగా 2.437% నిధులు ఇచ్చారని, 14వ ఆర్థిక సంఘంలో ఇది 2.133 శాతానికి, 15వ ఆర్థిక సంఘం నాటికి 2.102%కు తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత 16వ ఆర్థిక సంఘంలో తెలంగాణకు అన్యాయం చే యవద్దని కోరామని తెలిపారు. పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ర్టాలకు ప్రస్తుతం ఇస్తున్న వెయిటేజీని 2.5% నుంచి 10 శాతానికి పెంచాలని కోరామని వివరించారు. స్థానిక సంస్థల గ్రాంట్‌ను 50 శాతానికి పెంచాలని, పట్టణ జనాభా పెరిగే రాష్ర్టాలకు నష్టం చేయొద్దని కోరినట్టు వెల్లడించారు.
ఎత్తులో ఉన్న తెలంగాణకు నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చే యాల్సి ఉంటుందని హరీశ్‌రావు వివరించారు. అందుకే కేసీఆర్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారని, తద్వారా పెద్ద మొత్తంలో పంటలకు సాగునీరు ఇవ్వడం సాధ్యమైందని తెలిపారు. ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుల నిర్వహణకు కనీసం రూ.40 వేల కోట్లు కేటాయించాలని కోరినట్టు వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీ య ప్రాజెక్టు హోదా ఇవ్వాలని కోరామని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఇవ్వకుం డా కేంద్రం అన్యాయం చేసిన వైనాన్ని వివరించామని తెలిపారు.
ప్రభుత్వ దవాఖానల అభివృద్ధికి రూ.పదివేల కోట్లు కేటాయించాలని కోరామని హరీశ్‌రావు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం వరకు రిపోర్ట్‌ను యథాతథంగా అమలు చేశారు కానీ, 15వ ఆర్థిక సంఘం నివేదికను కేంద్రం ‘పిక్ అండ్ చూజ్’లాగా ఇష్టమున్నవి చేసి, ఇష్టం లేని వదిలిపెట్టారని ఆవేదన వ్యక్తంచేశా రు. స్పెషల్ గ్రాంట్ కింద రూ.723 కోట్లు, సెక్ట ర్ స్పెసిఫిక్ కింద రూ.2,350 కోట్లు, స్టేట్ స్పె సిఫిక్ కింద రూ.3,024 కోట్లు మొత్తం రూ. 6,097 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం చెప్పి నా కేంద్రం పైసా ఇవ్వలేదని వివరించారు.
కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం సోమవారం ప్రజాభవన్‌లో పలు సంస్థలు రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో విసృ్తత స్థాయి లో సమావేశం అయ్యింది. చైర్మన్ డాక్టర్ అర్వింద్ పనగారియా, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అన్నిజార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, సౌమ్య కాంతిఘోష్, సం ఘం కార్యదర్శి రిత్విక్పాండే ఆధ్వర్యంలోని ఆర్థికసంఘం తొలుత మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లతో సమావేశమైంది. అనంతరం మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సంఘ సభ్యులతో సమావేశమైంది. వ్యాపార వాణిజ్య సంస్థలైన ఎలిప్, ఫీకీ, సీఐఐ ప్రతినిధులతో సమావేశం జరిగింది.
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర పన్నుల్లో వాటా పెంచాలని 16వ ఫైనాన్స్ కమిషన్‌ను కోరినట్టు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సమావేశానికి బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎస్ రాజయ్య, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎంఐఎం నుంచి శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మాజీ ఎమ్మెల్సీ సయ్యద్ అమీరుద్దీన్ జాఫ్రీ, ఎమ్మె ల్యే బలాల, సీపీఐ నుంచి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం నుంచి మాజీ ఎమ్మె ల్యే నంద్యాల నర్సింహారెడ్డి హాజరయ్యారు.
మిషన్ భగీరథ పథకానికి రూ.19,205 కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని నీతి అయోగ్ సూచిస్తే కేంద్రం ఒక రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పథకం నిర్వహణ కోసం రూ.2,350 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే ఒక రూపాయి ఇవ్వలేదని వివరించారు. కేంద్రం ప్రారంభించిన హర్ ఘర్ జల్ కంటే ముందే తాము మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వడం పాపమైందా? అని హరీశ్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అన్యాయాలను 16వ సంఘం చైర్మన్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు. మిషన్ భగీరథ నిర్వహణకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరామని తెలిపారు.