నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్‌గా వర్ధిల్లుతున్న ఐపీఎల్‌కు మూలస్తంభంగా భావిస్తున్న మహేంద్రసింగ్ ధోనీ ఆఖరి ఆటకు వేళయైందా? అంటే ఆసక్తికర సమాధానం వినిపిస్తున్నది. ప్రతీ ఐపీఎల్ సీజన్‌కు ముందు ధోనీ ఈసారి కచ్చితంగా వీడ్కోలు పలుకుతాడంటూ వార్తలు రావడం, అంతే సర్వసాధారణంగా మళ్లీ తర్వాత సీజన్లో ఆడటం జరుగుతున్నది. ఐపీఎల్ మొదలైన 2008 నుంచి ఇప్పటి వరకు లీగ్‌తో కొనసాగుతున్న మహీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పాలి. నాలుగు పదుల వయసులోనూ తనదైన క్రికెట్ పరిజ్ఞానంతో చెన్నైని ఇప్పటి వరకు ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపిన ధోనీ ఈ సీజన్లో వీడ్కోలు పలుకుతాడా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
సరిగ్గా ఆరేండ్ల క్రితం 2020లో మహేంద్రసింగ్ ధోనీ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ప్రముఖ వ్యాఖ్యాత డానీ మారిసన్ మాట్లాడుతూ యెల్లో జెర్సీలో మీకు ఇది ఆఖరి మ్యాచా అన్న మాటకు ధోనీ ‘డెఫినెట్లీ నాట్’ అంటూ తన శైలిలో సమాధానమిచ్చాడు. అప్పటి నుంచి చెన్నై అభిమానులు ప్రతీ సీజన్లో ఈ స్లోగన్‌తో తలాకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. తన రిటైర్మెంట్ వార్తలు వచ్చిన ప్రతీసారి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ 44 ఏండ్ల దిగ్గజ క్రికెటర్ చెన్నైతో కలిసి కొనసాగుతున్నాడు. గత సీజన్లలాగే ఈసారి ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వీటిని పటాపంచలు చేస్తూ సహచర క్రికెటర్లతో కలిసి మహీ నెట్స్‌లో చెమటోడుస్తూనే ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్ రాకతో కొత్త రూపు సంతరించుకున్న చెన్నైకి ధోనీ చాలా కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అనిశ్చితికి ఆలవాలమైన పొట్టి ఫార్మాట్లో అప్పటికప్పుడు వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన ధోనీ సేవలను వినియోగించుకునేందుకు చెన్నై సర్వం సిద్ధంగా ఉంది. రెగ్యులర్ ప్లేయర్‌గా కాకపోయినా ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ధోనీ సేవలు వాడుకునేందుకు చెన్నై ఆలోచిస్తున్నది. అయితే గత సీజన్ ముగిసిన తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేసుకున్న ఈ దిగ్గజ క్రికెటర్ వయసు సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ లాంటి ఉత్కంఠభరిత లీగ్‌లో 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం కావున..భవిష్యత్ ప్రణాళికలో భాగంగా శాంసన్‌ను తీసుకున్నట్లు తెలుస్తున్నది.
శాంసన్‌ను పూర్తిస్థాయి వికెట్‌కీపర్‌గా బరిలోకి దింపితే అప్పుడు ధోనీ..ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా సేవలందించనున్నాడు. తన కెరీర్లో రికార్డు స్థాయిలో 19వ సీజన్ ఆడబోతున్న ధోనీ ఇప్పటి వరకు 278 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో చెన్నై, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు ఆడిన ధోనీ 5,439 పరుగులు చేశాడు. ఇందులో 226 మ్యాచ్‌లకు పైగా కెప్టెన్‌గా వ్యవహరించాడు.
లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డుల్లోకెక్కిన చెన్నైని ఐదుసార్లు విజేతగా నిలుపడంతో పాటు తొలి 14 సీజన్లలో ఏకంగా పది సార్లు ఫైనల్ చేర్చిన ఘనత ధోనీకే దక్కింది. ఇలా తన నాయకత్వ పటిమతో చెన్నైకి అన్నీతానై నిలిచిన ధోనీ ఈ సీజన్‌తో ఆటకు వీడ్కోలు పలుకుతాడా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు ధోనీ రిటైర్మెంట్పై ఉత్కంఠ ఇలాగే కొనసాగుతుండటం ఖాయం.