Harish Rao | హైదరాబాద్/సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని మండిపడ్డారు. ఈ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, దాడికి ఉసిగొల్పిన ఏసీపీ, సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను స్పీకర్ సుమోటోగా స్వీకరించి, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కౌశిక్‌రెడ్డిపై అరికెపూడి గాంధీ అనుచరులు గురువారం దాడి చేసిన అనంతరం మాదాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంట్లో ఆయనను హరీశ్‌రావుతోపాటు పలువురు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం సైబారాబాద్ అడిషనల్ సీపీ జోయల్‌డేవిస్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడతో బీఆర్ఎస్ నాయకులు అక్కడే బైఠాయించారు. దాడి చేసినవారిని అరెస్టు చేసే దాకా సీపీ ఆఫీస్ నుంచి కదిలేది లేదని హెచ్చరించారు.
అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో పట్టపగలు తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు, కత్తులు, కర్రలతో దాడి చేశారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. పోలీసుల వైఫల్యం వల్లే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని, దీనికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసినవారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, లేదంటే సీబీఐ విచారణ జరపాలని కోరుతామని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ వద్దకు కూడా వెళ్తామని, నిజనిజాలు బయటకు రావాలని స్పష్టంచేశారు. ఈ దాడి వెనుక పాత్రదారులు, సూత్రదారులు, సహకరించినవారు ఎవరో అన్నీ బయటకురావాలని అన్నారు. శాంతిభద్రతలను కాపాడాలనే ఉద్దేశం ఉంటే ఈ ఘటనపై సీపీ, డీజీపీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ దాడిని ఆపలేక, దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన గూండాలకు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో రాచమర్యాదలు చేస్తున్నారదని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకే ప్రతిదాడులు చేయడం లేదని స్పష్టంచేశారు. పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్నామని, దాడులకు భయపడబోమని చెప్పారు.
‘ఇంటిమీదకు వస్తామని ప్రెస్మీట్లో ప్రకటించిన గాంధీ తన అనుచరులతో దాడిచేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైంది. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే కౌశిక్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలి. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలి. కౌశిక్‌రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలి.’
పదేండ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచితే, రేవంత్‌రెడ్డి సర్కార్ నగర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ వ్యాపారం కుదేలు అయిందని, పెట్టుబడులు తరలిపోతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ 9 నెలల పాలనలో 1,800 లైంగికదాడులు, 2,600 హత్యలు, తొమ్మిది మత ఘర్షణ లు జరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇది రేవంత్‌రెడ్డి వైఫల్యమని స్పష్టం చేశారు. తమకు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రతిష్ఠ ముఖ్యమని, సహనా న్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. డీజీపీ, సీపీలు చట్టాన్ని రక్షించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వానికి కొమ్ముకాసే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని హరీశ్‌రావు సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డిని రాహుల్‌గాంధీ మందలిస్తారా? చర్యలు తీసుకుంటారా? అని నిలదీశారు. ఎమ్మెల్యేలపై దాడి చేయడం, ప్రశ్నించిన జర్నలిస్టులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, ఇదేనా ప్రజాస్వామ్యం? అని మండిపడ్డారు. ఈ ఘటనపై రాహుల్‌గాంధీ స్పందించకపోతే ఆయన చెప్తున్నవన్నీ ఉత్తమాటలే అనుకోవాల్సి వస్తుందని, ఆయన మోసాలను దేశం మొత్తం చెప్తామని హెచ్చరించారు.
‘నా ఇంటిపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్తే నన్ను అడ్డుకున్నది పోలీసులే. తిరిగి విధులకు ఆటంకం కలిగించానంటూ నా పైనే కేసు పెట్టడం దారుణం’ అని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చెప్పారు. గురువారం రాత్రి ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన ఇంటిపైకి దాడి చేసేందుకు వచ్చారని చెప్పారు. తన ఇంటి నుంచి గాంధీ ఇంటికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుందని, అక్కడి నుంచి వచ్చే సమయంలో పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. తనను హౌజ్ అరెస్టు చేసి, గాంధీకి బందోబస్తు ఇచ్చి తన ఇంటికి పోలీసులు తీసుకొచ్చారని, ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. తన ఇంటిపై దాడి చేయడం, బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడంతో తెలంగాణలో మరో ఉద్యమం మొదలైనట్టేనని చెప్పా రు. పోలీసులు రేవంత్‌రెడ్డి కోసం పనిచేస్తున్నారని, ప్రజల కోసం పనిచేయాలని హితవు చెప్పారు. రేవం త్ కూడా తన ఇంటికి వందల సార్లు వచ్చి వెళ్లారని, గతాన్ని గుర్తు చేసుకోవాలని, పీసీసీ అధ్యక్షుడు అయ్యేందుకు ఎవరు సహకరించారో గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఏం చేస్తాడో చేసుకోవాలని, తనను చంపినా సరే లొంగేది లేదని అన్నారు. అరికెపూడి తెలంగాణలో ఎలా తిరుగుతారో చూస్తామని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు.
‘రేవంత్.. నిన్ను హెచ్చరిస్తున్నా.. దాడి చేసిన గూండాలను అరెస్ట్ చెయ్.. వారికి సహకరించిన పోలీసులపై యాక్షన్ తీసుకో.. లేకపోతే ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీ ఇంటి ముందు, ఏఐసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారో దేశం మొత్తం తెలిసేలా చేస్తాం’
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలోనే శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహిస్తామని, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి గాంధీ ఇంటికి వెళ్దామని చెప్పారు.
రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. దాడి చేసిన అరికెపూడి గాంధీకి పోలీసులు రాచమర్యాదలు చేశారని, బాధితుడైన కౌశిక్‌రెడ్డిపై రివర్స్ కేసు పెట్టారని మండిపడ్డారు. సినిమా డైరెక్టర్లా రేవంత్‌రెడ్డి చేస్తున్నాడని, పోలీసుల వెనుక ఉన్నది ఆయనే అని ఆరోపించారు. హరీశ్‌రావు నేతృత్వంలోని బృందం కౌశిక్‌రెడ్డి తరఫున సీపీకి ఫిర్యాదు చేసేందుకు వస్తే ఎలాంటి కారణం లేకుండా అరెస్టు చేశారని, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సహా అనేక మంది పెద్దలను నాలుగు గంటలపాటు పోలీసులు అడవుల్లో తిప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ వైఫల్యాలను ఒప్పుకోలేక, కౌశిక్‌రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం లేకనే భౌతికదాడులకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ప్రజాస్వామ్యం? అని నిలదీశారు. మొన్న సిద్దిపేటలో తన క్యాంపు కార్యాలయంపై దాడి జరిగిందని, ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే తమపై దాడి చేశారని చెప్పారు. ఖమ్మంలో దాడి ఘటనపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని దుయ్యబట్టారు. కౌశిక్‌రెడ్డి ప్రజాస్వామ్యం, హైకోర్టు తీర్పు గురించి మాట్లాడారని, గాంధీని రాజీనామా చేయాలని కోరారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు గాంధీ చెప్పింది నిజం కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్ కాగానే తాను ప్రతిపక్షంలో ఉన్నానంటూ గాంధీ సిగ్గు లేకుండా ప్రకటనలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేసి పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.