Harish Rao | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ఎకరానికి రూ.5వేలు వస్తుండేదని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.7500 ఇస్తామని గొప్పలు చెప్పిందని.. అధికారంలోకి వచ్చాక ఆ ముచ్చట లేదని.. ఇచ్చే రూ.5వేల ఊసెత్తడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో 217 మందికి రూ.49.91లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటానన్నారు. కాంగ్రెస్ ఎగవేత, కోతల ప్రభుత్వమని విమర్శించారు. పెన్షన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మిలో రూ.లక్షతో పాటు తులం బంగారం మాటలకే పరిమితమైందన్నారు. రూ.4వేల పెన్షన్ దేవుడు ఎరుగు… కేసీఆర్ ఇచ్చే పెన్షన్ రాక రెండు నెలలైందన్నారు.
జులై, ఆగస్టు రెండు నెలల పెన్షన్లు రాక ముసలోళ్లు గోసపడుతున్నారన్నారు. ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే కల్యాణలక్ష్మి చెక్కురాక ఎనిమిది నెలలవుతుందన్నారు. ఎన్నికలప్పుడు రూ.లక్ష.. తులం బంగారం అని ప్రగల్భాలు పలికారని.. తులం బంగారం దేవుడు ఎరుగన్నారు. కేసీఆర్ ఇచ్చే రూ.లక్ష సైతం ఎగ్గొడుతున్నారన్నారు. అబద్ధాలు, మోసం మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. ఆగస్టు నెల సగం అయినా రైతుబంధు లేదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు జూన్‌లోనే రైతుబంధు పడిందని.. ఫోన్లు టింగ్ టింగ్‌మని మోగాయన్నారు.
కేసీఆర్ కంటే కంటే ఎక్కువ ఇస్తా అని అబద్ధాలు చెప్పి అధికారం లోకి వచ్చి మోసం చేసిండ్రని ధ్వజమెత్తారు. గ్రామాల్లో చెత్త పేరుకుపోతుందని.. ట్రాక్టర్ డీజిల్‌కు సైతం డబ్బులు లేవన్నారు. సఫాయి కార్మికులకు సైతం డబ్బులు రావడం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చెవుటోని ముందు శంఖం ఊదినట్టుందన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు, ఎస్సీ-ఎస్టీ-బీసీ రెసిడెన్షియల్ పని చేసే కార్మికులకు 8 నెలల జీతాలు లేవన్నారు. గ్రామాల్లో కుక్కలు కోరుకుతున్నాయని.. వసతి గృహల్లో ఎలుకలు కోరుకుతున్నాయన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాల్లో చెత్త లేదని.. ఇంటింటికి చెత్త సేకరణ జరిగేదన్నారు. ఇప్పుడు గ్రామాలే చెత్త కుప్పలుగా మారాయని.. పారిశుధ్య నిర్వహణ లేక దోమలు, ఈగలతో డెంగ్యూ సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ హరీశ్‌రావు ధ్వజమెత్తారు.