హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒక ఏడాది కరువు వస్తే, ఎస్సారెస్పీకి కూడా నీళ్లను రివర్స్ పంపింగ్ చేశామన్నారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి నీళ్లు తెచ్చి, అక్కడి నుంచి ఎస్సారెస్పీ స్టేజ్ 1కు నీళ్లిచ్చామన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీరు అందించామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడిందని తెలిపారు. ఇది వాస్తవమైన రిపోర్టు అని, నీటి పారుదలశాఖ అధికారులిస్తున్న నివేదిక అని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ నాయకులు 50 వేల ఎకరాలే పారిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘తెలంగాణ ఏర్పడక ముందు గోదావరి జలాల సద్వినియోగానికి ఎవరూ కృషి చేయలేదు. 2007 నుంచి 2014 వరకు కేంద్రంలో, మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్పప్పటికీ తుమ్మడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఏ అనుమతి సాధించలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఆలోచన చేసినం, తెలంగాణ పచ్చబడాలంటే గోదావరి జలాలే కావాలనుకున్నం. గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంటే, అందులో 750 కిలోమీటర్లు తెలంగాణలోనే ప్రవహిస్తున్నది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1480 టీఎంసీల కేటాయింపులుంటే, తెలంగాణ వాటా 969 టీఎంసీలు. కానీ, వాస్తవంగా అందులో తెలంగాణ వాడకం ఏనాడూ 400 టీఎంసీలు మించలేదు. 2014 వరకు తెలంగాణలో గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు ఎస్సారెస్పీ, దేవాదుల మాత్రమే.
తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా వస్తే, తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అక్కడ నీటి లభ్యత ఉండదు. ప్రాణహిత-చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 11 టీఎంసీలు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు.. రెండింటి మధ్య ఎంత తేడా.. 2014 వరకు కాంగ్రెస్ నాయకులు సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.2328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే, పనులు జరగనేలేదు. ఇందులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.1052 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాహా చేసిందని స్వయంగా కాగ్ తన రిపోర్టులో వెల్లడించింది. ఇట్లా ఆ పైసలు కాంగ్రెస్ నాయకులు తీసుకొని జేబులు నింపుకున్నరు.
అప్పుడు మంత్రులుగా ఉన్నది కూడా ఇదే కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబులే. ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి విమర్శించిండు. జలయజ్ఞం కాదు.. ధనం యజ్ఞం అన్నడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డే కాంగ్రెస్ అవినీతిని వెనకేసుకొస్తున్నడు. ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ప్రాణహిత చేవెళ్ల కోసం మేం రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టినం, ఇంకో రూ.20 వేల కోట్లు పెడితే అయిపోతుండె అన్నడు. నేను లెక్కలన్నీ తీయిస్తే కాంగ్రెస్ ఖర్చు చేసింది రూ.3700 కోట్లు మాత్రమేనని తేలింది. ఎందుకీ గోబెల్స్ ప్రచారం?. ప్రాజెక్టు ఖర్చు పెరిగిందని దుష్ప్రచారం చేస్తున్నరు ఈ కాంగ్రెస్ నాయకులు. 2007లో రూ.17,875 కోట్లకు జీవో ఇచ్చి, ఏ పని చేయకుండానే ప్రాజెక్టు ఖర్చును రూ.38,500 కోట్లకు పెంచింది కూడా వీళ్లే. ఆ తర్వాత కేంద్రానికి పంపినపుడు రూ.40,300 కోట్లకు పెంచారు ఇదే కాంగ్రెస్ నాయకులు. ఇదీ వీళ్ల నిర్వాకం.’ అని హరీశ్‌రావు అన్నారు.
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్తామని హరీశ్ రావు చెప్పారు. ఇక్కడ ఎవరూ భయపడడం లేదని తెలిపారు. తమకేం భయం లేదని, బాజాప్తా విచారణకు హాజరవుతామని స్పష్టం చేశారు.