Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ రోజులు సమావేశాలు నడిపించామని గుర్తుచేశారు. దాదాపు ఒక సెషన్ 32 రోజులు నడిపించామని తెలిపారు. కాంగ్రెస్ మొత్తంగా 16 రోజులు నడిపించిందని పేర్కొన్నారు.రెండేళ్లలో ఓవరాల్‌గా రేపటికి 40 రోజులు జరిపిందని చెప్పారు. సభ నడపాలంటే కాంగ్రెస్ జంకుతుందని అన్నారు.
శాసన సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్యేల సంతాపాలు, ఘోష్ కమిషన్ విషయాల మీదే సభ నడిపారని తెలిపారు. మేం లేవనెత్తిన ఒక్క అంశం మీద కూడా చర్చ పెట్టట్లేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే ప్రతిపక్షం బాధ్యత అని స్పష్టం చేశారు. అధికార బలంతో ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. మందబలం ప్రదర్శించి సభను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ మాట్లాడిన అంశాలను.. మాపై మళ్లీ బురద జల్లడానికి అసెంబ్లీని నడుపుతున్నారని విమర్శించారు. 45 టీఎంసీలకు మీరు సంతకం పెట్టారా లేదా సూటిగా చెప్పండని ప్రశ్నించారు. 45 టీఎంసీలకు ఒప్పుకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 45 టీఎంసీలతో రంగారెడ్డిని ఎండబెడుతారా అని నిలదీశారు. డీపీఆర్ వాపస్ వచ్చిందా లేదా? ఆ సంతకం మీదా కాదా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీని 45 రోజులు నడపాలని ఆరోజు కాంగ్రెస్ నాయకులు అన్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రశ్నించే హక్కు అని.. గొంతు నొక్కుతున్నారని అని ఆనాడు అన్నారని తెలిపారు. ఇప్పుడు మేం అడుగుతున్నాం.. సభను 15 రోజులు కచ్చితంగా నడపాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలాగా కాకుండా మేం ప్రిపేర్ అయ్యి సభకు వస్తామని తెలిపారు. గతంలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మాట్లాడుతుంటే ఉత్తమ్ మేం ప్రిపేర్ అయ్యి రాలదేని అన్నాడని విమర్శించారు. నేను ఘోష్ కమిషన్ మీద మాట్లాడుతుంటే ఏడుగురు మంత్రులు అడ్డుపడ్డారని తెలిపారు. మంత్రులకు సమాధానం చెప్పాలా? సబ్జెక్ట్ మాట్లాడాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కిందని అన్నారు. సబ్జెక్ట్ మాట్లాడినంత సమయం ఇవ్వాలని .. మైక్ కట్ చేయవద్దని డిమాండ్ చేశారు. హౌస్ కమిటీలు ఇప్పటికీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌బాబు విఫలమయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. గతంలో పీఏసీ కమిటీ ఎలా వేశారో శ్రీధర్‌బాబుకు తెలుసు కదా అని అన్నారు. శాసనసభకు మొత్తం 18 కమిటీలు ఉంటాయని తెలిపారు. కానీ ఒక్క కమిటీ కూడా వేయలేదని చెప్పారు. బ్యాక్ డోర్ నుంచి నామినేషన్ వేయించి ఆమోదించారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎరువుల కొరతపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిగా చేయనందుకు చర్చ జరగాలని అన్నారు. రైతుబంధు రెండు పంటలకు ఎగ్గొట్టినందుకు చర్చ జరగాలన్నారు. హిల్ట్ పాలసీపై 5 లక్షల కోట్ల కుంభకోణం మీద చర్చ జరగాలన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌పై చర్చ జరగాలని పట్టుబట్టారు. ట్రిపుల్ఆర్, జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, హైడ్రా బుల్డోజర్పై చర్చ జరగాలన్నారు.
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు 299 టీఎంసీల కోటాకు ఒప్పుకున్నది గత కాంగ్రెస్ ప్రభుత్వమే అని హరీశ్‌రావు తెలిపారు. ఆధారాలతో సహా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తిచూపుతామని అన్నారు. కాంగ్రెస్‌ది ప్రజాపాలన ప్రభుత్వం కాదు.. ప్రశ్నించే గొంతులను నొక్కే పాలన అని మండిపడ్డారు. 299 టీఎంసీలను వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం 32 లేఖలు రాసిందని గుర్తుచేశారు. కృష్ణా జలాలను తిరిగి రాష్ట్రాలకు పంచితేనే న్యాయం జరుగుతుందని అన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చిల్లర, చిచోరా భాష మాట్లాడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. హుందా అనే పదం పలికే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు.