Harish Rao | సిద్దిపేట, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘జనం ఓట్లు వేసేటట్టు లేరని కాంగ్రెస్, బీజేపీ కొత్త నాటకానికి తెరతీశాయి. కాంగ్రెస్ గెలిస్తే హిందువుల భూములను ముస్లింలకు పంచుతుందని బీజేపీ వాళ్లు రెచ్చగొడుతున్నరు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయని కాంగ్రెస్ అంటున్నది. రిజర్వేషన్లు పోతాయా? అంటే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు మార్చే హక్కు ఎవ్వరికీ లేదు’ అని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు.
బుధవారం సిద్దిపేటలోని కోమటిచెరువు వద్ద, డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్‌తో మాట్లాడారు. పట్టణంలో పాదయాత్ర చేపట్టారు. రాత్రి చిన్నకోడూరు, నంగునూరులో నిర్వహించిన రోడ్‌షోల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భాల్లో మాట్లాడిన హరీశ్.. ‘వడగండ్ల వానతో నష్టపోయిన, పంటలు ఎండిన రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ గట్టిగా అడుగుతున్నడు. మా ప్రభుత్వం మీద గట్టిగా కొట్లాడుతున్నడు అని కాంగ్రెస్ వాళ్లు ఫిర్యాదు చేస్తే, కేసీఆర్ ప్రచారాన్ని రెండు రోజులు ఆపారు’ అని విమర్శించారు. రెండు రోజులు ప్రచారాన్ని ఆపినా, తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆర్ ఎప్పటికీ నిలిచి ఉంటారని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల హృదయాల నుంచి కేసీఆర్‌ను దూరం చేయలేరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. కేసీఆర్ బస్సుయాత్రతో బయలుదేరితే కాంగ్రెస్, బీజేపీవాళ్లు గజగజ వణుకుతున్నారని, అందుకే భయంతో ప్రచారాన్ని ఆపాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘రుణమాఫీ ఎప్పుడు చేస్తవ్? వడ్లకు బోనస్, అక్క చెల్లెలకు రూ.2,500, అవ్వాతాతలకు రూ.4 వేల పింఛను ఎందుకు ఇస్తలేవు? అని కేసీఆర్ అడిగితే..
ఈ రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? కేసీఆర్‌ను పట్టుకొని నీ చెడ్డి ఊడగొడతా అని అంటున్నడు. తెలంగాణ తెచ్చిన పెద్దాయనను పట్టుకొని అలా అనొచ్చా? ఒక సీఎం మాట్లాడే మాటలేనా? కేసీఆర్‌ను అంటే తెలంగాణ ప్రజలందర్నీ అన్నట్టు కాదా? మన గౌరవం తీసేసినట్టు కాదా? మన ఆత్మగౌరవాన్ని ఈ రేవంత్‌రెడ్డి దెబ్బ తీస్తున్నాడు. కేసీఆర్ లేకపోతే సిద్దిపేట, సిద్దిపేట లేకపోతే కేసీఆర్ ఉంటడా? తెలంగాణ తెచ్చినోడు మన కేసీఆర్.
జిల్లాలు చేసిండు, సిద్దిపేటకు రైలు తెచ్చిండు. గోదావరి నీళ్లు తీసుకవచ్చి మన సిద్దిపేట పేరు ప్రఖ్యాతులు కాపాడిండు. మన కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి తిట్టుడు అంటే మనందర్నీ అవమానించినట్టే’ అని వెల్లడించారు. ఓటుతోనే ఈ కాంగ్రెస్ సర్కారుకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
‘ఢిల్లీ గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్తున్న రేవంత్.. నాలుగు నెలల్లో ప్రజలకు ఇచ్చిందీ గాడిద గుడ్డు తప్ప ఇంకోటి లేదు. వంద రోజుల్లో హామీలు అని మోసం చేసిండు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేయొద్దు. పెనం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుంది. బీజేపీ గెలిస్తే ఇంకా ఆగమైతం’ అని ప్రజలకు సూచించారు. ఎప్పటికైనా బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.