హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ కక్షతోనే ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం హడావుడిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 665 పేజీలున్న నివేదికపై మాట్లాడేందుకు తగిన సమయమే ఇవ్వలేదని మండిపడ్డారు. మాట్లాడితే తప్పులు బయటపడతాయనే తనను 30 సార్లు అడ్డుకున్నారని, మైక్ కట్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేసిన అనంతరం గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు.. ట్రాష్ రిపోర్టు. చెత్తబుట్టలో వేశాం. కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా నివేదికను ఇచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎన్డీఏ రిపోర్టు.., పీసీ ఘోష్ రిపోర్టు పీసీసీ రిపోర్టు. నివేదికలో అన్నీ పచ్చి అబద్ధాలే. నివేదికపై మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని దాదాపు గంటన్నర సేపు ప్రాధేయపడ్దాం. నివేదిక కోర్టులో ఎక్కడ కొట్టుకుపోతుందోనని భయపడి ఆదివారం సభ పెట్టారు’ అని నిప్పులు చెరిగారు. పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక్క ఎకరాకూ నీరివ్వలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ పోటీ కూడా చేయబోనని, నిరూపించకపోతే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు.
కాళేశ్వరం లేకున్నా పంటల ఉత్పత్తి భారీగా పెరిగిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ‘రెండేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టారా? చెరువు తవ్వారా? చెక్ డ్యామ్‌లు కట్టారా? మరి ఆయకట్టు ఎలా పెరిగింది? నీళ్లు రాలేదని అంటున్నారు. జర్నలిస్టులు, మేధావులు అందరం కలిసి పోదాం. భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ భూములను అడుగుదాం. వరద కాలువను అడుగుదాం. మురిసిన మెతుకు సీమను అడుగుదాం. కాళేశ్వరం ఫలితం అందిందా? లేదా? అని. ఆఖరికి కోదాడకు కూడా నీళ్లు వచ్చినయ్. హైదరాబాద్‌కు మంచినీళ్లు వస్తున్నయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే. తెలంగాణ సాధకుడు, జలసాధకుడు కేసీఆర్. ఆయనకు ఏ శిక్ష వేయాలనేది ముందే కూడబలుక్కుని వచ్చారు. దేనికోసం శిక్ష వేస్తారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించినందుకా? కరెంటు కోతలతో కునారిల్లిన తెలంగాణలో వెలుగునింపినందుకా? ఎందుకు కేసులు పెడతారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసులు పెట్టాల్సి వస్తే కాంగ్రెస్ మీద పెట్టాలని ధ్వజమెత్తారు. ఎస్ఎల్బీసీ, సుంకిశాల కుప్పకూలినందుకు, వట్టెం పంప్‌హౌజ్ మునిగినందుకు? పెద్దవాగు కొట్టుకుపోయిందునకు కేసులు పెట్టాలని అన్నారు.
కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని కాంపోనెంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. మూడు బరాజ్‌ల్లో 228 పిల్లర్లు ఉన్నాయని, అందులో కుంగింది 3 పిల్లర్లేనని వివరించారు. మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిందే రూ.90 వేల కోట్లని, మరి లక్షకోట్ల అవినీతి ఎక్కడయిందని నిలదీశారు. ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నీ బాగానే ఉన్నాయి కదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై ఏ రకంగానైనా బురద చల్లాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని, కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తే చూడండి కానీ, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయవద్దని కోరారు. మేడిగడ్డనే మేటిగడ్డ అయితదని, మేడిగడ్డను వద్దనుకోవడం అంటే గోదావరి జలాల్లో తెలంగాణ నీటివాటా వద్దనుకోవడమేనని, బనకచర్లను అమోదించడమేనని పేర్కొన్నారు. గోదావరి నీళ్లను వదిలి రైతులను ఆగం చేస్తారా? అని నిప్పులు చెరిగారు.
ఇకనైనా బురద రాజకీయాలు మానుకుని, వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కమిషన్ ఏ కోర్టులోనూ నిలబడదని, కానీ తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం చరిత్రలో నిలిచిపోతుందని, చరిత్రహీనులుగా మిగిలిపోతారని నిప్పులు చెరిగారు. పదేండ్ల పాలనలో తెలంగాణలో చెరువులను బాగుచేసి, చెక్‌డ్యామ్‌లు కట్టి భూగర్భ జలాలను పెంచింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 218 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించామని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, రంగానాయకసాగర్, చనాక కొరాట, పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు, దిండి రిజర్వాయర్లను ఉదహరించారు. కానీ కాంగ్రెస్ ఒక్క చెరువు తవ్వలేదని, రిజర్వాయర్ నిర్మించలేదని, ఆ తప్పిదాలను, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. 665 పేజీల కమిషన్ నివేదిక, విజిలెన్స్ రిపోర్టులు పెట్టారని, 8 మంది సభ్యులు ఉన్న బీజేపీ, ఒక్క సభ్యుడు ఉన్న సీపీఐకి ఇచ్చినంత సమయమే ఇవ్వాలని కోరినా మైక్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తప్పులు బయటపడతాయనే టైం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమన్నారు.