ఖమ్మం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బోనస్ మాట బోగస్ అయింది.. మద్దతు ధర కూడా రావట్లేదని విమర్శించారు. ప్రభుత్వ అలసత్వంతో పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దరాజు రవిచంద్రతో కలిసి ఖమ్మం పత్తి మార్కెట్‌ను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో పత్తి ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ రైతులను నట్టేట ముంచిందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామన్నారని, ఇప్పడు బోనస్‌ను బోగస్‌గా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు.
కనీస మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పారు. దీంతో పత్తి ప్రతి క్వింటాకు రైతుకు రూ.1500 నష్టం వస్తున్నదన్నారు. పత్తి రైతులు రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీసీఐ రైతుల దగ్గర పత్తి కొనడం లేదని, దళారుల వద్ద కొంటున్నదని చెప్పారు. రాష్ట్రంలో పత్తి రైతులకు మద్దతు ధర రావట్లేదని చెప్పారు. 2021లో తాము రూ.11 వేలకు పత్తి కొనుగోలు చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రూ.7 వేలకు తక్కువగా ఎప్పుడూ పత్తి కొనుగోలు చేయలేదన్నారు. దళారుల దోపిడీ వల్లే ధర తగ్గిందని చెప్పారు. మద్దతు ధర రూ.7,520 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం మార్కెట్లో ఇప్పటి వరకు మద్దతు ధర రాలేదని చెప్పారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారని, రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు.
సగానికిపైగా ధాన్యం దళారుల పాలైందని చెప్పారు. మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిదన్నారు. ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై ఇప్పటివరకు సమీక్ష చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు నష్టపోతున్నారని, దళారులు లాభపడుతున్నారని వెల్లడించారు. పత్తిని సీసీఐ కేంద్రాలు కొన్నది తక్కువ.. వ్యాపారులు కొన్నది ఎక్కువని చెప్పారు. కాంగ్రెస్ ప్రాధాన్యత మద్యం అమ్మకాలపై ఉందని, రైతులపై కాదన్నారు. కేసీఆర్ హయాంలో రైతులు రాజులయ్యారని చెప్పారు.
Live: Former Minister @BRSHarish addressing the media at Agricultural Market Yard, Khammam. https://t.co/uUoetGYYaQ
— Office of Harish Rao (@HarishRaoOffice) November 22, 2024