హైదరాబాద్: తిమ్మిని బమ్మిని చేయబోయి సీఎం రేవంత్ రెడ్డి బొక్కబోర్లాపడ్డారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. అబద్ధమే ఆశ్చర్యపడే విధంగా సీఎం రేవంత్ మాటలున్నాయని విమర్శించారు. తన రియల్ ఎస్టేట్ కలలను గ్రాఫిక్ హంగులతో చూపించారన్నారు. రివర్ రిజువనేషన్, రివర్ ఫ్రంట్ అని ప్రజెంటేషన్ ఇచ్చారు. రివర్ రెజునెవేషన్ అంటే నదీ పునరుజ్జీవనం. మరి ఈ రివర్ ఫ్రంట్ ఏందని ప్రశ్నించారు. దాని వెనుక దాగి ఉన్న స్టంట్ ఏందని నిలదీశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలోనే మూసీ పునరుజ్జీవనం ప్రారంభించామన్నారు. రేవంత్ చూపించింది రివర్ ఫ్రంట్ అని చెప్పారు. రూ.3800 కోట్లతో కేసీఆర్ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, గోదావరి జలాలను మూసీకి తేవడానికి రూ.1100 కోట్లతో ప్రాజెక్ట్ చేపట్టారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును మార్చి రూ.4 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు.
మూసీలో 99 శాతం మంది సుందరీకరణ వద్దంటున్నారని చెప్పారు. ఏ ప్రాజెక్ట్ చేపట్టాలన్నా ముందు డీపీఆర్ తయారు చేయాలి. పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇండ్లను ప్రభుత్వం కబ్జా చేస్తున్నది. ఫార్మాసిటీని రద్దు చేయలేదని హైకోర్టులో చెప్పారు. ఫోర్ట్ సిటీ ఎక్కడుంది.. ఎక్కడ కడుతారని ప్రశ్నించారు. నల్లగొండ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నల్లగొండ ప్రజలపై ప్రేమ ఉంటే మూసీలోకి పారిశ్రామిక వ్యర్థాలు పోనివ్వొద్దు. హైదరాబాద్‌లో వరదలు వస్తాయని బెదిరిస్తున్నరు. 1908లో హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు నిజాం చర్యలు చేపట్టారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు జంట జలాశయాలు నిర్మించారు. మళ్లీ ఇంతవరకు అంతటి వరదలు రాలేదు. ఎక్కువ వరదలు వస్తాయంటే మూసీకి గైడ్ వాల్ కట్టాలి. పేదల ఇండ్లకు అభ్యంతరం ఉంటే మాల్ కట్టడానికి అభ్యంతరం ఉండదా. పేదల ఇండ్లు కూలగొట్టడానికి మేం వ్యతిరేకం. బ్యూటిఫికేషన్ పేరుమీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు. మూసీ నది గర్భంలో ఉన్నవాళ్లకు 2013 పునరావాస చట్టం అమలు చేయాలి. గచ్చిబౌలిలో 450 ఎకరాలున్నాయి. అక్కడ ఇండ్లు ఇవ్వండి. మూసీ బఫర్ జోన్లో ఉన్న ఇండ్లను కూల్చొద్దు. 10 వేల కుటుంబాలకు మేలు జరుగుతుందంటే తాను వెళ్లి మూసీ బఫర్ జోన్లో మూడు నెలలు కాదు.. 4 నెలలు ఉంటా.
సుందరీకరణ పేరుతో రేవంత్ పేదల ఇండ్లు కూలగొడుతున్నారు. మూసీ పునరుజ్జీవనం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నరు. విష వ్యర్ధాలు మూసీలోకి రాకుండా ఫార్మాసిటీ ప్రతిపాదించాం. జనవాసాల్లోని కంపెనీలను తరలించే ఏర్పాట్లు చేశాం. ఫార్మా సిటీకి కేటాయించిన భూమిని కూడా రియల్ ఎస్టేట్‌కు మార్చుతున్నారు. శత్రు దేశాల మీదికి దాడికి వెళ్లినట్లు పేదల బస్తీలపై ప్రభుత్వం దాడి చేస్తున్నది. లక్షన్నర కోట్లతో మూసీ ప్రాజెక్టు చేపడతామని రేవంత్ చెప్పారు. ఇప్పుడు అలా ఎవడు చెప్పాడని దబాయిస్తున్నడు. మూసీపై రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నడు.
మూసీ నుంచి మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ వెళ్దామని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తానే స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తానని, రేవంత్ వస్తే తీసుకెళ్తానని చెప్పారు. ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాంమన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు దేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ, రోడ్లు, విద్యుత్ సహా అన్ని సౌకర్యాలతో 250 గజాల స్థలంలో ఇండ్లు నిర్మించామన్నారు. 2013 భూసేకరణ చట్టానికి మించి నిర్వాసితులకు ఇచ్చామన్నారు. భూసేకరణ చట్టం మూసీ నిర్వాసితులకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఐదు రకాల ప్రయోజనాలు కల్పించామన్నారు. 250 గజాల్లో ఇండ్లు కట్టించామని, కుటుంబ యజమానికి రూ.7.5 లక్షలు, 18 ఏండ్లు నిండిన వారికి రూ.5 లక్షలు, 250 గజాల స్థలం ఇచ్చామన్నారు. మొత్తంగా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ నిర్వాసితులకు రూ.2 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మూసీ నిర్వాసితులకు ఇస్తున్నారని విమర్శించారు.
‘మూసీ నది పునరుజ్జీవనమే తప్ప సుందరీకరణ కాదని ముఖ్యమంత్రి చెప్పాడు.. కానీ విదేశీ కంపెనీ ఇచ్చిన వీడియో చూస్తే మాత్రం న్యూయార్ టైం స్క్వేర్ను మించిన వెలుగు జిలుగులు, సిడ్నీ ఒపెరా హౌజ్‌ను తలదన్నే హైరైజ్ బిల్డింగులు, లండన్ లోని థేమ్స్ నది మీదున్న బ్రిడ్జిని మించిన బ్రిడ్జిలు చూపెట్టిండు. ప్రపంచ దేశాల్లో ఉన్న రివర్ ఫ్రంటులన్నీ ఒక్క దగ్గర వేసి దంచి నూరి ఏఐలో వేసి తీసినట్టున్నపంచవన్నెల దృశ్యాలను చూపించాడు. నది పునరుజ్జీవనం అంటే సజీవంగా గలగలపారే స్వచ్ఛమైన జలాలు.. అద్దాల బిల్డింగులు ఉండవంటూనే ఎన్నెన్నో అందాలను చూపించారు. ముఖ్యమంత్రి మాట కరెక్టా? కాంట్రాక్టు తీసుకున్న కంపెనీల చూపించిన వీడియో కరెక్టా?. మీ ప్రజెంటేషన్‌లో రివర్ రెజువనేషన్, రివర్ ఫ్రంట్ అని ఉంది.. రివర్ రెజునెవేషన్ అంటే నదీ పునరుజ్జీవనం. మరి ఈ రివర్ ఫ్రంట్ ఏంది.. దాని వెనుక దాగి ఉన్న స్టంట్ ఏంది?.
రేవంత్.. నీది నోరా మోరా? మూసీ సుందరీకరణ కోసం రూ.లక్షా 50 వేలు ఖర్చుపెడతామని నీ నోటితో నువ్వే చెప్పి, ఇప్పుడు సిగ్గులేకుండా రోజుకో మాట మాట్లాడుతున్నవ్. శత్రుదేశాల మీద దాడికి పోయినట్టు.. రేవంత్ రెడ్డి పేదల ఇంటిమీద దాడి చేస్తున్నాడు. నిర్మాణాత్మకమైన పనితో పని ప్రారంభం కావాలి.. కానీ విధ్వంసంతో నువ్వు పని ప్రారంభం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి గుర్రాలతో తొక్కించిన సంస్కృతి నీ కాంగ్రెస్ పార్టీది, నువ్వు గతంలో ఉన్న తెలుగు దేశం పార్టీది. ఆశ వర్కర్లను, అంగన్వాడీలను అసెంబ్లీ ముందు గుర్రాలతో తొక్కించిన చరిత్ర నీ కాంగ్రెస్ పార్టీది. పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించమని చెప్పితే గుర్రాలతో తొక్కించిన ఘనత గతంలో నువ్వున్న టీడీపీ పార్టీది.’ అని రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
LIVE: Former Minister, MLA @BRSHarish Press Meet at Telangana Bhavan https://t.co/8amzLgJERV
— BRS Party (@BRSparty) October 18, 2024