హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యమై నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, ఖమ్మం జిల్లాలో మొన్న ఓ రైతు పురుగుల మందుతాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిషారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిపారు.
ఈ ఘటనలు మరువక ముందే గురువారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యాడని చెప్పారు. రైతు ఆత్మహత్యల నివారణకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం ప్రయత్నించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమంపై లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నమయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల్లోనే కాంగ్రెస్ మళ్లీ తీసుకువచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిం చి రైతుల సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేశారు.