Harish Rao | మెదక్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ‘నువ్ టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యేలను కాదు.. బాధల ఉన్న రైతులను టచ్ చెయ్.. ఆరు గ్యారెంటీలను టచ్ చెయ్..’ అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హితవు పలికారు. ‘మా ఎమ్మెల్యేలను కొంటే ఇద్దరిని కొనొచ్చు. కానీ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కొనలేవు.
కేసీఆర్‌ను తిట్టుకుంట కాలక్షేపం చేసుడు కాదు.. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఆరు గ్యారెంటీలు అమలు చెయ్యి. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెడుతరు’ అని ఘాటుగా హెచ్చరించారు. మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌడ్, ర్యాకల శేఖర్‌గౌడ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మాట తప్పుడు, అబద్ధాలాడుడు నీ నైజం, అబద్ధాలాడడంలో నీకు ఆస్కార్ అవార్డు ఇయ్యాలె.
కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నవ్.. తీసుకున్నవా? వంద రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనయ్?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్వేశించి హరీశ్ ధ్వజమెత్తారు. ‘నిన్న ముఖ్యమంత్రి మెదక్ వచ్చి ఒక్కటన్న మెదక్‌కు పనికొచ్చే మాట మాట్లాడిండా?.. రేవంత్ నిలబడ్డ రాందాస్ చౌరస్తా కేసీఆర్ అభివృద్ధి చేసిందే, మెదక్‌కు ఏం చేశాడో చెప్పడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు’ అని అన్నారు.
‘రేవంత్.. మీ అభ్యర్థి నామినేషన్ కోసం నువ్వొచ్చిన కలెక్టరేట్ ఎక్కడిది? నువ్వు తీసిన ర్యాలీలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఫోర్‌లేన్ రోడ్లు, రాందాస్ చౌరస్తా, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, మంజోజిపల్లి బ్రిడ్జి కనబడలేదా?’ అని ప్రశ్నించారు. ‘మీ హయాంలో ఘనపూర్ కాలువ తుప్పుపట్టి పోయింది, పగుళ్లు పెట్టినయ్. కేసీఆర్ హయాంలో ఘనపూర్ ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది’ అని గుర్తుచేశారు.
ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేసి మెదక్‌కు అన్యాయం చేసింది రేవంత్‌రెడ్డేనని విమర్శించారు. ‘ఆ దుర్గమ్మ ఉసురు తగులుతుంద’ని మండిపడ్డారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో యూనివర్సిటీలు, రైళ్లు వచ్చాయంటే అది కేసీఆర్ చలవేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మెదక్‌కు రైలు గురించి ఎన్నడూ పట్టించుకోలేదని, కేసీఆర్ రైల్వే అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.100 కోట్లు ఇస్తేనే ఈ రోజు మెదక్‌కు రైలు వచ్చిందని చెప్పారు.
మెదక్‌కు మెడికల్ కళాశాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. ఇక్రిశాట్ను ఇందిరాగాంధీ ఇచ్చారంటున్నారని, ఇక్రిశాట్ను తెచ్చింది నాటి ప్రధానమంత్రి చరణ్‌సింగ్ అని గుర్తు చేశారు. బీహెచ్ఈఎల్ 1952లో ప్రారంభిస్తే ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసింది 1980లో అని చెప్పారు. ఇలాంటి అబద్ధాలు మాట్లాడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
మంత్రులకు అహంకారం నెత్తికెక్కింది
కాంగ్రెస్ పార్టీ మంత్రులకు అహంకారం నెత్తికెక్కి వీర్రవీగుతున్నారని, గాల్లో తేలియాడుతున్న కాంగ్రెస్ నేల మీదికి రావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని ప్రజలకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ‘కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాయం తీసుకుంటా అన్నవ్.. తీసుకున్నవా? మాట తప్పడం మీ నైజం, అబద్ధాలు మాట్లాడడం మీ నైజం’ అని రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘వెంకట్రామిరెడ్డిని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చారంటరా? నువ్వు కొడంగల్‌లో ఓడిపోతే మల్కాజిగిరి నుంచి పోటీ చేశావు కదా?. వెంకట్రామిరెడ్డి ఈ జిల్లాలో 20ఏండ్లు పనిచేసిండు. అతడు వేరే జిల్లాకు చెందినవాడెట్లయితడు?. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పటాన్‌చెరువులో మా అభ్యర్థి మహిపాల్‌రెడ్డికి ఓట్లేసిండ్రు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటరు’ అని తెగేసిచెప్పారు.
నా ఎత్తుతో నీకేం పని?
‘నా ఎత్తు గురించి నీకేం పని.. నేను పొడువుగా ఉంటా.. ఎట్లనన్న ఉంటా.. నా గురించి పక్కన పెట్టి రైతుల తిప్పల గురించి ఆలోచించు.. వాళ్ల సమస్యలు పరిష్కరించు’ అని రేవంత్‌కు హరీశ్ హితవుపలికారు. రామాయంపేట మండలం తొనిగండ్లలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంలో అక్కడి రైతులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, లారీలు రావడం లేదని ఆవేదన చెందినట్లు చెప్పారు. మొలకెత్తిన ధాన్యాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు.
బాండ్ పేపర్ ఇజ్జత్ తీసినవ్
‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు బాండ్ పేపర్ ఇచ్చి ఆ బాండ్ పేపర్ ఇజ్జత్ తీసినవ్.. బాండ్ పేపర్ అంటే నమ్మకానికి ప్రతీక. ఆరు గ్యారెంటీల్లో, ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదంటున్నవ్.. నిండు అసెంబ్లీ సాక్షిగా భట్టి విక్రమార్క అనలేదా?’ అని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఎగవేత, దాటవేతలో పోటీ పడుతున్నారని హరీశ్ ఎద్దేవాచేశారు.