హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ) : కల్తీ ఆహారం తమకొద్దని, నాసిరకం భోజనం పెడుతున్నారని రాష్ట్రంలో రోజూ ఏదో ఒకచోట విద్యార్థులు రోడ్డెక్కుతుంటే, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం గాలిమోటర్లలో చక్కర్లు కొడుతున్నారంటూ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టళ్ల సమస్యలపై సమీక్షించి పరిస్థితులను చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గురుకులాలు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలపై గురువారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. కల్తీ ఆహారంతో అనారోగ్యం బారిన పడుతున్నామని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, హాస్టల్లో భోజనం బాగుండడం లేదని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నా సీఎం రేవంత్‌రెడ్డిలో ఉలుకూపలుకు లేకపోవడం విడ్డూరమని మండిపడ్డారు.
రెండేండ్లలో ఓయూకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడం తప్ప చేసిన అభివృద్ధి ఏమున్నది? అని ప్రశ్నించారు. గురుకులాలు, విశ్వవిద్యాలయ హాస్టళ్లలో నెలకొన్న అధ్వాన పరిస్థితులపై సమీక్షించే తీరికలేకపోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడపదాటడం లేదంటూ చురకలంటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమేనని చెబుతూ 62 సార్లు ఢిల్లీ వెళ్లి సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఆయన చేతగాని తనం మొన్నటి కేంద్ర బడ్జెట్‌తోనే తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు.
తన చేతగానితనంతో గురుకులాల ఖ్యాతిని మసకబార్చిన సీఎం రేవంత్‌రెడ్డి, మరోవైపు అంచనాలు పెంచి కమీషన్లు దండుకొనేందుకు యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట డ్రామాకు తెరతీశాడని హరీశ్‌రావు ఆరోపించారు. ఉన్న గురుకులాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టలేని రేవంత్‌రెడ్డి.. అంతర్జాతీయస్థాయి వసతులు కల్పిస్తానని చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.