మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ను మొలకెత్తనియ్యనని అంటున్నడు.. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూలుస్తా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్కరినీ కూడా గెలువనియ్య అంటున్నడు.. భూమి బద్ధలైనా మళ్లీ వచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే.. స్కాముల సర్కార్ వద్దు.. స్కీముల సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వందకుపైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం.
– హరీశ్‌రావు
మహబూబ్‌నగర్, జూన్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పినా.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా.. దేవుళ్ల మీద ప్రమాణం చేసినా.. పబ్లిక్ మీటింగ్‌లో చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని.. అబద్ధాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, తన్నీరు హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. అబద్ధానికి అంగీలాగు తొడిగితే ఎట్లుంటదో.. రేవంత్ లాగ ఉంటది అంటూ ఎద్దేవా చేశారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో పాలేందో? నీళ్లేందో? తేలిపోయిందని, ముఖ్యమంత్రి మొనగాడు కాదు పచ్చి మోసగాడు అని రాష్ట్ర ప్రజలకు అర్థమైందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయింది? అని మండిపడ్డారు. చివరి గింజ వరకు పంటలు కొంటానని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. ‘కేంద్రం ఎంత కొనుమంటే అంతే కొంటామని చెబుతున్నరు.. కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు, సోయాబీన్, వేరుశనగ, సన్‌ఫ్లవర్ కొంతమేరే కొంటుంది.. వచ్చే వానకాలంలో వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు’ అని హెచ్చరించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు.
రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవంటూనే సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో రూ.100 కోట్లతో గెస్ట్‌హౌస్ కట్టుకొని ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘రైతులకు రైతుబంధు డబ్బులు వేయడం చేతకాదు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేక చేతులెత్తేసిండు కానీ.. రేవంత్ మనుమడితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు పైసలు ఉంటాయా’ అని ప్రశ్నించారు. కేరళ, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలో వందల కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి? పేదలకు పైసలు ఇచ్చేందుకు డబ్బులు లేవని అంటున్నాడని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు భారీ మెజారిటీతో పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వందకు తక్కువ కాకుండా సీట్లు గెలుస్తామని హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ఉమ్మడి పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లో రేవంత్‌ను ఓడిస్తామని స్పష్టంచేశారు. మళ్లీ వచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమేనని.. ప్రజలు అదే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ‘ఔరంగజేబు.. జుట్టుపై పన్ను వేసినట్టు రేవంత్ ప్రజలపై పన్నులు వేస్తున్నారని విమర్శించారు. రవాణా శాఖ పన్నులు పెంచారు.. భూమి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారు.. ప్రజల రక్తం తాగి ఢిల్లీకి మూటలు కడుతున్నారని’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా? అని చెప్పి మాట తప్పిండు.. రాజీనామా చేయాల్సి వస్తే స్పీకర్‌కు జిరాక్స్ కాపీలు పంపిన ఘనత రేవంత్‌దని.. కానీ తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదులుకొని చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్’ అని హరీశ్‌రావు కితాబునిచ్చారు. బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్, పాలకపక్షం అవుతుందని ఒప్పుకొన్నాడని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లన్నీ పేరుకేనని, బడ్జెట్లో రూ.వేల కోట్లు పెట్టి ఏ ఒక్క వర్గానికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు కేసీఆర్ న్యాయం చేశారని గుర్తుచేశారు. ఎత్తు, పొడవులతో ప్రజలకు పట్టింపు లేదని, మంచి పనులు ఎవరు చేసినా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. రేవంత్ ఐదేండ్ల పాలన 50 ఏండ్ల దాకా ప్రజలు తిట్టుకొనే పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి చేసే తుగ్లక్ పనులకు భవిష్యత్ తరాలు ఈయనో హిట్లర్, ఔరంగజేబు అని చెప్పుకొనే పరిస్థితి వచ్చిందిని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 80 ఏండ్ల తర్వాత కూడా హిట్లర్ చేసిన ఆగడాలు, తప్పులకు జర్మనీ ఇప్పటికీ ప్రపంచానికి క్షమాపణ చెబుతూనే ఉన్నదని కానీ రేవంత్ మాత్రం ఆ హిట్లర్ ఆదర్శం అంటారని విమర్శించారు. రేవంత్ ఐదేండ్ల పాలనా ఫలితం.. మరో 50 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతూనే ఉండాలని హెచ్చరించారు. ‘హైదరాబాద్‌లో ఎస్బీఐ ఇచ్చిన భూమిని సర్కార్ అమ్ముకొచ్చింది.. రూ.20 కోట్లు పెట్టి కొనుక్కున్నాం.. ఆ భూమిని రేవంత్ ఎలా అమ్ముకుంటాడని ఎస్బీఐ కోర్టుకు వెళ్లి స్టే తెస్తే ఎస్బీఐని ఇవాళ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు’ అని విమర్శించారు.
ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ వైఫల్యాలను ఎండగడుతూ హరీశ్‌రావు ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవుండ్ల మీద వేసిన ఒట్లు.. రైతుబంధు మీద ఎన్నికల ముందు.. ఆ తర్వాత.. నిన్న.. మొన్న మంత్రులు, ముఖ్యమంత్రి మాటలను వినిపించారు. సన్నలకు బోనస్ ఇస్తామని గొప్పగా చెప్పిన మాటలను.. ఆ తర్వాత మాట మార్చిన రేవంత్, ఉత్తమ్ మాట్లాడిన మాటలను చూపిస్తూ ఎండగట్టారు. మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని పార్టీలకు ఆదర్శమని, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తనూ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అక్రమ కేసులు బనాయించి వేధించినా ఏమాత్రం భయపడకుండా ప్రజల కోసం పనిచేస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై బీఎల్ఏలు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల, జైపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, అభిలాష్‌రావు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.