Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి, తెలంగాణ ప్రజలను రక్షించాలని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ప్రార్థిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గురువారం యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు చేస్తామని చెప్పారు.
‘స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు.. తెలంగాణ ప్రజలపై దయ ఉంచు..’ అని యాదగిరిగుట్ట నరసింహస్వామిని వేడుకుంటామమని పేరొన్నారు. ‘ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారు. రూ.49 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని డిసెంబర్లో చెప్పారు. కడుపు కట్టుకుంటే చాలు ఒక ఏడాదిలో రూ.40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో అన్నారు.
క్యాబినెట్లో నిర్ణయించిన రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టారు. మొన్నటి బడ్జెట్ కేటాయింపుల్లో రూ.26 వేల కోట్లకు కుదించారు. ఆగస్టు 15న రుణమాఫీ పూర్తయిందని చెప్పి రూ.17 వేల కోట్లన్నారు’ అని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఒకవైపు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెప్తుంటే, మరోవైపు మంత్రులు కాలేదని అంటున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ పూర్తిగా జరగలేదని, మిగిలిన రూ.12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించగా, 17 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నారని గుర్తుచేశారు.
ఇందులో ఎవరి మాట నిజమో తెలియక, రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులు, కలెక్టరేట్ల చూట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీసేందుకు గురువారం ఆలేరులో నిర్వహించే ధర్నాలో పాల్గొంటానని హరీశ్‌రావు తెలిపారు. రైతలందరి పక్షాన ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతామని చెప్పారు.