Harish Rao | హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో గ్యారెంటీల నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు నిండుతాయని, అప్పటికి పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుందని, కోడ్ వచ్చిందని చెప్పి హామీల అమలును వాయిదా వేసే అవకాశం ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. మల్కాజిగిరి ఎంపీగా రేవంత్‌రెడ్డి చేసిన పని ఒక్కటి కూడా లేదని, పైసా నిధులు తీసుకురాలేదని విమర్శించారు. రేవంత్ ప్రాతినిధ్యం వహించిన సీటును భారీ మెజార్టీతో బీఆర్ఎస్ కైవసం చేసుకునేవిధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి లోక్‌సభ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి హాజరైన టీ హరీశ్‌రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్కు ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని స్పష్టం చేశారు. భవిష్యత్తు లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు, భవిష్యత్తులో వచ్చేది మళ్లీ మనమేనని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ 420 హామీల్లో పావలా వంతుకు మించి అమలు చేయలేరని అన్నారు. మల్కాజిగిరిలో ఈసారి బీఆర్ఎస్ గెలిచి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మల్కాజిగిరిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచామని, ఇప్పుడు ఎంపీ సీటు కూడా గెలవాలని అన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలిచ్చి కాంగ్రెస్ అభాసుపాలైందని, అకడ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉండబోతున్నదని సర్వేలు చెప్తున్నాయని పేర్కొన్నారు.
ఇకడ కూడా కాంగ్రెస్‌కు కర్ణాటకలాంటి పరిస్థితే ఉంటుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసి ఎకువ సీట్లు గెలిచిందని, ఆ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు నిరూపించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలకంటే భిన్నంగా ఉంటాయని అన్నారు. కీలకమైన పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఐదేండ్లు అధికారంలో కొనసాగినచోట మళ్లీ అధికారంలోకి రావడం అరుదు అని తెలిపారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఐదేండ్లకే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ – బీజేపీ కుమ్మక్కయ్యాయని, ఈ విషయాన్ని లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించాలని పిలపునిచ్చారు.