హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): బడ్జెట్ కేటాయింపుల్లో అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. 2024-25 బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య వ్యత్యాసం రూ.59,231 కోట్ల (20.3 శాతం) ద్రవ్యలోటు (డెఫిసిట్) ఉంటే దీన్ని రియలిస్టిక్ బడ్జెట్ అంటారా? అని ప్రశ్నించారు. 2026-27 బడ్జెట్ అంచనాలు, గత ఖర్చుల కంటే 74 వేల కోట్లు ఎకువ అని, 10.7 శాతం గ్రోత్ వస్తది అనుకున్నా, రూ.2.75 లక్షల నుంచి రూ.2.80 లక్షల కోట్ల మధ్య యాక్చువల్స్ రావడమే కష్టమని పేర్కొన్నారు. అంటే ఈసారి కూడా బడ్జెట్లో సుమారు రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల లోటు ఉండబోతున్నదని చెప్పారు. ‘వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు కల్పించడం తప్ప వాస్తవంగా మీరు చేస్తున్నదేమిటి? భట్టిగారూ’ అని నిలదీశారు. పథకాల కోతలు తప్ప కాంగ్రెస్ సర్కార్ ఏమీ చేయడం లేదని మండిపడ్డారు.
జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో గ్రోత్ సాధించినట్టు అంకెలతో మభ్యపెట్టారని, కానీ వాస్తవంగా గ్రోత్‌రేట్ పడిపోయిందని హరీశ్‌రావు విమర్శించారు. తలసరి ఆదాయంలో తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ సగటు వృద్ధిరేటు 14 శాతం ఉంటే, 2024-25లో వృద్ధిరేటు 10.6 శాతం, 2025-26 వృద్ధి రేటు 10.2 శాతానికే పడిపోయిందని మండిపడ్డారు. జీఎస్డీపీ గ్రోత్‌రేట్ తొమ్మిదేండ్ల సగటు వృద్ధిరేటు 12 శాతం ఉంటే కాంగ్రెస్‌లో 10.6 శాతానికి పరిమితమైందని, ఈ లెక్కలను బట్టి గ్రోత్‌రేట్ పెరిగిందా? పడిపోయిందా? అని నిలదీశారు. ఓవైపు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పడిపోతుంటే.. రేవంత్ రెడ్డేమో తెలంగాణ రైజింగ్ అంటున్నారని భగ్గుమన్నారు.
2014-15 రెవెన్యూ రసీదులు రూ.51,041 కోట్లు ఉంటే 2023-24 నాటికి రూ.1,69,293 కోట్లకు (సగటు గ్రోత్ రేట్ 23శాతం) పెంచామని, 2024-25 నాటికి 1,67,804 కోట్లకు (రూ.1,489 కోట్లు -1 శాతం) తగ్గిందని విమర్శించారు. పాజిటివ్ గ్రోత్‌ను నెగిటివ్ గ్రోత్‌గా మార్చారని, దీనిని పురోగమనం అంటారా? తిరోగమనం అంటారా? అని ప్రశ్నించారు. హైడ్రా, ఆర్ఆర్ టాక్స్, టీడీఆర్, గచ్చిబౌలి టు శంషాబాద్ మెట్రో రైలు రద్దు, పెద్దఎత్తున భూములను నిషేధిత జాబితాలో చేర్చడం.. ఇట్లా తలాతోక లేని నిర్ణయాలు, విధ్వంసకరమైన ఆలోచనలతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిందని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా కష్టకాలంలో తప్ప బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఆర్టీఏ ఆదాయం తగ్గలేదని, 2023-24లో రూ.7,095 కోట్లుగా ఉన్న ఆదాయం 2024-25కు రూ.6,992 కోట్లకు తగ్గిందని చెప్పారు. మనీ సర్యులేషన్, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, ఆర్థిక చక్రం మందగించిందని తూర్పారబట్టారు.
2024-25లో ఎక్సైజ్ ఇన్‌కం రూ.34,603 కో ట్లు వచ్చిందని భట్టి చెప్పిండ్రు. ఈ సంవత్సరం రూ.46,941 కోట్లు వస్తదని పెట్టిండ్రు. అందే రూ.12,338 కోట్లు అధిక ఆదాయం సంపాదిస్తామని చెప్తున్నరు. ఇంత అధిక ఆదాయం రావాలంటే ఎంత మద్యం అమ్మాలె? రెగ్యులర్‌గా అమ్మే ఎక్సైజ్ మందుకంటే రూ.25 వేల కోట్ల మందు ఎక్కువ అమ్మాలె. అంటే గల్లీగల్లీకి బెల్ట్‌షాపు, గ్రామగ్రామానికి బారు షాపు పెడుతరా? ఈ రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణ చేస్తరా?
-హరీశ్‌రావు
బడ్జెట్లో అనేక శాఖలకు ప్రతిపాదనలను అడ్డగోలుగా నిర్ణయించారని హరీశ్‌రావు విమర్శించారు. 2023-24లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.9,933 కోట్లు వస్తే.. 2024-25లో రూ.7,913 కోట్లకు తగ్గిందని, 2025-26లో బడ్జెట్ అంచరూ. 22,782 కోట్లు, ఆర్ఈ 11,161కోట్లు అయ్యిందని, మళ్లీ 2026-27లో 24,166 కోట్లు పెట్టారని మండిపడ్డారు. 30 శాతం పెరుగుతుంది అనుకున్నా.. 14, 15వే ల కోట్లకు మించి వచ్చే అవకాశమే లేనప్పుడు.. ఈ బడ్జెట్లో 24,166 కోట్లు ఎట్ల పెడుతారని, దీనిని రియలిస్టిక్ బడ్జెట్ అనడం విడ్డూరం కాదా? అని ప్రశ్నించారు.
ఈ ఏడాది బడ్జెట్లో (ఎక్సైజ్, వ్యాట్ రాబడి) రూ.46,941 కోట్లుగా ప్రతిపాదించారని, 2024-25 యాక్చువల్స్ రూ.34,603 కోట్లు ఉంటే రూ.12,338 కోట్లు ఎకాఎకిన పెరుగుతుందా? 35.65 శాతం గ్రోత్ సాధ్యమైవుతుందా? అని నిలదీశారు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చుతారా? ఊరూరా, గల్లీ గల్లీలో వైన్స్షాప్స్ పెడుతారా? బార్లు, బ్రూవరీలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులిస్తారా? అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో అన్నీ కలుపుకొంటే రూ.4.17 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని, అదే కాంగ్రెస్ సర్కార్ 27 నెలల్లోనే రూ.3,47,294 కోట్ల అప్పు చేసిందని విమర్శించారు.
‘బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు.. ప్రజల జీవన స్థితిగతుల మార్పునకు దోహదపడే లెక్క’ అని భట్టి చెప్పారని, కానీ, ప్రజల జీవనస్థితి గతుల మార్పునకు దోహదం చేసే లెకలు ఈ బడ్జెట్లో ఎకడ ఉన్నాయో చెప్పాలని హరీశ్ ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడిన అన్ని రంగాలకు, శాఖలకు బడ్జెట్లో కేటాయింపులకు కోతలు పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 2014-15లో రూ.5,270 కోట్లుగా ఉన్న అగ్రికల్చర్ వ్యయాన్ని 2023-24 వరకు రూ.28,594 కోట్లకు (442.58 శాతం) పెంచామని గుర్తుచేశారు. కానీ, ఈ బడ్జెట్లో కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయానికి రూ.23,179 కోట్లు కేటాయించిందని, ఇది నిరుడు కంటే రూ.1,260 కోట్లు తకువ అని, 2023-24లో తాము పెట్టిన దాని కంటే రూ.5 వేల కోట్లు తకువ అని విమర్శించారు.
రైతుబంధు ఐదు సీజన్లకు గాను ఒక సీజన్ పూర్తిగా ఎగ్గొట్టారని, రెండు సీజన్లు అరకొరగా ఇచ్చారని, అన్నదాలతకు రూ.19 వేల కోట్లు బాకీ పడిందని చెప్పారు. రుణమాఫీ రూపంలో రూ.31 వేల కోట్లు, పంటల బీమా రూపంలో రూ.1,300 కోట్లు బాకీ పడిందని, దేశానికి అన్నం పెట్టే రైతు సంక్షేమానికి మీరు ఇస్తున్న ప్రాధాన్యం ఇదేనా? అని నిలదీశారు. ‘పిల్లల భవిష్యత్తు కోసం చేపట్టే పనులు ఎప్పుడూ ఖర్చు కాదు.. అవి పెట్టుబడులు’ అని భట్టి చెప్పారని, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు పోయాయని, దాదాపు 8,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు. వైఎస్ ప్రారంభించిన పథకం అంటూ గొప్పలు చెప్పుకొనే మీకు ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేసే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.