హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : తమ దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం ఈనెల 4వ తేదీన ‘చలో బస్‌భవన్’కు పిలుపునిస్తున్నట్టు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు 3 పీఆర్సీల ఏరియర్స్ రావాల్సి ఉందని బుచ్చిరెడ్డి తెలిపారు. దీంతోపాటు రిటైర్డ్ బెనిఫిట్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, తార్నాక ఆర్టీసీ దవాఖానలో రిటైర్డ్ ఉద్యోగులకు అన్నిరకాల వైద్యచికిత్సలు చేయాలని, సూపర్ లగ్జరీ బస్‌లోనూ రిటైర్డ్ ఉద్యోగులను అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారంకోసం ఆగస్టు 4న ఉదయం 10 గంటలకు బస్‌భవన్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు.