హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ‘అసెంబ్లీలో ఆడియో-విజువల్ ప్రజెంటేషన్ నిర్వహించడం భారతదేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం.. అందుకే మేం సభకు హాజరుకాము.. అంటూ నాడు నీతులు చెప్పిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేడు తుంగలో తొక్కడం దుర్మార్గం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ‘పీపీటీ వద్దని టీపీసీసీ అధ్యక్షుడిగా 2016, మార్చి 30న స్పీకర్‌కు స్వయంగా సంతకం పెట్టి రాసిన ఉత్తరం గుర్తున్నదా? ఆ ఉత్తరంపై ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ పద్మావతి సంతకాలు చేసిన విషయం మరచిపోయారా?’ అంటూ శనివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
అప్పుడు పార్లమెంటరీ సంప్రదాయాలు, నిబంధనల సాకుతో హాజరుకాబోమని చెప్పి ఇప్పుడు మంత్రి హోదాలో అసెంబ్లీ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం రాజకీయ ద్వంద్వ వైఖరి కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ అనైతికత, ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడానికి నాడు ఉత్తమ్ రాసిన ఆ ఒక్క ఉత్తరం చాలని దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నైతిక విలువలు, రాజ్యాంగ పద్ధతులు, పార్లమెంట్ స్ఫూర్తిని వల్లెవేస్తారు..అధికారంలోకి రాగానే అవే విలువలకు తిలోదకాలిస్తారు’అని ధ్వజమెత్తారు.
ఇదే కాంగ్రెస్ అసలు నైజమని మండిపడ్డారు. బీఏసీ సమావేశం, ఉత్తరం ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అధికారపక్షానికి అనుమతిస్తే, బీఆర్ఎస్కు కూడా ఇవ్వాలని స్పీకర్‌ను అభ్యర్థించిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా సర్కార్ పక్షానికి అనుమతులిచ్చి, తమ అభ్యర్థనను తిరస్కరించడం దురదృష్టకరమని వాపోయారు. ఇదే కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్కు మధ్య ఉన్న అసలు తేడా అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అన్ని సంప్రదాయాలు, పద్ధతులు, మర్యాదలకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగానికి తూట్లు పొడవడంతో తన మార్క్ ‘మార్పు’ చూపిస్తున్నదని ఎద్దేవాచేశారు. ఆ ‘మార్పు’ అసలు అర్థమేంటో తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.
నేడు ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాల’పై పీపీటీ
బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ అనే అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు. తెలంగాణ నీటిహక్కుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ైస్లెడ్స్తో సచిత్రంగా హరీశ్‌రావు వివరిస్తారని బీఆర్ఎస్ పార్టీ శనివారం ప్రకటనలో వెల్లడించింది.