హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా? లేక దోపిడీ దొంగనా? రైతుల పట్ల ఎందుకు ఇంత కరశంగా వ్యవహరిస్తున్నరు’ అని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ‘దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేస్తారా? రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నం. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి దవాఖానకు తీసుకువెళ్లడం హేయమైన చర్య.. ఇంత కంటే దారుణం ఏముంటుంది’ అని గురువారం ఎక్స్‌వేదికగా మండిపడ్డారు. ‘వాళ్ల భూములనే గుంజుకుంటరు. తిరిగి వాళ్లనే అరెస్టులు చేస్తరా? రేవంత్‌రెడ్డీ.. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? ముమ్మాటికీ మీది ప్రజాకంటక పాలన. రైతు కంటక పాలన’ అని నిప్పులు చెరిగారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే రైతన్నకు బేడీలు వేసుడా? గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీస్కపోతరా? రైతుకు గుండెనొప్పి వచ్చినా ఈ పాలకుల గుండె కరగలేదా? ఫార్మాక్లస్టర్ పేరిట గిరిజన తండాల్లో మంటలు రాజేసి ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు బనాయిస్తరా? అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడబిడ్డలను వేధిస్తరా? భూమిని నమ్ముకొని అందరికీ బువ్వ పెట్టే రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం చూపే ప్రేమ ఇదేనా?
– నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి
పోలీసు కస్టడీలో ఉన్న లగచర్ల గిరిజన రైతు హీర్యానాయక్‌ను అమానవీయంగా, అక్రమంగా బంధించడం మానవ గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే! దేశంలో ఎక్కడైనా జైలులో ఉన్నప్పుడు, ప్రయాణం సందర్భంగా ఖైదీలకు సంకెళ్లు వేయడాన్ని సుప్రీంకోర్టు నిర్దందంగా ఖండించింది. తెలంగాణ పోలీసులు గూండాలు, డెకాయిట్ల మాదిరిగా చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారో అర్థం కావడంలేదు.
– దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేత
హీర్యానాయక్ ఏమన్న తీవ్రవాదా? ఉగ్రవాదా? లేక అడ్డంగా డబ్బులు పంచుతూ దొరికిన దొంగనా? ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేయడమే ప్రజాపాలనా? ఇదే ఇందిరమ్మ రాజ్యమా? గుండె నొప్పితో బాధపడున్నా చూడకుండా బేడీలు వేసి దవాఖానకు తీస్కపోతరా? 30 రోజులుగా జైల్లో మగ్గుతున్న 45 మంది లగచర్ల రైతులపై సీఎం కనీసం కనికరం చూపించడం లేదు.
– కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్
రైతుల భూములు గుంజుకోవాలని చూసి తిరిగి వారిపైనే కేసులు పెడుతరా? అసలు సంకెళ్లు వేయాల్సింది రైతుకా? రేవంత్‌కా? ఫార్మా విలేజ్ కోసం భూములు లాక్కోవాలని చూసింది సీఎం రేవంత్‌రెడ్డి. రైతులతో కనీసం చర్చలు జరపకుండా అధికారులను పంపింది రేవంత్‌రెడ్డి. పోలీసులతో దాడి చేయించి ఫార్మా విలేజ్ ప్రతిపాదనను రద్దు చేసుకున్నదీ రేవంత్‌రెడ్డి. ఇందులో రైతుల తప్పేమున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం.
– వై సతీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్