కోహీర్, డిసెంబర్ 24: సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని అధికార పార్టీ నేత కక్షపెట్టుకుని దళితుడి ఇంటి నిర్మాణం కూల్చివేయగా, బాధిత కుటుంబానికి మాజీ మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్‌లో బేగరి రాములు పల్లెప్రకృతి వనానికి అడ్డంగా ఇంటిని నిర్మిస్తున్నారని గ్రామ కార్యదర్శి వికాస్ ఈ నెల 16న నోటీసులు అందజేశారు. సర్పంచ్‌గా కాంగ్రెస్ నుంచి గెలిచిన పద్మావతి, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే పంచాయతీ సభ ఏర్పాటు చేసి తీర్మానం చేసి రాములు ఇంటిని జేసీబీ సహాయంతో కూల్చివేయించారు.
దీంతో రాములు కుటుంబంతో కలిసి ఈ నెల 23న ఎమ్మెల్యే మాణిక్‌రావును కలిశారు. అనంతరం తమకు న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావుతో మొరపెట్టుకున్నారు. దీంతో బాధితుడికి లక్ష రూపాయలను అందజేస్తామని ఆయన హామీనిచ్చారు. హరీశ్‌రావు ఆదేశాల మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు సజ్జాపూర్ వెళ్లి బాధితుడికి రూ.లక్ష అందజేశారు. తమకు అండగా నిలిచిన హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.