హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ):‘హామీలిచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎకడికకడ అరెస్టు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు చెప్పారు.
సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హకు కూడా నిరుద్యోగులకు లేదా? అని ప్రశ్నించారు. ఓవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతులు, హకులను అణగదొకే కుట్రలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ‘ఇది ప్రజాపాలన కాదు..ముమ్మాటికీ అప్రజాస్వామ్యపాలన’ అని హరీశ్ ఫైర్ అయ్యారు.
ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి ఈ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకొంటే విద్యార్థులు, నిరుద్యోగులకు తోడుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టంచేశారు. వారి డిమాండ్లు నెరవేర్చేదాకా వదిలిపెట్టేది లేదని, విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున గొంతెత్తుతామని, నిర్విరామ పోరాటం చేస్తామని ప్రకటించారు.