సంగారెడ్డి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని, కోట్ల విలువైన భూముల్లో ఇండ్ల పట్టాలను గరీబుల కోసం 58 జీవో ద్వారా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన కార్యక్రమంలో 58 జీవో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధికంగా 738 మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన నియోజకవర్గం పటాన్చెరు అని వెల్లడించారు. అమీన్పూర్ మండలంలో 265, గుమ్మడిదలలో 7, జిన్నారంలో 12, పటాన్చెరులో 188, రామచంద్రాపురంలో 266 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీచేసినట్టు వివరించారు. కాంగ్రెస్ హయాంలో భయం భయంగా చిన్నపాటి ఇండ్లు కట్టుకొని జీవించినవారికి ఇప్పుడు ఇండ్ల పట్టాలు ఉచితంగా ఇచ్చి యజమానులను చేస్తున్నామని అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా పారదర్శకంగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల విలువ చేసే ప్లాట్‌ను రెగ్యులరైజ్ చేశామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో పేదలు ఇండ్లు కట్టుకుంటే జేసీబీలతో కూల్చేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 13 బస్తీ దవాఖానలను ఈ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఏ ప్రధానీ ఆర్థిక సంఘం నిధులు ఆపలేదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి రావాల్సిన రూ.40 వేల కోట్ల నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నదని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎఫ్ఆర్ఎంబీలో కోత పెట్టడం ద్వారా రాష్ర్టానికి రావాల్సిన రూ.15 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయని చెప్పారు. దేశ చరిత్రలో ఏనాడూ ఏ ప్రధానీ రాష్ర్టాలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను నిలిపివేయలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి 15వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన రూ.5,300 కోట్లు నిలిపివేసిందని దుయ్యబట్టారు. కేంద్రం ఇవ్వకపోయినా సీఎం కేసీఆర్ మాత్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు నిలిపివేయడం లేదని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ శరత్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావును కలిసిన బీసీ సంఘాలు
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రానున్న బడ్జెట్లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో పలువురు బీసీ సంఘం నేతలు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. బడ్జెట్లో బీసీలకు కనీసం 10% నిధులు కేటాయించాలని కోరారు. మంత్రిని కలిసిన బీసీ సంఘాల నాయకుల్లో గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, నీల వెంకటేశ్, సీ రాజేందర్, నరసింహాగౌడ్ తదితరులున్నారు.
మాకు భయం పోయింది
తెలంగాణ ప్రభుత్వం మాకు పట్టా ఇచ్చి ధీమా కల్పించింది. చాలా ఏండ్లుగా బీరంగూడలో ఉంటున్నాం. ఇంటిని కట్టుకున్నా కాగితాలు లేక భయంతో గడిపేవాళ్లం. ప్రభుత్వం ఇచ్చిన పట్టా సర్టిఫికెట్తో మాకు భయం పోయింది.
–మెతుకిపల్లి అనిత, లబ్ధిదారు, బీరంగూడ