Harish Rao | దొంగనే దొంగ అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు విమర్శించారు. రుణమాఫీకి ఎగనామం పెట్టి.. మాఫీ చేశానని ఫోజులు కొడుతున్నానని మండిపడ్డారు. పాక్షికంగా రుణమాఫీ చేసి.. పూర్తిగా మాఫీ చేశామని అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. పంద్రాగస్టులోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు పెట్టారని గుర్తుచేశారు. కానీ గడువులోగా పాక్షికంగానే రుణమాఫీ చేశారని అన్నారు. పాక్షికంగానే రుణమాఫీ చేశా.. తప్పయ్యిందని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని సూచించారు. అంతేతప్ప మొత్తం రుణమాఫీ చేశానని బూతులు మాట్లాడితే ప్రజలు క్షమించరని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు.
పంచ పాండవులు అంటే మంచం కోళ్ల వలె ముచ్చటగా ముగ్గురు అని చెప్పి రెండు వేళ్లు చూపించినట్టుగా కాంగ్రెస్ రుణమాఫీ కథ ఉందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తానని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఊదరగొట్టారని అన్నారు. అప్పుడు 40వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఈలోపు పార్లమెంటు ఎన్నికలు రావడంతో వట్టిగ చెబితే ప్రజలు నమ్మేటట్టు లేరని కనిపించిన దేవుని మీద ఒట్టుపెట్టుకుంటూ వెళ్లారని మండిపడ్డారు. ఏ ఊరుకు వెళ్తే ఆ ఊరులో దేవుడి మీద ఒట్టు పెట్టి.. 31వేల కోట్లను మాఫీ చేస్తామని తెలిపారని అన్నారు. ఆ తర్వాత పంద్రాగస్టులోగా రాష్ట్రంలోని రైతులందర్నీ రుణ విముక్తుల్ని చేస్తానని ఉపన్యాసం చెప్పారని అన్నారు. అప్పుడు బడ్జెట్లో రుణమాఫీకి రూ.26వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారని గుర్తుచేశారు. దీనిపై అసెంబ్లీలోనే నిలదీశానని తెలిపారు.
రెండు లక్షల రుణమాఫీకి రూ.40వేల కోట్లు అవుతాయని మేనిఫెస్టోలో పెట్టారని.. కేబినెట్ మీటింగ్ పెట్టి 31వేల కోట్లు అని చెప్పారని.. బడ్జెట్లో ఏమో రూ.26వేల కోట్లే కేటాయించారని అడిగిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. రూ.26వేల కోట్లు ఏవిధంగా సరిపోతాయి? ఎవరికి ఎగనామం పెడతారని ఆరోజే నిలదీశానని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పట్టుబట్టిందని చెప్పారు. కానీ శాసనసభను వాయిదా వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ నుంచి పారిపోయిందని తెలిపారు. పంద్రాగస్టు నాడు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రుణమాఫీ అయిపోయిందని ప్రకటించారని పేర్కొన్నారు. నిజంగానే రుణమాఫీ అయ్యిందా అని లెక్కలు చూస్తే.. 17వేల కోట్లను 22లక్షల మంది రైతులకు మాత్రమే మాఫీ చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 40వేల కోట్లు అని చెప్పి.. ఇప్పుడు 17వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని అన్నారు. అంటే 23వేల కోట్లు కోత పెట్టారని మండిపడ్డారు. అంటే ఇచ్చింది తక్కువ.. కోత పెట్టింది ఎక్కువ అని విమర్శించారు. రాష్ట్రంలో 31వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని.. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. 31వేల కోట్లు అని చెప్పి.. ఇప్పుడు 14వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు.
రూ.14వేల కోట్లు కోత పెట్టి రుణమాఫీ అయ్యిందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. నీది నోరా? మోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.31వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి.. 17వేల కోట్లు మాఫీ చేస్తే.. రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా? కానట్టా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 47లక్షల మంది రైతులు అని చెప్పి.. 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. కేవలం 46 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. సుమారు 25లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. ఇది మోసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.