హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తేతెలంగాణ): ఆర్టీసీ కార్మికులకు డమ్మీ చెక్కులు ఇచ్చి మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, హామీల అమలు కోసం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని వివరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ విలీనాన్ని చివరి దశకు తీసుకొచ్చామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ సైతం ఇదే హామీని ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి గద్దెనెక్కిన తరువాత రేవంత్‌కు పాలన చేతకావడం లేదని విమర్శించారు. తాను నిత్యం వెంటపడి ఒత్తిడి చేయడంతోనే కనీసం సగమైనా రైతులకు రుణమాఫీ చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు నెలకు రూ. 2500, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. కులవృత్తుల వారికి ఇచ్చే ఆర్థిక సాయం, రెండు విడుతల రైతుబంధు, కేసీఆర్ కిట్లు ఎగ్గొట్టి కేవలం రూ. 16 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విమర్శలు చేయడం సరికాదని, ఏడాదిపాటు కేసీఆర్ మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేగానీ ఫౌమ్‌హౌస్ నుంచి బయటకు రాలేకకాదని హరీశ్‌రావు తెలిపారు.
ప్రజల తరఫున అటు అసెంబ్లీలో, ఇటు ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నిరంతరం కొట్లాడుతున్నదని చెప్పారు. ఏడాదిలో రేవంత్ సర్కారు అసమర్థ విధానాలను అడుగడుగునా ఎండగట్టడంలో బీఆర్ఎస్ సఫలమైందన్నారు. హైడ్రా, లగచర్ల బాధితులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. అలాగే పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన మాజీ సర్పంచులకు సైతం బాసటగా నిలిచామని చెప్పారు. ప్రభుత్వం 10 శాతం కమిషన్లు తీసుకొని బడా కాంట్రాక్టర్లకు అప్పనంగా ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతున్నదని ఆరోపించారు. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్‌లు రోడ్డెక్కినా ఐదారు వందల కోట్లు ఇవ్వకుండా వేధిస్తున్నదని దుయ్యబట్టారు.
కులగణన పేరిట రేవంత్‌రెడ్డి బీసీలకు అన్యాయం చేశారని, దీంతో బీసీ సంఘాల నాయకులంతా భగ్గుమంటున్నారన్నారు. స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీనే ఆ నివేదికను తగులబెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో రేవంత్‌రెడ్డి పాత్రేమీలేదని, మందకృష్ణ, వంగపల్లి శ్రీనివాస్ మాదిగల కృషి, సుప్రీంకోర్టు తీర్పుతోనే వర్గీకరణ కల సాకారమైందన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు మాని పాలనపై దృష్టిపెట్టాలని హరీశ్‌రావు హితవు పలికారు.