హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నేతలపై దుర్మార్గమైన నిర్బంధం ఎంతకాలం అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఎకడికడ అరెస్టులు, గృహ నిర్భంధం చేయడాన్ని ఆయన తీవ్రం గా ఖండించారు. బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. పోలీసు బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆగడాలను, అణచివేతను ధైర్యంగా ఎదుర్కొంటామని, ఎన్ని నిర్బంధాలు, అరెస్టులు చేసినా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వైఖరి మారదని హెచ్చరించారు.