సిద్దిపేట, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురైన ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసిందని, ఇది దారుణం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మం త్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయిన రే వంత్‌రెడ్డి తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ తన పదవులకు రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మా ట్లాడారు. ఈ హృదయ విదారక ఘటన ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిందని విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు.
షాబాద్ హత్యలు ముమ్మాటికీ ఇది పోలీ సు, ప్రభుత్వ హత్యలేనని హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. ముఖ్యమంత్రికి అసలు మానవత్వం ఉన్నదా? హోం మంత్రిగా కూడా ఉన్న రేవంత్‌రెడ్డికి కనీసం ఘటనా స్థలానికి వెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. తమకు ప్రాణభయం ఉన్నదని కాపాడాలంటూ బాధితురాలి తల్లి పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటన జరిగిప్పుడు సమీక్షించే బాధ్యత పోలీస్ కమిషనర్‌కో? డీజీపీకో లేదా? ఇప్పుడు ఒక ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంటా రా? అని మండిపడ్డారు. లైంగిక దాడి చేసిన తర్వాత కూడా నెల రోజుల పాటు అరెస్ట్ చేయకుండా, బెయిల్ వచ్చేలా పోలీసులు నిందితుడికి సహకరించాయని ఆరోపించారు.
బాధితులను ఓదార్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, పద్మా దేవేందర్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని హరీశ్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను నేరస్తుల్లా చూస్తూ, అసలు నేరస్తులను మాత్రం స్వేచ్ఛగా ఎందుకు వదిలేస్తున్నదని ప్రశ్నించారు. పోలీస్స్టేషన్లు రక్షణ కేంద్రాలుగా కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని విమర్శించారు.
కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన దివ్యాంగ బాలికకు ప్రభుత్వం వెంటనే రూ.కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతోపాటు ఆమె విద్య, వైద్యం, సంరక్షణ, భవిష్యత్తు బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వమే స్వీకరించాలని డిమాండ్ చేశారు.