ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి.. తెలంగాణ జాతి సంపద.. వాటిని అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలకు కూడా భూమి లేకుండా పోతదని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. అధికారంలోకి వస్తే ఇంచుకూడా ప్రభుత్వ భూమిని అమ్మబోమని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములను అర్రాస్ పెట్టేందుకు తెరలేపిండు.
– హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ప్రతి అంశంలోనూ నాలుక మడతేస్తు న్న సీఎం రేవంత్‌రెడ్డి, భూముల అమ్మకంపై నా ప్లేటు ఫిరాయించి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలంబాట పట్టాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. భూముల వేలంపై రేవంత్ వైఖరిని చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకొనే దుస్థితి దాపురించిందని మంగళవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అని చెప్పి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూముల అమ్మకానికి కుట్ర చే స్తున్నాడని మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ పేరి ట వేలం పాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి గత నెల 28న టెండర్లు పిలవడం రేవంత్ సర్కార్ దిగజారుడు తనానికి పరాకాష్ట అని అభివర్ణించారు.
కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25 పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టి రూ.25 కోట్లకు ఎకరం చొప్పున రూ.10 వేల కోట్లను ఇప్పటికే సమీకరించారని, ఇప్పు డు అదే భూమిని వేలం వేసి రూ.30 వేల కోట్ల సమీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకున్నదని తెలిపారు. బ్యాంకులో తన ఖా పెట్టడం, ఆ భూములనే వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కపటబుద్ధిని గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఆధారాలతో సహా బయటపెట్టామని గుర్తుచేశారు.
2024, జూన్ 26న విడుదల చేసిన జీవో ఎంఎస్ 54 తో ఎకరానికి రూ.75 కోట్ల చొప్పున మొత్తం రూ.30 వేల కోట్ల విలువైన భూములు అమ్ముతున్నారని తాను అసెంబ్లీ వేదికగా నిలదీస్తే.. అలాంటిదేమీ లేదని, టీజీఐఐసీకి చేస్తున్న భూబదలాయింపు మాత్రమేనని బుకాయించారని నిప్పులుచెరిగారు. నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు తప్పుడు సమాధానం చెప్పి, సభను, సభ్యులను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే అదే భూమిని తనఖా పెట్టి 10 వేల కోట్ల రుణం తెచ్చుకొని, ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ మొదలయ్యేలోపే అదే భూమి అమ్మకానికి టెండర్లు పిలుస్తున్నారని మండిపడ్డారు.
ఆ భూములను అమ్ముకోవాలన్నా కేసీఆర్ పదేండ్లలో సాధించిన అభివృద్ధిని ప్రచారం చేసుకోక రేవంత్ సర్కార్‌కు తప్పడం లేదని హరీశ్ పేర్కొన్నారు. తెలంగాణ దివాలా తీసిందంటూనే రేవంత్ సర్కార్ రూపొందించిన ఆర్ఎఫ్పీలో ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్ అయ్యిందని, ఇండస్ట్రియల్ పాలసీ దేశానికే తలమానికమని పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. 2011-12లో రూ.3.6 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ, 2020-21 నాటికి రూ.11.5 కోట్లకు చేరిందని, దేశంలోనే అత్యధిక ఎకనమిక్ గ్రోత్ నమోదును పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. భూములు అమ్ముకొనేందుకు డాక్యుమెంట్ల రూపంలో చెప్తున్న తెలంగాణ అభివృద్ధి గణాంకాలను, బహిరంగంగా ఎం దుకు ఒప్పుకోవడం లేదని రేవంత్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్ దాచాలని ఎంత ప్రయత్నం చేసినా దాగని సత్యమని స్పష్టంచేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో గజం భూమి కూడా అమ్మలేదని అసెంబ్లీ వేదికగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించి మూడు నెలలు కూడా కాకముందే వేల కోట్ల ఆస్తులను కొల్లగొట్టే కుట్ర పన్నుతున్నరు. నిధుల సమీకరణ పేరుతో నిస్సిగ్గుగా భూములను అడ్డికి పావుసేరుకు అమ్ముతుండటం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనం.
– హరీశ్‌రావు
భూమి. తెలంగాణకు పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బతికేందుకు.. మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ప్రభుత్వ ఆస్పత్రులుగాని, విద్యాలయాలు గాని చివరికి సచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమిలేని పరిస్థితి ఉంటది. తెలంగాణ జాతి సంపదను, ఐదేండ్ల కోసం ఎన్నికైన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ భూ ములు అందుబాటులో లేకపోతే ఎట్లా? చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది
– పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం
రూ.75 కోట్లకు ఎకరం చొప్పున రూ.30 వేల కోట్ల విలువ జేసే భూమిని జీవో 54 ద్వారా 2024, జూన్ 26న ప్రభుత్వం అమ్మింది. ఈ భూమిని కుదవపెట్టి టీజీఐఐసీ వాళ్లు బ్యాంకుల్లో రూ.20 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు మూడు నెలల నుంచి కాలికిబలపం కట్టుకొని తిరుగుతున్నరు.
– డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో హరీశ్‌రావు
రెవెన్యూ సెక్టారు నుంచి టీజీఐఐసీకి ట్రాన్స్ఫర్ అయింది. అంతే తప్పితే ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క గజం అమ్మినట్టు మీరు రుజువు చేయండి
– అసెంబ్లీలో హరీశ్ ప్రశ్నకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సమాధానం