హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ) : ‘కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేశారు.. వారు ఏ విధంగా అలా మాట్లాడారో? ఎవరి లబ్ధికోసం ఆ విధంగా వ్యవహరించారో? వారి విజ్ఞతకే వదిలేస్తున్న’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత తననుద్దేశించి చేసిన ఆరోపణలపై ఆయన పరోక్షంగా స్పందించారు.
లండన్ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా.. తెలంగాణ సాధన, అనంతరం అభివృద్ధిలో చూపిన స్పందించారు. లండన్ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా.. తెలంగాణ సాధన, అనంతరం అభివృద్ధిలో చూపిన నిబద్ధత, పోషించిన పాత్ర ప్రతిఒక్కరికీ తెలిసిందేనని ఉద్ఘాటించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో నిర్విరామంగా శ్రమించి నిర్మించిన వ్యవస్థలను రేవంత్‌రెడ్డి సర్కారు నిర్వీర్యం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. 21 నెలల్లోనే అన్ని రంగాలను భ్రష్టు పట్టిస్తూ ప్రజలను కష్టాల్లోకి నెట్టిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు యూరియా కోసం రైతాంగం, మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అరిగోస పడుతున్న వేళ ఈ దిగజారుడు రాజకీయాలు మంచివి కాదని హితవు పలికారు. దురుద్దేశంతో ఎవరు మాట్లాడినా పట్టించుకోబోమని తేల్చిచెప్పారు.
విపత్కర పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ ప్రజానీకాన్ని ఆదుకోవడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టంచేశారు. ‘మేము తెలంగాణ సోయి ఉన్నవాళ్లం.. బాధ్యతనెరిగిన వాళ్లం.. ద్రోహుల చేతుల్లోంచి రాష్ర్టాన్ని రక్షించుకోవడమే మా కర్తవ్యం’ అని పునరుద్ఘాటించారు. అందుకోసమే సమయాన్ని వెచ్చిస్తామని, ఆ దిశగా అలుపెరగని కృషి చేస్తామని స్పష్టంచేశారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకొనేందుకు, ప్రజల కష్టాలను దూరం చేసేందుకు కలిసికట్టుగా కదులుతామని ప్రకటించారు. దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణలు తమ దృఢ సంకల్పాన్ని దెబ్బతీయబోవని వెల్లడించారు.
వంటేరు ప్రతాప్‌రెడ్డికి పరామర్శ
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాతృమూర్తి వజ్రమ్మ పరమపదించిన నేపథ్యంలో హరీశ్‌రావు జగదేవపూర్ మండలం దౌలాపూర్ వెళ్లారు. వజ్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రతాప్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. బీహెచ్ఈఎల్ కార్మిక నేత, తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన వెంట ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులున్నారు.
కొంతకాలంగా నాపై, బీఆర్ఎస్పై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో? ఎవరి మేలు కోసం ఆ విధంగా మాట్లాడుతున్నారో? వారికే తెలియాలి..అబద్ధాలు మాట్లాడి అభాండాలు వేసినంత మాత్రాన అవి నిజాలు కావు.
-హరీశ్‌రావు