సిద్దిపేట, డిసెంబర్ 24( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేందుకు జంకుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గాల నూతన సర్పంచ్ల సన్మానం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డ్డి, మాణిక్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కారు గుర్తు అంటే ప్రజలకు కేసీఆర్ గుర్తొస్తారని, అందుకే రేవంత్‌రెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టు 4వేల పింఛన్, మహిళలకు 2,500, తులం బంగారం ఇవ్వలేదని, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, చేపలు, గొర్రెల పంపిణీ బంద్ అయ్యాయని మండిపడ్డారు. జహీరాబాద్‌లో కేసీఆర్ కట్టించిన మైనారిటీ గురుకులం నుంచి 19మంది డాక్టర్లు అయ్యారని.. రేవంత్ ప్రభుత్వం వచ్చాక గురుకుల పిల్లలు కల్తీ ఆహారం తిని దవాఖానల పాలవుతున్నారని ధ్వజమెత్తారు.
జహీరాబాద్‌కు ఒక్క రూపాయైనా ఇచ్చావా?
సంగమేశ్వర ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి బంద్ పెట్టిండని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేశామని, వందలాది చెక్‌డ్యామ్‌లు కట్టి భూగర్భ జలాలు పెంచామని చెప్పారు. కాళేశ్వరం జలాలు జహీరాబాద్‌కు తీసుకురావాలని సంగమేశ్వర, బసవేశ్వర మొదలుపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులు ఆపేశారని మండిపడ్డారు. ఈ విషయంలో జిల్లా మంత్రి, ముఖ్యమంత్రిని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం మెడలు వంచి ప్రాజెక్టు పనులు ముందుకు సాగేలా చేస్తామని స్పష్టంచేశారు. జహీరాబాద్‌కు 50 పడకల మాతాశిశు దవాఖాన మంజూరైనా, రెండేండ్లలో ఎకడి పనులు అకడే ఆగిపోయాయని ధ్వజమెత్తారు. జహీరాబాద్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. రైల్వే బ్రిడ్జి కట్టింది, బసవేశ్వర విగ్రహం బీఆర్ఎస్ ఏర్పాటుచేస్తే.. రేవంత్‌రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేసి పోతడట అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. జహీరాబాద్‌కు రేవంత్‌రెడ్డి ఒక రూపాయి కూడా ఇవ్వలేకపోగా కేసీఆర్ ఇచ్చిన రూ.50 కోట్లు పట్టుకుపోయిండని దెప్పిపొడిచారు. ప్రజా సమస్యలు పరిషరించడానికి పైసలు ఉండవు, గురుకుల పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు పైసలు లేవు అంటడు.. కానీ వంద కోట్లు పెట్టి ఫుట్‌బాల్ ఆడేందుకు పైసలు ఉంటాయా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలన అంతా సగం సగం…
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుడు రూపాయి.. ఇచ్చేది ఆఠానా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్ పాలన అంతా సగం సగం ఆగమాగం ఉన్నదని, రైతుబంధు రెండు పంటలకు ఎగ్గొట్టారని, బోనస్ బోగస్ అయ్యిందని, బతకమ్మ చీరలు సగం సగమే ఇచ్చారని మండిపడ్డారు. రాజీవ్ యువవికాసం… వికసించక ముందే వాడిపోయిందని, కొత్త పథకాలు దేవుడెరుగు కేసీఆర్ తెచ్చిన పథకాలను బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్యాణలక్ష్మీతో తులం బంగారం అన్నారని.. బంగారం ధర లక్ష అయ్యింది కానీ తులం మాత్రం రాలేదని చెప్పారు. కేసీఆర్ లగ్గానికి చెకు ఇస్తే ఈ రేవంత్ పాలనలో పిల్ల పుట్టాక చెకులు ఇచ్చే పరిస్థితి వచ్చిందని దెప్పిపొడిచారు.
కల్యాణలక్ష్మీ పథకం కింద కాంగ్రెస్ సర్కార్ రూ.900 కోట్లు బకాయిపడ్డదని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల చదువుల కోసం ఏడాదికి రూ.2500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విడుదల చేసేదని.. రేవంత్ సర్కారు వచ్చాక రూ.9వేల కోట్లు పెండింగ్‌లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తండాలను కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చి ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇస్తే.. రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నాడని, వారికి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రెండేండ్లు ఓపిక పట్టండి.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అని హరీశ్‌రావు చెప్పారు. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రతి ఒకరి పేరు రాసి పెట్టుకోండని, అందరి లెకలు తేలుద్దామని హామీ ఇచ్చారు.
‘బీఆర్ఎస్ అనే విత్తును మొలకెత్తనీయ అన్నడు రేవంత్‌రెడ్డి. ఇవాళ 4వేల సర్పంచులు మొలకెత్తారు. కారు గుర్తు లేకుంటేనే ఇన్ని గెలిచాం. రేపు కారు గుర్తుంటే ఎన్ని గెలుస్తం. కారు గుర్తు అంటే కేసీఆర్ గుర్తు. అందుకే రేవంత్‌రెడ్డి భయానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెడ్తలేడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలే. పాలన అంతా సగం సగం.. అంతా ఆగమాగం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల, కోతల ప్రభుత్వం. ఏది చేసినా సగం సగం చేయడం అలవాటే. ఇగ కాంగ్రెస్ కథ కంచికే.
– హరీశ్‌రావు