సిద్దిపేట, డిసెంబర్ 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందిం చే హరీశ్‌రావు, తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు. విద్యార్థినికి బ్యాంకు రుణం దకడానికి సొంత ఇంటినే తనఖా పెట్టి సిద్దిపేట ప్రజలంటే తనకు ఎంతో ప్రేమో మరోమారు చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఆయన పెద్ద కుమార్తె మమత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేశారు. పీజీ ఎంట్రెన్స్ రాయగా మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో కన్వీనర్ కోటాలోనే సీటు వచ్చినా ఏటా రూ.7.50 లక్షల చొప్పున మూడేండ్లు ట్యూషన్ ఫీజు చెల్లించడం కుటుంబానికి తలకు మించిన భారంగా మారింది. ఈ నెల 18న చివరి గడువు ఉండటంతో అప్పటికే రామచంద్రం ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రయత్నాలు చేసినా తనఖాకు ఆస్తులేవి లేకపోవడం నిరాశే ఎదురైంది.
మనోవేదనకు గురైన రామచంద్రం గతం లో కూతుళ్ల చదువులకు సాయం చేసిన ఎమ్మెల్యే హరీశ్‌రావును గుర్తు చేసుకుని తన కష్టాన్ని మరోమారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకు న్న ఎమ్మెల్యే హరీశ్‌రావు వెంటనే స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేండ్ల్లకు సరిపడా దాదాపు రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించి సీటు దక్కేలా చేశారు. అంతేకాకుండా మొదటి సంవత్సరం హాస్టల్‌కు రూ.లక్ష అవుతుందని మమత ఎమ్మెల్యే హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా స్వయంగా లక్ష రూపాయలను హరీశ్‌రావు నగదు రూపంలో ఆమెకు అందజేసి దయార్ద హృదయాన్ని చాటుకున్నారు.
కాగా, గతంలో నియోజకవర్గంలోని ఆటో కార్మికుల సంక్షేమానికి ఎమ్మెల్యే హరీశ్‌రావు తన ఇంటిని మార్టిగేజ్ చేసి బ్యాంకు రుణం ఇప్పించిన విషయం తెలిసిందే. ఆ రుణంతోనే సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్న వందలాది మంది ఆటో కార్మికులు నేడు కొండంత భరోసాతో గడుపుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా గుర్తు చేసుకుంటున్నారు.
అమ్మానాన్న టైలరింగ్ చేస్తూ ఎంబీబీఎస్ దాకా చదివించారు. అహర్నిశలు శ్రమించి పీజీ ఎంట్రెన్స్‌లో సీటు దకిందని సంబురపడ్డా. ఉచితంగానే సీటు వచ్చింది కానీ, ట్యూషన్ ఫీజు మూడేండ్లు రూ.22.50 లక్షలు చెల్లించాలనడంతో సీటు కష్టమని బాధపడ్డా. పీజీ చదివే యోగ్యం లేదని ఏడుపొచ్చింది. గతంలో మా అక్కాచెల్లెళ్లం ఎంబీబీఎస్ చదవడానికి హరీశ్‌రావు సార్ హెల్ప్ చేశారు. ఇప్పుడు పెద్ద మొత్తం కావడంతో చేస్తారో.. లేదో అని టెన్షన్ పడ్డా. మేము అడగడమే ఆలస్యం సార్ ఇంటిని మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని బ్యాంకు వారికి ఫోన్ చేసి చెప్పారు. చదువు విలువ, నిరుపేద విద్యార్థుల ఇబ్బందులు తెలిసిన హరీశ్‌రావు సార్ ఎమ్మెల్యే కావడం మా అందరి అదృష్టం.
– మమత, వైద్య విద్యార్థి