Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ జరిగే వరకు సీఎం రేవంత్‌రెడ్డి గుండెల్లో నిద్రపోతానని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. రుణమాఫీ పూర్తికాలేదని, ఇంకా 22 లక్షలమందికి జరగాల్సి ఉన్నదని పేర్కొన్నారు. రుణమాఫీ జరిగినట్టు సీఎం సొంతగ్రామం కొండారెడ్డిపల్లిలో చూపించాలని, తేదీ, సమయం ప్రకటిస్తే తాను వస్తానని సవాల్ విసిరారు. రుణమాఫీ జరిగే వరకు బీఆర్ఎస్ వదిలిపెట్టదని హెచ్చరించారు. తన ఎత్తు గురించి మాట్లాడే రేవంత్‌రెడ్డి తన ఎత్తుకు పెరగలేడని ఎద్దేవా చేశారు. రేవంత్ బుద్ధి, చరిత్ర, భాష అన్నీ కురచేనని విమర్శించారు. రేవంత్ మాటలను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై గాంధీతో దాడి చేయించింది ఆయనేనని అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, శివకుమార్, వాసుదేవరెడ్డితో కలిసి ఆదివారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలు రెండు రకాల వరదలతో ఇబ్బందులు పడుతున్నారని, ఒకటి వానల వల్ల వచ్చేది అయితే, రెండోది సీఎం అబద్ధాల వరద అని విమర్శించారు. తన కుర్చీకైనా మర్యాద ఇవ్వాలని రేవంత్ ఇటీవల అన్నారని, అలా జరగాలంటే భాష, వ్యవహారశైలి, నడవడిక మర్యాదగా ఉండాలని స్పష్టం చేశారు. బూతులు మాట్లాడి మర్యాద రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. తనను తాటిచెట్టు అన్నందుకు.. తాను లిల్లీపుట్ అని తిరిగి అనొచ్చని, తనను సన్నాసి అంటే తాను కూడా సన్నాసి అనగలనని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజలు రెండు రకాల వరదలతో ఇబ్బంది పడుతున్నారు. ఒకటి ప్రకృతిపరమైన వరద, రెండోది ముఖ్యమంత్రి అబద్ధాల వరద.
-హరీశ్
మాట తప్పిన సన్నాసి, మోసం చేసిన సన్నాసి అని నేను కూడా వందసార్లు అనగలను. కానీ, నాకు సంస్కారం ఉన్నది. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా?
-హరీశ్
తన ఎత్తు గురించి పదేపదే రేవంత్ దుర్భాషలాడుతున్నాడని, తన ఎత్తుపై ఎందుకంత ఈర్ష్య అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘నేను పొడుగే. అది దేవుడిచ్చింది. తెలంగాణ ఉద్యమం నన్ను మరింత పొడుగుచేసింది. నువ్వు ఎంత తండ్లాడినా నా అంత ఎత్తు పెరగలేవు’ అని రేవంత్‌కు తేల్చి చెప్పారు. చిల్లర మాటలు బంద్‌చేసి రాష్ట్రం గురించి, రైతుల గురించి, ప్రజల గురించి ఆలోచించాలని రేవంత్‌కు హితవు పలికారు.
రుణమాఫీ జరిగిందని ఏ ఊర్లో అయినా చెప్పించాలని రేవంత్‌కు హరీశ్ సవాలు విసిరారు. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్‌లో 122 మందిలో ఇంకా 82 మంది రైతులకు రూ. 1.05 కోట్లు ఇంకా మాఫీ కావాల్సి ఉన్నదని తెలిపారు. ఆ వివరాలు సీఎంకు పంపిస్తానని తెలిపారు. రుణమాఫీ జరిగి ఉంటే సురేందర్‌రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నించారు. ‘రైతులను మోసం చేసింది నువ్వు, మాట తప్పింది నువ్వు, రుణమాఫీ చేయంది నువ్వు, ఇంకా నా గురించి మాట్లాడుతవా?’ అని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, రూ. 4 వేల పింఛను ఇస్తా అన్నది నువ్వు కాదా? మహిళలకు రూ.2500 ఇచ్చినవా? అని ప్రశ్నించారు. ‘విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తానని మోసం చేసిన సన్నాసి నీవు కాదా? ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన సన్నాసివి నీవు కాదా?’ అని సీఎంను దునుమాడారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది రైతులు రూ. 2 లక్షల రుణం ఉన్నవారు పై మొత్తాన్ని చెల్లించారని, వారికి వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మాట మీద ఉండే మనిషివి అయితే వెంటనే రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు.
ఫోర్త్ సిటీ ఎక్కడిదని, దానికి భూమి ఎక్కడుందో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఫార్మా సిటీకి కేసీఆర్ ప్రభుత్వం 12 వేల ఎకరాలను సేకరించిందని, ఫార్మా రంగంలో ఉద్యోగాలు, పెట్టుబడులు రావాలని, మంత్రిగా కేటీఆర్ రూ.1500 కోట్లు ఖర్చు చేసి భూమిని సేకరించారని హరీశ్‌రావు తెలిపారు. ఆ భూమిని ఫార్మా సిటీకి ఇవ్వకుండా దానిని ఏదో ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఏస్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీ భూములను రైతులకు వాపస్ ఇస్తామని అన్నారని, రైతులకు భూములను వాపస్ ఇవ్వాలని, లేకుంటే ఫార్మా సిటీ పెట్టాలని డిమాండ్ చేశారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇచ్చిన ఉచిత కరెంట్ కాస్తా ఉత్త కరెంట్ అయిందని, 4, 5 గంటలు కూడా రాకపోయేదని, నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ హయాంలోనే అని హరీశ్‌రావు గుర్తుచేశారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చామని, కనురెప్ప కొట్టినంత సేపు కూడా పోలేదని గుర్తుచేశారు.
నేనెక్కడా దాక్కోలే. నీ గుండెల్లో నిద్రపోతూ, నిన్ను నిద్ర పోనివ్వకుండా చేస్తున్న. అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తుచేస్తూ మీ మెడలు వంచి సగం మాఫీ చేయించా. మిగతా సగం చేసేదాకా నీ వెంటపడుతూనే ఉంటా.
-హరీశ్
రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని, పదేపదే పదేండ్లు పాలిస్తామని చెప్తున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో ఐదేండ్లకే ఓడిపోయారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు రెండుసార్లు వచ్చేంత సీన్ లేదని తేల్చి చెప్పారు. రేవంత్‌రెడ్డి ఐదేండ్లు ఉండేదే ఎక్కువని, ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారని అన్నారు.
ఉపాధ్యాయుల బదిలీలు 18 ఏండ్ల తర్వాత చేపట్టామని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని, 2018లో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. స్కూల్స్‌కు ఇంతకుముందు ఉచిత కరెంట్ లేనట్టుగా చెప్తున్నాడని, కానీ గతంలోనే ఉచిత కరెంట్ ఉందని, దీనికి సంబంధించిన మొత్తాన్ని స్కూల్స్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ గ్రాంట్‌ను బంద్ చేసి ప్రభుత్వమే విద్యుత్తుశాఖకు బిల్లులను చెల్లిస్తుందని పేర్కొన్నారు.
అరికెపూడి గాంధీ ఇప్పుడు ఏ పార్టీకి కాకుండా పోయాడని హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం మాటలను బట్టి తానే దాడిచేయించినట్టు అర్థమవుతున్నదని, పైగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది? నిజంగా ఆ రోజు కేసీఆర్ ఆలోచించి ఉండి ఉంటే ఏమైతుండే అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని కూడా కాంగ్రెస్ ఘనకార్యంగా చెప్పుకుని అబద్ధమాడుతున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉండి దంచుండ్రి, కొట్టండి, చితక్కొటండ్రి, చింతకాయ కొట్టుండ్రి వంటి మాటలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినవా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఒక్క కమ్యూనల్ సంఘటన కూడా జరగలేదని, కానీ రేవంత్‌రెడ్డి హయాంలో 9 కమ్యూనల్ ఘటనలు జరిగాయని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్‌చేసి సభ్యతతో మాట్లాడాలని హరీశ్‌రావు హితవు పలికారు.
‘నేను ఎక్కడ దాక్కున్నా.. నీ గుండెల్లో దాక్కున్నా.. నీ గుండెల్లో నిద్రపోతున్న. నీకు నిద్ర పట్టనియ్యకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తుచేస్తూ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించిన. మిగతా సగం చేయించే దాకా నీ వెంట పడుతూనే ఉంటా. రాష్ట్రంలో 42 లక్షల మంది రుణమాఫీ అయ్యే వరకు నీ గుండెల్లో నిద్ర పోతా’ అని రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు హెచ్చరించారు.