హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజావ్యతిరేక పాలన..మీ సర్కారు వైఖరిపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో మీరు ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామసభల సాక్షిగా తేటతెల్లమైంది. ఊరూరా తిరగడబడుతున్న జనం..ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే కాంగ్రెస్ ఏడాది పాలన ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అర్హులందరికీ రైతురుణమాఫీ, రైతుభరోసా, పంటలకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పి భారీగా కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశాల్లో.. మంత్రులు పక్క రాష్ర్టాల్లో బిజీగా ఉంటే ప్రజలనెవరు పట్టించుకోవాలని మంగళవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా మధ్య గ్రామసభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణమని, పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఓ వైపు గ్రామసభలు నిర్వహిస్తుంటే, మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. అ లాంటప్పుడు గ్రామసభలు తూతూ మంత్రం గా నిర్వహిస్తున్నట్టేనా? అర్హులకు పథకాలు ఎగ్గొడుతున్నట్టేనా? అంటూ ప్రశ్నించారు.
హామీలిస్తం.. ఎగ్గొడుతమంటే ఇట్లనే ఉంటది
‘ఎన్నికల ముందు హామీలిస్తం.. ఇప్పుడు ఎగ్గొడుతం అంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తరు’ అని హరీశ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల పాపం అధికారులకు శాపంగా మారిందని పేర్కొన్నారు. సర్కారు నిర్వాకం చూస్తుంటే ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, పంటబోనస్, ఇందిరమ్మ ఇండ్లు అన్నీ దగా అనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమైందని దుయ్యబట్టారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి నోళ్లు మూయించడం విడ్డూరమని విరుచుకుపడ్డారు. ‘నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గపు పాలనను నిలదీస్తున్నది..అడుగడుగునా ప్రశ్నిస్తున్నది..మీ రాక్షస పాలనలో విసిగి వేసారిన ప్రజలు ఉప్పెనగా మారి ఉద్యమించకముందే కండ్లు తెరవండి’ అంటూ చురకలంటించారు. ఇప్పటికైనా ప్రజలను హింసించడం మాని పాలనపై దృష్టి పెట్టిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కృష్ణా, గోదావరి బోర్డుతో తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం
కృష్ణా, గోదావరి బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయేనని, ఇందుకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని హరీశ్ తేల్చిచెప్పారు. కృష్ణా, గోదావరి నదుల జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఏకిపారేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా ఉన్నదున్నట్టుగా ఖుల్లంఖుల్లాగా చెప్పిన విషయాన్ని హరీశ్ ఉదహరిస్తూ ఎక్స్ వేదికగా సీఎం సహా ఇతర మంత్రులు అసంబద్ద వాదన చేస్తున్నారని తేలిపోయిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లోగడ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొన్న 34-66 శాతం ఒకే సంవత్సరానికి అని, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం తెలంగాణకు 71 శాతం నీటి కేటాయింపులు జరగాలని కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌ను కోరిందని స్పష్టం చేయడం విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించేలా ఉన్నదని తెలిపారు. నీటి వాటాలు తేల్చే వరకు 50-50 కేటాయించాలని 2015న తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు కృష్ణా బోర్డు ముందు తేల్చడం వంటి అంశాలు దాచేస్తే దాగని సత్యాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ 89 పెట్టి, రాష్ర్టాల బదులు ప్రాజెక్టుల ఆధారంగా నీటి పంపిణీ జరిగేలా చేసింది, కృష్ణా, గోదావరి బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని మండిపడ్డారు.