హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ముంచెత్తిన వదరల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. తినడానికి తిండిలేక, నిలువ నీడ లేక బాధితులు అల్లాడిపోతున్నారు. వారికి తక్షణ సాయం అందించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. పరిహారం ప్రకటనలకే తప్ప ఆచరణలో కనిపించడం లేదు. కేంద్రాన్ని సాయం అడుగుతున్నామని, రాగానే అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కేంద్రం బట్టబయలు చేసింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన విపత్తు సహాయ నిధి నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూ.1,345 కోట్లు ఉన్నాయని కేంద్ర హోం శాఖ బుధవారం వెల్లడించింది. 2024-25లో సంభవించే విపత్తు సహాయ చర్యలకు ఆ నిధులు వాడుకోవాలంటూ కేంద్ర హోంశాఖ (జాతీయ విపత్తు నిర్వహణా విభాగం) డైరెక్టర్ ఆశిష్‌గవాయ్ సూచించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి బుధవారం లేఖ రాశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి రాష్ట్ర ఖజానాలో రూ.1,345.15 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ పేర్కొన్నట్టు లేఖలో తెలిపారు.
ఈ ఏడాది జూన్‌లో మరో రూ.208.40 కోట్లు కేంద్రం నుంచి విడుదల కావాల్సి ఉన్నదని, అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించకపోవడంతో వాటిని ఆపాల్సి వచ్చిందని వివరించారు. వెంటనే సర్టిఫికెట్లు సమర్పిస్తే రూ.208 కోట్లు విడుదల చేస్తామని స్పష్టంచేశారు. ఈ లేఖ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై బాధితులు మండిపడుతున్నారు.
ప్రభుత్వ ఖజానాలో రూ.1,345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నా, బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. వరద బాధితులకు కుటుంబానికి కొంత నగదు, నిత్యవసరాల కిట్లు పంపిణీ చేస్తే ఉపశమనం కలిగేది కదా అని వాపోతున్నారు. పైగా బీఆర్ఎస్ నేతలు నిత్యావసరాల కిట్లు అందిస్తుంటే దాడిచేశారంటూ మండిపడుతున్నారు.
ఎస్డీఆర్ఎఫ్ నిధులను వినియోగించి వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కేంద్ర హోం శాఖ లేఖతో బట్టబయలైందని విమర్శించారు. ప్రభుత్వ ఖాతాలో రూ.1,345.15 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నా వినియోగించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వరద ప్రభావంపై ఇప్పటివరకు కేంద్రానికి నివేదిక ఇవ్వకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు.