హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి దుస్థితి కనిపిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ కార్యక్రమంతో నల్లాల ద్వారా ఇంటింటికి తాగునీటిని సరఫరా చేస్తే.. కాంగ్రెస్ పాలనలో బిందెలు, డ్రమ్ములతో జనం రోడ్డెక్కుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ నిర్వహణ వైఫల్యంతో ప్రభుత్వం నల్లాల ద్వారా నీళ్లు సరఫరా చేయలేని దీనమైన పరిస్థితి ఎదుర్కొంటున్నదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లు సాగునీళ్ల కోసం రైతుల గోస.. ఇప్పుడు తాగునీళ్ల కోసం ప్రజల ఘోష!, కాంగ్రెస్ పాలనలో తడారిన పొలాలు.. ఎడారయిపోతున్న ప్రజల బతుకులు. ముందుచూపు లేమి, నిర్లక్ష్యంతో ప్రాజెక్టుల్లో నీళ్లు ఒడిసి పట్టలేదు, చెరువులు నింపలేదు, భూగర్భ జలాలు పెంచలేదు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేయడంలేదు. కేసీఆర్ ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి, తాగునీళ్లిస్తే.. రేవంత్ కనీసం ఆ పథకాన్ని కొనసాగించలేక పోతున్నప్పుడు.. ఉమ్మడి పాలన నాటి బిందెలు, డ్రమ్ములు మళ్లా రోడ్లపై కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆత్మగల్ల పాలకుడికి, తెలంగాణ ప్రయోజనాలు పట్టని పాపాత్ముడికి ఉన్న తేడా ఇది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువు. రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం తెచ్చిన కరువు అని హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు అబద్ధాల ప్రవాహాన్ని పారించడం మానేసి, ప్రజల ఇండ్లకు తాగునీటిని పారించాలని హితవు పలికారు.