Harish Rao | రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యమని.. గాలిమాటలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తాంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. చిరు ఉద్యోగుల శ్రమను, కష్టాన్ని గౌరవించడం మీకు చేతకాదా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బెనిఫిట్స్ కోసం, స్కావెంజర్ల వంటి చిరు ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు పేద విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకం నిధులు సైతం ఏడాదిగా పెండింగ్‌లో పెట్టారని.. కేసీఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని నిలిపివేశారని.. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించకుండా అమలు గాలికి వదిలేశారని ఆరోపించారు.
విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్ సొంత శాఖలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతన సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి, ఆచరణలో మాత్రం గాలికి వదిలేశారని.. మీ మాటల మాయాజాలంతో ఎంతకాలం ఉద్యోగులను మోసం చేస్తారు? మండిపడ్డారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవలందించిన విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులైన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని మానసికంగా వేధించడం అమానవీయం, అనైతికమన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తున్నామని చెబుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆవేదన వింటే మనస్సు చలించిపోతుందని.. మధ్యాహ్న భోజన పథకం సహా విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, స్కావెంజర్ల 9 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.