సిద్దిపేట, జూలై 12: ‘రాష్ట్రంలో వానలు పడుతలేవు.. లోటు వర్షపాతం ఏర్పడింది.. రైతుల చేన్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. రేవంత్‌రెడ్డేమో మోటర్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నడు.. కేసీఆర్‌కు పేరు వస్తదని రైతులకు నీళ్లిస్తలేడు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 167 మందికి రూ.38 లక్షల 54 వేల సీఎం సహాయ నిధి చెకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో వర్షాలు పడుతుంటే గోదావరిలో ఎనిమిది లక్షల క్యూసెకుల వరద పోతున్నదని, అంటే రోజుకు 80 టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయని చెప్పారు.
గట్టిగా మోటర్లు ఆన్‌చేస్తే వారం రోజుల్లో రంగనాయకసాగర్ నిండిపోతుందని.. అట్లా అన్ని రిజర్వాయర్లను నింపొచ్చని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఊరికే బదనాం చేస్తున్నారని.. మేడిగడ్డ బ్రిడ్జి పైన లారీలు, ఇతర వాహనాలు నడుస్తున్నాయని వివరించారు. ఒకవేళ మేడిగడ్డ మొత్తానికే కూలితే లారీలు ఎందుకు నడుస్తున్నాయని ప్రశ్నించారు. రంగనాయక సాగర్ కాళేశ్వరం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరం కాదా? కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? ఇవేమీ చూడకుండా కాళేశ్వరం కూలిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
‘దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలని అడిగిన.. చర్చిద్దాం అన్నావ్ కదా మైక్ కట్ చేయకుండా ఎంతసేపైనా మాట్లాడుకుందాం.. సత్తా ఉంటే, దమ్ముంటే అసెంబ్లీ పెట్టు.. నువ్వేం చేశావో.. మేమేం చేశామో మాట్లాడుదాం’ అని హరీశ్ సవాల్ చేశారు. అబద్ధాలు మాట్లాడటం తప్ప ముఖ్యమంత్రికి ఏమీ తెలియదని మండిపడ్డారు. ‘కృష్ణా నదిలోకి నీళ్లొచ్చి 36 రోజులైనా కల్వకుర్తి మోటర్లు స్టార్ట్ చెయ్యలేదు. నువ్వు మోటర్లు ఆన్ చేస్తవా? లేక మమ్మల్నే చెయ్యిమంటవా? అని ప్రశ్నిస్తే కల్వకుర్తి మోటర్లు ఆన్ చేసిండ్రు. కేసీఆర్ మీద.. నా మీద కోపముంటే మా మీద కేసులు వెయ్యి.. రైతులేం చేసిండ్రు? కాళేశ్వరం ఏం చేసింది? కాళేశ్వరం ఓపెన్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తదని ఓర్వ లేక నీళ్లు ఆపుతున్నడు’ అని ఫైర్ అయ్యారు.
‘కండ్ల ముందు నీళ్లు పోతున్నా రైతులకు నీళ్లిస్తలేడు. అన్నీ తయారున్నయి. కట్క ఒత్తితే నీళ్లు వస్తయి.. నువ్వు ఇస్తవా? మేము రైతులతో కలిసి కట్క వేయాల్నా?’ అని నిలదీశారు. ‘కేసీఆర్ నాట్లప్పుడు రైతుబంధు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తున్నడు. తాము కొత్తగా కొనుకున్న భూమికి రైతుబంధు పడుతలేదని రైతులు అంటున్నరు. కోతలు పెట్టుడే తప్ప రేవంత్‌కు ఇచ్చుడు తెల్వది. ఊర్లకు పోతే ట్రాక్టర్లు వస్తలేవు.. చెత్త బండ్లు వస్తలేవని ప్రజలు చెప్తున్నరు. కేసీఆర్ ట్రాక్టర్లు కొనిస్తే వాటిలో డీజిల్ పోసేందుకు రేవంత్ పైసలిస్తలేడు. కేసీఆర్ కిట్ బంద్ అయింది.. మళ్ల నేను రాను బిడ్డో సరారు దవాఖానకు అన్నట్టు తయారైంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తరు’ అని హెచ్చరించారు.