హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం సమావేశాలు రెండు రోజులు నిర్వహించి పారిపోవాలని చూస్తున్నదని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఫోర్త్‌సిటీ పేరుపై జరుగుతున్న అక్రమాలు, సీఎం కుటుంబ సభ్యుల పాత్ర, ధాన్యం కుంభకోణం, యూరియా, ఉద్యోగుల పీఆర్సీ, టీఏలు, సరెండర్ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ డీఏల అంశాన్ని అసెంబ్లీలో చర్చించాల్సి ఉన్నదని, అందుకు రెండు రోజులు ఎక్కడ సరిపోతాయని ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్లతో తెలంగాణకు జరిగే అన్యాయం, హైడ్రా కూల్చివేతలు, ప్రభుత్వ దవాఖానల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలపై అసెంబ్లీలో చర్చించాలని బీఏసీలో కోరినట్టు తెలిపారు.
ప్రభుత్వం మాత్రం సభను రెండు రోజులే నిర్వహించి పారిపోవాలని చూస్తున్నదని విమర్శించారు. వరదలు, యూరియా కంటే ప్రభుత్వానికి ఇంకేం ప్రాధాన్యం ఉంటుందని ప్రశ్నించారు. కాళేశ్వరంపై నాలుగు రోజులైనా చర్చించేందుకు తాము సిద్ధమేనని, కానీ ముందు ప్రజల కష్టాల గురించి చర్చిద్దామని కోరామని తెలిపారు. అసెంబ్లీలో జరిగే చర్చ గురించి రాత్రి 9 తర్వాత చెప్తామని సమాధానం ఇచ్చారని, చర్చ గురించి సమాచారం ఇవ్వకపోతే ప్రతిపక్షాలు ఎలా సన్నద్ధమవుతాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల గొం తు నొక్కడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, రాహుల్ దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
పీపీటీపై ప్రభుత్వానికి వణుకెందుకు?
‘కాళేశ్వరంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకు? వాస్తవాలు ప్రజలకు చెప్తామంటే వణుకెందుకు?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బృహత్తర ప్రాజెక్టు నిర్మాణానికి సాధించిన అనుమతులు, ఈ పథకం వల్ల రైతులకు కలిగిన ప్రయోజనాలు, భవిష్యత్తులో ఒనగూరే మేలు, సాగులోకి వచ్చిన ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు, ఖర్చు చేసిన నిధులు తదితర అంశాలను వివరిస్తామంటే సర్కారుకు, శాసనసభా వ్యవహారాల మంత్రికి వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. శనివారం బీఏసీ సమావేశం తర్వాత బయటకు వస్తూ అసెంబ్లీ లాబీలో హరీశ్‌రావు చిట్‌చాట్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కానీ వినేందుకు కాంగ్రెస్ సర్కారుకు, శ్రీధర్‌బాబు కు ఇష్టంలేదని ఆక్షేపించారు. నిజాలు తేల్చాల్సింది కమిషన్లు, ప్రభుత్వాలు కాదని, కోర్టులేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీవి దొంగ నాటకాలు
యూరియా లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో లేని యూరియా సమస్య ఇప్పుడెలా వచ్చిందని ప్రశ్నించారు. వరదలతో చాలా గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని, రోడ్లు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. యూరి యా కొరతకు బీజేపీ, కాంగ్రెస్సే కారణమని, ఎరువులపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ కోరిందని పేర్కొన్నారు.
యూరియా అడిగిన రైతులపై దాడులే ప్రజాపాలనా?
‘యూరియా అడిగిన రైతు చెంపచెల్లుమనిపించడం, దాడులకు దిగడమేనా ప్రజాపాలనా? ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా రేవంత్‌రెడ్డీ?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. యూరియా కొరతపై మొదటి నుంచి వక్రభాష్యాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సీఎంకు తెలిసిన విద్యలు రెండేనని అవి మూటలు మోయడం, మాటలు మార్చడమని నిప్పులు చెరిగారు. ‘మొదట యూరియా కొరతే లేదన్నారు. రైతుల క్యూలైన్ల చిత్రాలను ఏఐతో సృష్టించిన ఫేక్ ఫొటోలని ఎకసెక్కాలాడారు. లైన్లే లేవని, కొరత కృత్రిమ సృష్టి అని బుకాయించారు. బీఆర్ఎస్ కార్యకర్తలే క్యూలో ఉంటున్నారని అబద్ధాలు చెప్పారు. చివరకు యూరియా కొరతను అంగీకరించారు’ అని చెప్పారు. ఇప్పుడు తప్పు తమది కాదని కేంద్రానిదని నెపం నెడుతున్నారని దుయ్యబట్టారు. ఎరువుల కోసం క్యూలో ఉన్న రైతుపై చెయ్యిచేసుకున్న పోలీస్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో విఫలమైన ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.