Harish Rao | ప్రపంచంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన పండుగ అని కొనియాడారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో వెలిసిన శ్రీవిజయదుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని హరీశ్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో, తెలంగాణ రాష్ట్ర సాధనతో తెలంగాణ పండుగలు విశ్వవిఖ్యాతమయ్యాయని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఈ పండుగని చాలా గొప్పగా జరుపుకుంటున్నారని అన్నారు. తెలంగాణ వాళ్లు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా చాలా గొప్పగా జరుపుకుంటున్నారని అన్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని పూజించే పండుగ. మన అక్క చెల్లెల్లు ఆటపాటలతో పూలను పూజించి చెరువులో కలుపుతారని పేర్కొన్నారు. ఈ పండుగ వెనుక సైన్స్ కూడా ఉందని.. కొత్తగా వచ్చిన వర్షపు నీటిలో కీటకాలు ఉంటాయని అన్నారు. మనం తంగేడు పువ్వు, గునుగు పువ్వులను నీటిలో వేయడం వల్ల నీళ్లు పరిశుభ్రమవుతాయని వివరించారు. పూర్వం మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో ఈ పండుగ చూస్తే అర్థమవుతుందని చెప్పారు.
బతుకమ్మ అప్పుడు ఆడపడుచులు తల్లిగారి ఇంటికి రావడం, అక్కడ పాటలు పాడడం లాంటి గొప్ప అనుభూతి ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు ఈ బతుకమ్మకు చాలా గొప్ప గుర్తింపు వచ్చిందని తెలిపారు. కేసీఆర్ బతుకమ్మని రాష్ట్ర పండుగగా జరిపారని గుర్తుచేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ప్రార్థించారు. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగును ప్రసాదించాలని, అందరికి సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు కలిగించాలని భగవంతుడిని కోరారు. ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.