సమైక్య పాలనలో తెలంగాణకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహానికి పూనుకున్నది. ఢిల్లీలో మరణ శాసనం రాసేందుకు సిద్ధమైంది. పోలవరం- నల్లమలసాగర్ లింక్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏపీకి సహకరిస్తున్నది. సమావేశానికి హాజరుకాము.. బనకచర్లపై చర్చలు లేవు అని బుకాయించి ఇప్పుడు కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేసింది.
-హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : కేంద్రంతో చర్చలకు సిద్ధమై తెలంగాణ నీటిహక్కులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు గోదావరి జలాలను ధారాదత్తం చేసేందుకు చర్చల కోసం పరుగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అత్యవసరంగా ప్రెస్‌మీట్ పెట్టాల్సిన పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని వివరించారు. ఢిల్లీ కేంద్రంగా ప్రాంతం వాడే తెలంగాణకు జల ద్రోహాన్ని తలపెట్టాడని, ఏదైనా తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో బ్లాక్‌డేగా మిగిలిపోతుందని వివరించారు.
గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ ఆదినుంచీ అప్రమత్తం చేస్తూనే వస్తున్నదని, గతంలో అనేకసార్లు ప్రెస్మీట్లు పెట్టి వాస్తవాలు బయట పెట్టామని, అయినా కాంగ్రెస్ సర్కార్ నామమాత్రంగా తప్పుడు తేదీలతో లెటర్లు రాసి, మీడియాకు విడుదల చేసి చేతులు దులుపుకొంటున్నదని విమర్శించారు. ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నామని ఎద్దేవా చేశారు. బనకచర్ల, నల్లమల సాగర్ పేర్లు మాత్రమే వేరని, కానీ ఏపీ జల దోపిడీ ఆగలేదని, ఈ జల ద్రోహంలో కత్తి చంద్రబాబుదైతే పొడిచేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని మండిపడ్డారు. సమైక్య పాలనలో తెలంగాణకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహానికి పూనుకున్నదని, ఢిల్లీలో మరణశాసనం రాసేందుకు సిద్ధమైందని నిప్పులు చెరిగారు.
పోలవరం నల్లమలసాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం పద్ధతి ప్రకా రం ఏపీకి సహకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశానికి హాజరుకాబోమంటూనే రేవంత్‌రెడ్డి ఆనాడు ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లారని, బనకచర్లపై చర్చలు ఎజెండాలో అంశమే కాదంటూ బుకాయించాడని, కమిటీ వేయబోమని అంటూనే కమిటీ వేసి ఏపీ జలదోపిడీకి రెడ్‌కార్పెట్ వేశాడని, సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హకులను కాలరాశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ చివరి తేదీ అయిపోయాక కానీ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడని, పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమలసాగర్‌కు మద్దతు ప్రకటించాడని, పిటిషన్ వాపస్ తెచ్చారని, ఇలా ఓ పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తూ చంద్రబాబుకు సీఎం రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడని దుయ్యబట్టారు.
కేసీఆర్ గోదావరిలో 400 టీఎంసీలకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చిండ్రు. 10 డీపీఆర్‌లు కేంద్రానికి పంపి 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించిండ్రు. కానీ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డీపీఆర్‌నూ పంపింది లేదు. ఒక అనుమతి తెచ్చిందీ లేదు. పైగా సగం అనుమతులు వచ్చిన వార్ధా, కాళేశ్వరం మూడో టీఎంసీల డీపీఆర్‌లను పూర్తిగా వాపస్ తెచ్చింది. చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు రేవంత్ తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైండు.
-హరీశ్‌రావు
ఢిల్లీలో కేవలం ఏపీ ఒత్తిడితోనే కేంద్ర జలశక్తిశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, పేరుకు జలవివాదాల మీటింగే కానీ, వాస్తవం మాత్రం గోదావరిలో 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసుసుకునేందుకు సంబంధించిన కుట్ర దాగి ఉన్నదని హరీశ్ వివరించారు. గతంలో కేంద్ర జల్ శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టిందనే విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుత మీటింగ్‌లో కూడా ఏపీ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ పెడుతున్నదని వివరించారు. ఈ అంశంలో కాంగ్రెస్ సర్కార్‌ను బీఆర్ఎస్ గతంలోనే నిలదీసిందని, డిసెంబర్ 30న తానే స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడానని, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరం రాసిందని, రెండు షరతులను కూడా రేవంత్ సర్కార్ విధించిందని గుర్తుచేశారు.‘అందులో మొదటిది నల్లమలసాగర్ విషయంలో ఏపీ ముందుకు పోతున్నది. డీపీఆర్ తయారీ ప్రక్రియను కొనసాగిస్తున్నది. వెంటనే ఆ ప్రక్రియను ఆపాలి. ఇక రెండోది. నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ ఫీజిబులిటీ రిపోర్టు పరిశీలన, అనుమతుల ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తున్నది. వెంటనే ఆ ప్రక్రియను నిలుపుదల చేయాలి. ఇదీ తెలంగాణ సర్కారు చెప్పిన విషయమే.
ఆ రెండు కండీషన్లకు ఒప్పుకుంటేనే ఢిల్లీ మీటింగ్‌కు వస్తం’ అని ఆ లేఖలో చాలా స్పష్టంగా ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా పేర్కొన్నారని వివరించారు. ‘మరి ఆ రెండు కండీషన్లకు కేంద్రం హామీ ఇచ్చిందా? ఉత్తరం రాసిందా? చెవిలో చెప్పిందా? ఏపీ ఏమైనా హామీ ఇచ్చిందా? డీపీఆర్ ప్రక్రియను నిలిపివేసిందా? ఉంటే ఆ వివరాలను బయటపెట్టండి. ఒకవేళ అవి రెండూ జరగకపోతే మీటింగ్‌కు ఎందుకు పోయిండ్రు? తెలంగాణకు మరణశాసనం రాయబోతున్నరా? గోదావరి నీళ్లను ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికా? ఎలాంటి హామీలు లేకుండా పడుతూ లేస్తూ పరుగులెత్తి ఢిల్లీ మీటింగ్‌లో పాల్గొంటున్నరు? మీ అప్రూవల్‌తోనే లెటర్ పోయింది కదా ఉత్తమ్! ఎందుకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్‌రెడ్డి పట్టించుకోడు? మీరైనా ఎందుకు పట్టించుకోరు?’ అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు.
హామీ లేకుండానే మీటింగ్‌కు తెలంగాణ అధికారులు వెళ్లడం ఒకటయితే, ఆ చర్చల బాధ్యతలను తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యానాథ్దాస్కు అప్పగించడం మరో ద్రోహం. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్‌కు పంపడమంటే తెలంగాణకు ద్రోహం చేయడానికే కదా? తెలంగాణ సోయి ఉన్న ఒక ఇంజినీర్ దొరుకలేదా? తెలంగాణ నీటి హకులను గంపగుత్తగా ఏపీకి అప్పజెప్పేందుకే దొంగచేతికి తాళాలిచ్చారా?
– హరీశ్‌రావు
హామీ లేకుండానే మీటింగ్‌కు తెలంగాణ అధికారులు వెళ్లడం ఒకటయితే, ఆ చర్చల బాధ్యతలను తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్‌దాస్‌కు అప్పగించడం మరో ద్రోహమని హరీశ్ ధ్వజమెత్తారు. ‘గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) 9వ మీటింగ్‌లో ఆదిత్యానాథ్‌దాస్ పాల్గొన్నారు. కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరాట, రామప్ప పాకాల లింకు ఇలా అన్నీ అక్రమ ప్రాజెక్టులని, వాటిని నిలిపేయాలని ఏపీ తరఫున డిమాండ్ చేశారు. సంతకం పెట్టారు. లేఖలు రాశారు.
ఇలా తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్‌కు పంపడమంటే తెలంగాణకు ద్రోహం చేయడానికే కదా? తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్ర ఇది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్ట్లు చేస్తున్నరు. పోను పోను అంటూనే మీటింగ్‌లకు పోవడం అంటే ఏమిటి? తెలంగాణ నీటి హకులను గంపగుత్తగా ఏపీకి అప్పజెప్పడమే మీ చర్చల లక్ష్యమా? దొంగచేతికి తాళాలిచ్చారు. తెలంగాణ సోయి ఉన్న ఒక ఇంజినీర్ దొరకలేదా? నికార్సయిన ఒక్క అధికారి, ఇంజినీర్ దొరకలేదా?’ అంటూ హరీశ్ నిప్పులు చెరిగారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేంద్రం తాజాగా విడుదల చేసిన ఎకనామిక్ సర్వే నివేదికే స్పష్టంచేసిందని హరీశ్ గుర్తుచేశారు. ‘తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా 2 కోట్ల 20 లక్షల ఎకరాల మాగాణిగా మారింది. కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా 15 లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైంది. మొత్తంగా 32 లక్షల ఎకరాల ఆయకట్టు బీఆర్ఎస్ సాధించింది. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఇప్పటికైనా నోరు పారేసుకోవడం మంచిది కాదు. కేంద్రంలోని మీ ప్రభుత్వమే తెలంగాణ ప్రగతి పథాన్ని వివరిచింది.
ఇకనైనా కండ్లు తెరవండి. అనవసరంగా బీఆర్ఎస్ మీద నోళ్లు పారేసుకోకండి’ అంటూ చురకలంటించారు. తాము తెలంగాణకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తే, రేవంత్ ఏపీకి నీళ్లు జారగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ నీటిని ఒడిసి పడితే, రేవంత్‌రెడ్డి విడిచి పెడుతున్నాడని, సోయిలేకుండా నల్లమలసాగర్‌కు జెండా ఊపుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీకి, దావోస్‌కు తిరగడమే తప్ప పాలన మీద దృష్టి లేదని, బీఆర్ఎస్ సేద్యంపై దృష్టి సారిస్తే, రేవంత్ మాత్రం చోద్యం చూస్తున్నాడని విమర్శించారు. ఢిల్లీ సమావేశ నిర్ణయాలపై ఆధారపడి బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
కేసీఆర్ గోదావరిలో 400 టీఎంసీలకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారని, 10 డీపీఆర్‌లు కేంద్రానికి పంపి 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించారని గుర్తుచేశారు. కానీ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డీపీఆర్నైనా పంపింది లేదని, ఒక అనుమతైనా తెచ్చింది లేదని, పైగా సగం అనుమతులు వచ్చిన వార్ధా, కాళేశ్వరం మూడో టీఎంసీల డీపీఆర్‌కు పూర్తి అనుమతులు సాధించకుండా, మొత్తంగా వాటిని వాపస్ తెచ్చిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లు వాపస్ తెస్తూ, నల్లమలసాగర్‌కు రేవంత్‌రెడ్డి జెండా ఊపుతున్నాడని, చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించబోదని తేల్చిచెప్పారు. ‘నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. తెలంగాణ నీటి హకుల కోసం కేసీఆర్ నేతృత్వంలో మరో పోరాటం చేస్తం” అని హెచ్చరించారు.