Harish Rao | హైదరాబాద్, జవవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదని.. స్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తమ పరిధిని విచిడిచిపెట్టి.. చట్టాన్ని అతిక్రమిస్తూ పనిచేసే అధికారులు, పోలీసులకు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ అండ చూసుకొని వేధిస్తున్న అధికారులు రిటైర్మైంట్ అయినా వదిలిపెట్టబోమని, ఏ కలుగులో దాకున్నా బయటకు తీసుకొస్తామని, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. శుక్రవారం కేటీఆర్ సిట్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి కేటీఆర్‌తో వెళ్లిన హరీశ్‌రావు.. మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న వారు.. రేపు రిటైర్డ్ అయినా వదిలిపెట్టం. రేపు అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బుతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించండి’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
దయచేసి తప్పుడు ఆదేశాలు పాటించొద్దు
దావోస్ నుంచి రేవంత్ ఇచ్చే డైరెక్షన్లో కాకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని అధికారులకు హరీశ్ చెప్పారు. ‘తప్పుడు సూచనలు, తప్పుడు ఆదేశాలు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది’ అని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ టం దుర్మార్గమని మండిపడ్డారు. కుట్రల తో బీఆర్ఎస్ నేతలను బెదిరించాలని చూ స్తున్నారని, ఇదంతా రేవంత్ పన్నాగమని విమర్శించారు. ‘మేం తప్పు చేయలేదు.. ఎవరికీ భయపడేది లేదు’ అని స్పష్టంచేశారు. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం జరిగినప్పుడు ఎందు కు కేసులు పెట్టలేదని పోలీసులను ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీ స్తే, కేటీఆర్ మీద సోషల్ మీడియా, టీవీ లు, పత్రికల్లో వార్తలు రాయిస్తే ఏం చేశారని నిలదీశారు. రేవంత్ మీద కూడా విచారణ జరిపించాలని, అన్ని విషయాలూ బయటకు రావాలని డిమాండ్ చేశారు.
లీకులు ప్రసారం చేయడం దారుణం
సిట్ విచారణ సందర్భంగా వరుసగా మీడియాకు లీకులిస్తున్నారని, మీడియా సంస్థలు కూడా నిజంగానే జరుగుతున్నట్టుగా ఆ లీకులను ప్రసారం చేస్తున్నాయని, ఇది దారుణమని హరీశ్ ఆక్షేపించారు. ‘వాస్తవ పరిస్థితులు వేరు.. ఇస్తున్న లీకులు వేరు.. ఈ లీకులకు ఎవరు బాధ్యత వహించాలి? లీకులు చేసిన వాళ్ల పరిస్థితి ఏమిటి అనేది వాళ్లు ఆలోచించుకోవాలి కదా?’ అని సూచించారు. ‘మీడియాను కూడా నేను దయచేసి ప్రార్థిస్తున్నా.. లీకులను మీరు యథాతథంగా ప్రసారం చేస్తున్నారు. వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలి. 90% లీకులు సత్యదూరం. మాకు మీడియాతో బాగుండటం అలవాటు. డిఫమేషన్ వేస్తే బాగోదు. వేస్తే ఎవరి మీద వేయాలి? పత్రి క మీద, టీవీ చానల్ మీద వేయాలి. అది మేం చేయలేం’ అని పేర్కొన్నారు. మొన్న తాను సిట్ విచారణకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి దుష్ప్రచారం చేశారని గుర్తుచేశా రు.
‘వాస్తవాలు వేరు.. బయటకు లీకులిస్తూ ప్రచారం చేయించిన స్రిప్ట్ వేరు.. ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హన నం అవుతుంది’ అని విమర్శించారు. ఈరోజు కేటీఆర్ విషయంలో కూడా దు ష్ప్రచారాన్ని, తప్పుడు లీకులను ప్రసారం చేశారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లీకు వార్తల విషయంలో చిల్లర రాజకీయాలు, డ్రామాలు చేస్తున్నదని, తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇది రేవంత్ పిరికితనానికి నిదర్శనమని, చేతకాని వాళ్లు చేసే పని అని ఎద్దేవాచేశారు. ధైర్యం ఉంటే వీడియో బయటపెట్టు అని సవాల్ విసిరా రు. ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయ చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్‌లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నరు. అధికారులు అన్యాయం, అక్రమంగా వ్యవహరిస్తే.. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తే ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకున్నా, తప్పుడు లీకులిచ్చినా పోలీసులను వదిలిపెట్టేది లేదు. అంతకు అంతా అనుభవిస్తరు. జాగ్రత్త! -హరీశ్‌రావు