హైదరాబాద్, మార్చి 19 (నమస్తేతెలంగాణ): అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమా ర్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా ఝూటా బడ్జెట్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. పవిత్రమైన శాససనభలో రాజకీయ ప్ర సంగం చేసి పచ్చి అబద్ధాలు..అతిశయోక్తులు చెప్పారని మండిపడ్డారు. బడ్జెట్ సాక్షిగా ఆరు గ్యారెంటీలకు తిలోదకాలిచ్చారని దుయ్యబట్టారు. మహిళలకు ఏటా లక్ష కోట్ల వడ్డీలేని రుణాలిచ్చి కోటీశ్వరులను చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి..కేవలం 5 లక్షల వరకే వర్తింప జేస్తూ జీవో ఇచ్చి మోసం చేశారని ఫైర్ అయ్యారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా హాల్లో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌కుమార్, వివేకానందతో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో సంక్షేమాన్ని వివరిస్తూనే.. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు.
సగం మంది రైతులకే రూ.2 లక్షల రుణమాఫీ చేసి అందరికీ పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని హరీశ్ దుయ్యబట్టారు. కొంతమందికే చేసి మిగిలిన వారికి మొండిచెయ్యి చూపిందని మండిపడ్డారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు భూసేకరణ విషయంలో గోల్మాల్ చేశారని, నిరుడి మాదిరిగానే ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రా రంభమైందని, దక్షిణ భాగానికి డీపీఆర్ చేస్తున్నామని ప్రతిపాదించడం సిగ్గుచేటని, 16 నెలల్లో ఒక్క ఎకరం కూడా సేకరించలేదని ధ్వజమెత్తారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద రూ. 32,618 కోట్లు పెట్టడాన్ని బట్టి చూస్తే యథేచ్ఛగా భూముల పందేరానికి తెరలేపుతున్నట్టు అర్థమవుతున్నదని చెప్పారు. 15 నెలల్లో ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించారో చెప్పాలని డిమాండ్‌చేశారు.
సబ్‌ప్లాన్ తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ధోకా చేస్తున్నదని హరీశ్ విమర్శించారు. ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ప్రస్తుతం పైసా కూడా కేటాయించలేదని తెలిపారు. వాస్తవ విరుద్ధంగా సీఎస్ఎస్ ద్వారా కేంద్రం నుంచి రూ. 15,729 కోట్లు ప్రతిపాదించడం సత్యదూరమని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,966 కోట్లే వచ్చాయని తెలిపారు.