Harish Rao | దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనడం దారుణమన్న హరీశ్‌రావు.. హామీ ప్రకారం మిగతా పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. యాసంగిలో 90శాతం రైతులు దొడ్డు వడ్లను పండిస్తారన్నారు.
సన్న వడ్లకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని.. సన్న వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితే రాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.20కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పడుతుందని.. అన్నింటికి బోనస్ ఇవ్వాలంటే రూ.6వేలకోట్ల భారం పడుతుందని.. దాంటోనే సన్న వడ్లను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సన్నం వడ్లతో రూ.400 కోట్ల మాత్రమే ఖర్చవుతుందన్నారు. యాసంగిలో రైతులు సన్నం వడ్లు పండించరని.. పండించని వడ్లకు బోనస్ ఎలా ఇస్తారని నిలదీశారు. బోనస్ ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద ఎకరాకు ప్రభుత్వం రూ.2500 ఇవ్వాల్సి ఉందని.. వానాకాలానికి సంబంధించి ఎకరానికి రూ.15 వేల రైతుబంధు యాసంగి బకాయిలు సైతం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తారా? లేదా? అంటూ ప్రశ్నించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రైతుబంధు డబ్బులను జూన్ నెలలోనే వేయాలని.. రైస్‌మిల్లర్ల నుంచి కొనుగోలు చేసైనా సన్నబియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని మొలకలు రాక ముందే కొనుగోలు చేయాలని.. కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.