Harish Rao | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : పోతిరెడ్డిపాడు ద్రోహం.. కాంగ్రెస్ పాపమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 1999లోనే రోజుకు 1.10 లక్షల క్యూసెక్యుల జలాలు తరలించారని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో హరీశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే అధికంగా జలాలు తరలించారన్న కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని చెప్పారు. మళ్లీ ఇప్పుడు తమపైనే నిందలు వేస్తారా? అంటూ ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ 18 లేఖలు రాశామని, బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఆ ప్రాజెక్టుకు రెడ్ సిగ్నల్ పడిందని గుర్తుచేశారు. ఆఖరిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తెచ్చి పనులు ఆపివేయించామని స్పష్టంచేశారు.
విజ్ఞత ఉండొద్దా?
బీఆర్ఎస్ ఒత్తిడితోనే రాయలసీమ లిఫ్ట్‌కు రెడ్ సిగ్నల్ పడిందని, కానీ చంద్రబాబు చెవిలో చెప్పి ప్రాజెక్టును ఆపిందే తామేనని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవాచేశారు. రాయలసీమ ప్రాజెక్టు జీవో 2020, మే 5న వచ్చిందని, దానికి ఆరు నెలల ముందే ఆ ప్రాజెక్టును తెలంగాణ అంగీకరించబోదని, అది చట్టవిరుద్ధమని, తక్షణం ఆపాలని కేంద్రానికి, కేఆర్ఎంబీకి లేఖల ద్వారా కేసీఆర్ ఫిర్యాదు చేశారని అది తమ నిజాయితీ అని స్పష్టంచేశారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ మీద అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లోనూ కేసీఆర్ సర్కార్ గట్టిగా పోరాడిందని, అవసరమైతే ఆలంపూర్ బరాజ్ కట్టి నీళ్లు మళ్లిస్తామని ఏపీ, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారని వెల్లడించారు. లేఖలతో ఆగకుండా గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించించి బలమైన వాదనలను తెలంగాణ తరపున వినిపించామని, తత్ఫలితంగానే ప్రాజెక్ట్ కొనసాగడానికి వీల్లేదని ఎన్జీటీ స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. ‘వాస్తవాలు ఇలా ఉంటే సిగ్గులేకుండా నేనే ఆపిన.. చంద్రబాబు చెవిలో చెప్తే ఆపిండని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పిండు’ అని విమర్శించారు. ‘బీఆర్ఎస్ ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ద్వారా 34,728 క్యూసెక్కుల జలాలు తరలించారని అసెంబ్లీలో చెప్పారు. మరోవైపు బాబు చెవిలో చెప్పి లిఫ్ట్ ఆపించిన అని రేవంత్‌రెడ్డి అంటరు. కానీ ఎన్జీ టీ స్టే తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరి 34 వేల క్యూసెక్కులు రాయలసీమ లిఫ్ట్ ద్వా రా ఎట్లా తరలిస్తరు?’ అని హరీశ్ప్రశ్నించారు.
పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీ జరగనివ్వలే
పోతిరెడ్డిపాడు ద్రోహం.. కాంగ్రెస్ పాపమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 2009లోనే రోజుకు 1.10 లక్షల క్యూసెక్యుల జలాలు తరలించారని స్పష్టంచేశారు. మళ్లీ ఇప్పుడు తమపైనే నిందలు వేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్ట్‌లను వైఎస్సార్ సర్కారు కడుతుంటే.. ఆ అన్యాయాన్ని ధిక్కరించి కేసీఆర్ ఆదేశాలతో తమ మంత్రి పదవులను గడ్డిపోచల్లా వదిలేసి రాజీనామా చేశామని గుర్తుచేశారు. తాము రాజీనామా చేసిన రెండు నెలలకు పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో విడుదల చేశారని, పోతిరెడ్డిపాడు కట్టొద్దన్న ఒకే అంశాన్ని తీసుకొని 40 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను అనాడు స్తంభింపజేశామని గుర్తుచేశారు. ఇదంతా అసెంబ్లీ రికార్డుల్లో ఉన్నదని తెలిపారు. తాము మంత్రి పదవులను వదిలేస్తే జానారెడ్డి, ఉత్తమ్‌కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ మంత్రి పదవులను పొందారని, ఇదీ కాంగ్రెస్ నిజాయితీని ప్రశ్నించారు. కానీ బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 92 వేల క్యూసెక్యుల నీటిని తరలించారంటూ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని, కానీ కాంగ్రెస్ హయాంలోనే ఇదంతా జరిగిందని చెప్పారు.
శ్రీశైలంలో 885 అడుగుల వద్ద 1.82 లక్షల క్యూసెక్యుల నీటిని తరలించేందుకు కాంగ్రెస్ హయాంలో అంటే 2014లోనే హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. 2009లోనే పోతిరెడ్డిపాడు ద్వారా 1.10 లక్షల క్యూసెక్యుల జలాలను తరలించారని, ఇదీ ఏపీ రిజర్వాయర్ స్టోరేజీ మానిటరింగ్ సిస్టంలోని వివరాలేనని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలోనే 92 వేల క్యూసెక్కుల జలాలు తరలించారన్నది అవాస్తమని హరీశ్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2025, జూలై 14న కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌పాటిల్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలోనూ వివరాలు ఉన్నాయని వివరించారు. అయినా వాస్తవాలను దాచి మళ్లీ బీఆర్ఎస్ హయాంలోనే 92 వేల క్యూసెక్కులు తరలించారని వాదిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఆ లేఖ, సంతకం మీది కాదంటారా?’ అంటూ ఉత్తమ్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే, సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కవడం వల్లే చంద్రబాబుతో పోతిరెడ్డిపాడు లైనింగ్ పనులు చేపట్టారని, దీంతోనే నీళ్లు అధికంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ముచ్చుమర్రి, హంద్రీనీవా ఎత్తిపోతల రెండూ కలిపి 6300 క్యూసెక్కులని, ఆ రెండూ 2009లోనే చేపట్టారని, వెలిగొండ 2008లో అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే చేపట్టారని, ఏపీ నీటి వినియోగ సామర్థ్యం పెంపునకు కారణం కాంగ్రెస్సేని స్పష్టంచేశారు.

జీవో విడుదలకే ఐదేళ్లు..!
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల అనుమతులపైనా అసెంబ్లీలో ఉత్తమ్ అబద్ధాలు వల్లించారని హరీశ్ విమర్శించారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతలకు రూపకల్పన చేసింది కాంగ్రెస్సే అనడం విడ్డూరమని విమర్శించారు. 2009 ఎన్నికల ముందు అప్పటి ఎంపీ విఠల్‌రావు సీఎంకు లేఖ రాశారని, ఐదేళ్ల అనంతరం 2014 ఎన్నికల ముందు 2013లో జీవో ఇచ్చారని, అదీ కేవలం డీపీఆర్ తయారీ కోసమేనని, విమర్శించారు. తా ము ఈ ప్రాజెక్ట్ డీపీఆరే కాదు.. 90 టీఎంసీల కు అనుగుణంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 7 రకాల అనుమతులు సాధించామని గుర్తుచేశారు. పాజెక్టు అధికారే 2025లో రాసిన కేంద్రానికి రాసిన లేఖలో విషయం పేర్కొన్నారని వివరించారు. కానీ శనివారం అసెంబ్లీలో నాలుగు అనుమతులే వచ్చాయి.. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి చెప్పారని, ఇదేం విధానమని నిలదీశారు. కేంద్రం కొర్రీలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపిందని నిప్పులు చెరిగారు.
47 గ్రామాలు, 84 వేల మందిని ముంచి కట్టగలమా?
ప్రాజెక్టు సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలకూ హరీశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ రోజుల్లో చిన్న ఊరును ఖాళీ చేయడమే కష్టం.. ఈ తరుణంలో 47 గ్రామాలు, 84 వేల మందిని తరలించి ప్రాజెక్ట్‌ను కట్టగల మా? అని ప్రశ్నించారు. జూరాల నుంచి సో ర్స్ మార్చామని వివరించారు. అదే ప్రాజెక్ట్ ను శ్రీశైలం దగ్గర కట్టడంతో మూడు గ్రా మాలు, 20 తండాలు, 11 వేల మంది మాత్రమే ముంపునకు గురయ్యారని చెప్పా రు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతలను రోజుకు రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి బీఆర్ఎస్ తగ్గించిందనే పూర్తి సత్యదూరమని వెల్లడించారు. సామర్థ్యం తగ్గిస్తే మరి టన్నెల్స్‌ను 2 టీఎంసీలతో ఎందుకు పూర్తిచేస్తామని ప్రశ్నించారు. రెండు టీఎంసీల కోసమే ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టామనేందుకు సొరంగాలనే పక్కా ఆధారాలని వివరించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లు పూర్తయ్యాయని, ఉద్దండాపూర్ కూడా 64 శాతం పూర్తయిందని తెలిపారు.
అత్యంత కీలకమైన ప్యాకేజ్ -3 పనులు 92 శాతం, ఆ మిగిలిన 8శాతం పనులను పూర్తిచేస్తే 50 టీఎంసీలు నింపుకునే అవకాశమముందని, కానీ ఆ బుడ్డ పనినీ కాంగ్రెస్ చేయలేకపోయిందని హరీశ్‌రావు మండిపడ్డా రు. ప్రాజెక్ట్ వ్యయం మూడింతలు పెంచారనే ఆరోపణలను హరీశ్ కొట్టిపారేశారు. కాంగ్రె స్, టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ల వ్యయం పెరగలేదా? అని ప్రశ్నించారు. ‘నాగార్జునసాగర్,శ్రీరాంసాగర్, జూరాల, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులను ఉదహరించారు. ‘మరి పెంచిన మొత్తాన్ని మీరు తిన్నరా? మింగిండ్రా?’ అని కాంగ్రెస్‌ను నిలదీశారు. “భూసేకరణ, డీజిల్, లేబర్ రేట్ల పెంపుతో ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతది. సాగర్, శ్రీరాంసాగర్, జూరాల ఎందుకు పెరిగాయో? చెప్పండి.. ఇకనైనా చిల్లర మాటలకు స్వస్తి చెప్పండి’ అని హితవు పలికారు.
బీఆర్ఎస్ ఒత్తిడితోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రెడ్ సిగ్నల్ పడింది. రాయలసీమ లిఫ్ట్‌ను వ్యతిరేకిస్తూ కేసీఆర్ సర్కారు ఒకటికాదు.. రెండు కాదు 18 లేఖలు రాసింది. రేవంత్‌రెడ్డీ.. అబద్ధమాడేందుకు కొంచమైనా సంశయం ఉండొద్దా? ఏమైనా అనుకుంటారు.. బయట అడుగతారనే విజ్ఞత కూడా ఉండొద్దా? – హరీశ్‌రావు